కాంగ్రెస్ గ్రాఫ్​ అప్​.. 2018తో పోలిస్తే 11% పెరిగిన ఓట్​ షేర్​

కాంగ్రెస్  గ్రాఫ్​ అప్​.. 2018తో పోలిస్తే 11%  పెరిగిన ఓట్​ షేర్​
  • 10% పడిపోయిన బీఆర్​ఎస్​ ఓట్​ షేర్​
  • ప్రస్తుతం కాంగ్రెస్​కు 39.40%, బీఆర్​ఎస్​కు 37.35, 
  • బీజేపీకి 13.90%,  ఎంఐఎంకు 2.22% ఓట్లు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ఓటు షేర్​ను కాంగ్రెస్  అనూహ్యంగా పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీతో దాదాపు 40 శాతం ఓటు బ్యాంకును తన ఖాతాలో వేసుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం వస్తే.. ఈసారి దాదాపు 11 శాతం పెంచుకొని 39.40 శాతంగా నమోదు చేసుకుంది. పార్లమెంట్, జీహెచ్ఎంసీ ఎలక్షన్లతో పాటు మధ్యలో వచ్చిన అసెంబ్లీ బై ఎలక్షన్లలోనూ ఓట్ల పర్సంటేజీలో కాంగ్రెస్​ వెనుకబడినప్పటికీ ఇప్పుడు పుంజుకుంది. ఇక.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 34.3 శాతం,  2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87 శాతం ఓటు షేర్​తో ఉన్న బీఆర్ఎస్... ఈ సారి దాదాపు 10 శాతం కోల్పోయి 37.35శాతం దగ్గర ఆగిపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి 13.90శాతం, ఎంఐఎంకు 2.22 శాతం, బీఎస్పీకి 1.37 శాతం ఓట్లు పోలయ్యాయి. నోటాకు 0.73 శాతం వచ్చాయి. 

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని..!

ఎన్నికల వేళ పల్లెల్లో గట్టి క్యాడర్​ను ఏర్పరుచుకున్న కాంగ్రెస్.. ఓటర్లను అదే స్థాయిలో తమ వైపు తిప్పుకున్నది. 2014 నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొని.. చివరకు ఆ పాఠాలతో ఈసారి అన్ని పార్టీల ఓటు బ్యాంకును దెబ్బతీస్తూ.. తన గ్రాఫ్​ను అమాంతం పెంచుకుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 25.2 శాతం, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. లోక్​సభ ఎన్నికల్లో 29.48 శాతానికి ఓటు బ్యాంకును పెంచుకుంది. ఆ తరువాత  దుబ్బాక బై పోల్​లో 13.48 శాతం ఓట్లు రాగా,  జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో  6.64 శాతం మాత్రమే ఓట్లు  వచ్చాయి.  గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఇవ్వలేదు. మునుగోడు ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. హుజూరాబాద్​ బై పోల్​లోనూ కాంగ్రెస్  దెబ్బతిన్నది. అయితే ఆ పరిస్థితులన్నింటిని తిరగరాస్తూ గట్టి ఓటు బ్యాంకును సంపాదించుకున్నది.  క్యాడర్ ఇతర పార్టీలోకి వెళ్లిందనే మాటలను చెరిపేస్తూ కాంగ్రెస్ పల్లెల్లోకి చేరుకున్నది. వరుస ఎన్నికల్లో ఓటమి వస్తున్నా.. పట్టువదలకుండా కొత్త నాయకులను తయారు చేసుకున్నది. కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీల్లో చేరిన నాయకులు తిరిగి కాంగ్రెస్​లో చేరారు. దీంతో రూరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తన జెండాను ఎగరేసింది. 

బీఆర్​ఎస్​ గ్రాఫ్​ డౌన్​

రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్నామని ప్రకటించుకున్న బీఆర్ఎస్​కు జనాలు ఎన్నికల్లో ఓట్ల ద్వారా తమ వ్యతిరేకతను స్పష్టం చేస్తూ వచ్చారు. దుబ్బాక, హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేశారు. మునుగోడు ఉప ఎన్నిక టైమ్​లో మంది, మర్బాలన్ని దింపినా కేవలం 4 శాతం ఓట్లతోనే ఆ పార్టీ గట్టెక్కింది. ఓవరాల్​గా చూస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్  88 సీట్లు సాధించింది. అప్పుడు ఆ పార్టీకి 46.87 శాతం ఓట్లు పడ్డాయి.  ఆ తర్వాత 2019 లోక్​సభ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లలో 9 మాత్రమే గెలుచుకుంది.  అప్పుడు బీఆర్​ఎస్​ ఓట్ల శాతం 41.29కి పడిపోయింది. తర్వాత అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ గ్రాఫ్​ పడిపోతూ వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో ఏకంగా 37.35 శాతానికి బీఆర్​ఎస్​ ఓట్​ షేర్​ పడిపోయింది. 
 
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం 39.40. బీఆర్ఎస్ ఓటు శాతం 37.35. రెండు పార్టీల ఓట్ల తేడా 2.05 శాతం. రెండు పార్టీల మధ్య 2.05 శాతం ఓట్ల తేడా ఉంటే 25 సీట్లు కాంగ్రెస్ కు ఎక్కువగా వచ్చాయి. 


 
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలిస్తే, కాంగ్రెస్ నుంచి చేరినవాళ్లు, బైపోల్స్ సీట్లతో 104కి పెరిగాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎలక్షన్ కు ముందున్న బలంతో పోలిస్తే బీఆర్ఎస్ 65 సీట్లు నష్టపోయింది. ఇప్పుడు కాంగ్రెస్, దాని మిత్రపక్షం సీపీఐ (ఒక్క సీటు) కలిసి గెలిచిన మొత్తం స్థానాలు కలిపితే 65కు చేరింది.