
మంచిర్యాల జిల్లా: చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐలో జరిగిన అవకతవకలపై మంచిర్యాల ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా వివరాలు వెల్లడించారు. ఈ రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బ్యాంకు అధికారులు చెప్పారు. ఆగస్ట్ 21న బ్యాంకులో ఉన్న డబ్బు లెక్కల్లో లోపాలు ఉన్నట్లుగా బ్రాంచ్ మేనేజర్ గుర్తించి తమకు సమాచారం అందించారు రితేష్ గుప్తా తెలిపారు. క్యాషియర్ నరిగె రవీందర్తో కలిపి 10 మంది అనుమానితుల పైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.
బ్యాంకులో మొత్తంగా 12 కోట్ల 61 లక్షల విలువైన బంగారం, కోటీ పది లక్షల 27 వేల 617 రూపాయల డబ్బు మిస్ అయిందని ఫిర్యాదు చేశామని తెలిపారు. బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. వినియోగదారులకు న్యాయం చేస్తామని మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. ఇంత పెద్ద స్కాంలో బ్యాంక్ మేనేజర్ ప్రమేయం లేదా అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు బ్యాంక్ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం గమనార్హం.
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్‌బీఐలో రూ. 12 కోట్లకు పైగా గోల్డ్ ఫ్రాడ్ జరిగిన సంగతి తెలిసిందే. బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న నరిగె రవీందర్ కస్టమర్లకు చెందిన కిలోల కొద్దీ బంగారాన్ని మాయం చేసినట్టు సమాచారం. బ్యాంక్‌లో రెండు రోజులుగా ఉన్నతాధికారులు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లాకర్లలోని బంగారం కనిపించకపోవడంతో కంగుతున్నారు. మొదట రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు ఫ్రాడ్ జరిగి ఉంటుందని భావించినప్పటికీ దానికి మూడు రెట్లు ఉంటుందని అంచనాకు వచ్చినట్టు తెలిసింది. బ్యాంకులో సుమారు 450 మంది కస్టమర్లు బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్లు తీసుకోగా.. అందులో 300 మందికిపైగా గోల్డ్ మాయమైంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆఫీసర్లు బ్యాంక్‌లో ఆడిటింగ్ నిర్వహించారు. ఎస్‌బీఐకి చెందిన స్పెషల్ టీం ఢిల్లీ నుంచి చెన్నూరుకు వచ్చారు.
చెన్నూర్ ఎస్‌బీఐలో బంగారం మాయమైన విషయం తెలుసుకున్న కస్టమర్లు శుక్రవారం ఉదయమే భారీ సంఖ్యలో బ్యాంక్ వద్దకు తరలివచ్చారు. తాము తాకట్టు పెట్టిన, లాకర్లలో దాచుకున్న బంగారం ఉందో, పోయిందో చెప్పాలంటూ మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. తమ బంగారం చూపించాలంటూ ఆఫీసర్లను నిలదీశారు. కస్టమర్ల నుంచి వివరాలు తీసుకున్న ఆఫీసర్లు.. ఆడిటింగ్ పూర్తి కాగానే అన్ని వివరాలు వెల్లడిస్తామని నచ్చజెప్పి వారిని పంపించారు.