వర్షాలకు నాలుగు రోజుల్లో 110 మంది మృతి

వర్షాలకు నాలుగు రోజుల్లో 110 మంది మృతి

పాట్నాబీహార్, ఉత్తరప్రదేశ్ లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. నాలుగురోజుల్లో 110 మంది చనిపోయారు. ఇళ్లతోపాటు, ఆస్పత్రులు కూడా జలమయమయ్యాయి. మోకాలు లోతు నీటితో స్థానికులు అవస్థలు పడుతున్నారు. బీహార్ లో 48 గంటల్లో 13 మంది చనిపోయారు. ఆదివారం బీహార్ లోని భాగల్పూర్  జిల్లాలో  గోడ కూలి ముగ్గురు చనిపోయారు. మరికొంత మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. ఖగ్వాల్​లో ఆటోపై చెట్టు విరిగిపడటంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. భారీ వర్షాల వల్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పట్టాలపై వరదనీరు చేరడంతో పలు రైళ్లను రద్దు చేశారు. బాలియా ఛాప్రా, దర్భంగా సమస్తిపూర్ సెక్షన్ లో పట్టాలు నీట మునగడంతో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు

పాట్నాలో ఎక్కడ చూసిన వాననీళ్లే

భారీ వర్షాలకు పాట్నా జలమయమైంది. రాజేంద్రనగర్ ఏరియా నీట మునిగింది. అన్ని ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్లు వరదనీటితో నిండిపోయాయి. కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.  నివాస ప్రాంతాలు, ఆస్పత్రుల్లోకి వరదనీరు చేరింది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే నడుములోతు నీళ్లలోనే నడిచి వెళ్లాల్సి వస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 18 బోట్లతో సహాయ చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకున్నవారికి ఆహారం, తాగునీటిని సరఫరా చేస్తున్నాయి. పాట్నాలోని లోతట్టు ప్రాంతాలైన కంకర్ బాగ్, గర్దాని బాగ్, డాక్ బంగ్లా, ఎస్కే పురిలో  వర్షం బీభత్సం సృష్టించింది. డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ, రోడ్ల నిర్మాణ శాఖ మంత్రి నంద్ కిశోర్ యాదవ్, జేడీయూ నేత అజయ్ అలోక్, బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ ఇళ్లల్లోకి వరదనీళ్లు ప్రవేశించాయి. పాట్నాలో సోమవారం వరకు వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం నుంచి 200 మి.మీ. రెయిన్ ఫాల్ రికార్డ్ అయినట్లు తెలిపింది. మంగళవారం వరకు స్కూళ్లను మూసివేశారు. శివహర్, సీతామణి, సరన్, బెగుసరయ్, బక్సార్, జామూయ్, మధుబని, ముజఫర్ పూర్ లో ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేశారు. పాట్నా, గోపాల్ గంజ్, షేక్ పురా, చంపారన్,  సివాన్, ఇతర జిల్లాల్లో ఎల్లో ఎలర్ట్ జారీ చేశారు. పాట్నాలో రెండో అతిపెద్ద ఆస్పత్రి అయిన నలంద మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో వర్షపు నీరు ప్రవేశించాయి. ఎమర్జెన్సీ, ఐసీయూ మినహా అన్ని వార్డుల్లోకి మోకాలు లోతు నీరు చేరింది. పరిస్థితి విషమంగా ఉన్న రోగులను పట్నా మెడికల్ కాలేజ్, ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. గర్దనీబాగ్ ఆస్పత్రి ప్రాంగణం కూడా వర్షపు నీటితో నిండిపోయింది. సీఎం నితీశ్ కుమార్ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

చురుగ్గానే రుతుపవనాలు

జూన్ 1తో మొదలైన  మాన్సూన్ సీజన్ సోమవారంతో ముగుస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చెప్పింది. వారాంతం వరకు రుతుపవనాలు వెనక్కి వస్తాయని తెలిపింది. రాజస్థాన్, బీహార్, యూపీలో రుతుపవనాలు చురుగ్గానే ఉన్నాయని తెలిపింది.