ఒక్క ఇందిరమ్మ ఇంట్లో 12 కుటుంబాలు!

ఒక్క ఇందిరమ్మ ఇంట్లో 12 కుటుంబాలు!
  •    డబుల్​ బెడ్​రూం ఇల్లు ఇవ్వని గత బీఆర్ఎస్ సర్కారు
  •     ఇల్లిప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసిన లీడర్లు 
  •     వీలైనప్పుడు ఇతర ప్రాంతాల్లో పనులకు పోయి గుడారాలు వేసుకుని జీవనం

గూడూరు, వెలుగు : అవి మొత్తం పన్నెండు కుటుంబాలు..ఉన్నది ఒకే ఒక్క ఇందిరమ్మ ఇల్లు. దీంతో కొందరు ఇంట్లో..మిగిలిన వారు ఎదురుగా ఉన్న చెట్టు కింద జీవితాలు గడుపుతున్నారు. వాన వచ్చినా..ఎండ వచ్చినా చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు బతుకుతున్నారు. ఇలా ఒక్క రోజు కాదు..రెండు రోజులు కాదు. చాలా ఏండ్ల నుంచి ఇదే పరిస్థితి. డబుల్​బెడ్​రూం ఇండ్లతో ఇరుకు గదుల నుంచి విముక్తి కల్పిస్తామన్న గత పాలకులు ఆశ చూపించడం తప్పించి ఆదుకోకపోవడంతో ఇంకా దుర్భరమైన బతుకే అనుభవిస్తున్నారు.  

ముప్పై ఏండ్ల కింది ఇందిరమ్మ ఇల్లే దిక్కు 

మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం వడ్డెరగూడానికి చెందిన బొంత ముత్తయ్యకు ఇద్దరు భార్యలు.11మంది కొడుకులు. 30 ఏండ్ల కింద అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడా కుటుంబ సభ్యుల సంఖ్య 36కు చేరింది. కూలి పని చేస్తే గాని రోజు గడవదు. 36 మంది ఉండడానికి రెండు గదుల ఇందిరమ్మ ఇల్లు సరిపోకపోవడంతో ఇతర జిల్లాల్లో పనులకు పోతున్నారు. అక్కడే వీలైనన్ని రోజులు గుడారాలు వేసుకుని ఉంటున్నారు. గూడూరులో ఏదైన శుభకార్యం ఉన్నప్పుడు, ఇతర ప్రాంతాల్లో పనులు దొరకనప్పుడు ఇక్కడే ఉంటున్నారు. వంట చేసుకోవడానికి మాత్రమే ఇందిరమ్మ ఇంటిని ఉపయోగించుకుని మిగతా సమయం చెట్ల కిందే బతుకులీడుస్తున్నారు.  

ఆదుకోని బీఆర్ఎస్​ సర్కారు 

చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించడమే గగనమవుతున్న వీరికి ఇల్లు కట్టుకునే స్థోమత లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పడు డబుల్ బెడ్​రూం ఇండ్లు ఇస్తామని చెప్పడంతో తమ కష్టాలు దూరమైనట్టేనని సంబురపడ్డారు. అందరికి కాకపోయినా కొంతమందికి డబుల్​బెడ్​రూం వచ్చినా సర్దుకుపోవచ్చని అనుకున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది లీడర్లు డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు కూడా తీసుకున్నారు.

అయినా ఇల్లు ఇచ్చిన వారు లేరు. ఇల్లు లేదని కనీసం బాత్​రూం, లాట్రిన్ ​కట్టించుకుందామనుకున్నా అదీ వీలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ స్కీం కింద కట్టిస్తామని మరికొందరు లీడర్లు డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. దీంతో అన్ని ఆశలు వదులుకుని చెట్టే ఇల్లనుకుని ఉంటున్నారు. కాంగ్రెస్​ప్రభుత్వమైనా తమను ఆదుకొని జీవనోపాధితో పాటు ఇల్లు కట్టి ఇవ్వాలని కోరుతున్నారు.