ప్రజాపాలన దరఖాస్తులు కోటి 25 లక్షలు

ప్రజాపాలన దరఖాస్తులు కోటి 25 లక్షలు
  • ముగిసిన మొదటి విడత గ్రామ సభలు
  • మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ మంది అప్లై
  • కొత్త రేషన్ కార్డులు, ధరణి, ఇతర సమస్యలపైనా భారీగా అర్జీలు     
  • ఈ నెల 17కల్లా అప్లికేషన్ల కంప్యూటరైజేషన్​
  • గ్రామసభల్లో అప్లై చేసుకోనోళ్లు ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసుల్లో చేసుకోవచ్చు
  • ప్రతి నాలుగు నెలలకోసారి ‘ప్రజాపాలన’ కార్యక్రమం

హైదరాబాద్, వెలుగు : అభయహస్తం స్కీమ్​లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజాపాలన’ గ్రామసభలు నిర్వహించగా, కోటి 25 లక్షల అప్లికేషన్లు అందాయి. గతేడాది డిసెంబర్ 28 నుంచి దరఖాస్తుల  స్వీకరణ మొదలవగా శనివారంతో ముగిసింది. ఎనిమిది రోజుల పాటు గ్రామాల్లో, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో సభలు ఏర్పాటు చేశారు. వీటికి జనం పెద్దఎత్తున తరలివచ్చి గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజు 8 లక్షల దరఖాస్తులు రాగా.. ఆ తర్వాత రోజురోజుకు దరఖాస్తులు పెరుగుతూ వచ్చాయి. మొత్తంగా కోటి 25 లక్షల 84 వేల 383 దరఖాస్తులు వచ్చాయి. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ధరణి, ఇతర సమస్యలపై 20 లక్షల వరకు అర్జీలు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 17లోగా దరఖాస్తులన్నింటినీ ప్రత్యేక సాఫ్ట్​వేర్​లో ఎంట్రీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులకు ట్రైనింగ్​ ఇచ్చారు. ఆదివారం నుంచే దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ ప్రారంభించనున్నారు.

రేపటి నుంచి మండలాఫీసుల్లో ఇవ్వొచ్చు

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామసభల్లో అప్లికేషన్లు తీసుకున్నది. ఆరు గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులు స్వీకరించింది.
 
దరఖాస్తులకు ఆధార్, తెల్ల రేషన్​కార్డు జత చేయాలని చెప్పింది. రేషన్ కార్డు లేనోళ్ల దగ్గరి నుంచి కూడా అప్లికేషన్లు తీసుకున్నది. కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఆధార్ కార్డుల్లో మార్పుల వల్లనో, రేషన్ కార్డు లేదనో, ఇతర ఇబ్బందులతోనో చాలామంది ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు ఇవ్వలేకపోయారు. అలాంటి వాళ్లు తమకు పథకాలు రావేమోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ముగిసినా, ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలిపారు. సోమవారం నుంచి ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో అప్లికేషన్లు తీసుకోనున్నారు. అలాగే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ‘ప్రజాపాలన’ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

అర్హత ఉన్న  ప్రతి కుటుంబానికి లబ్ధి!

కుటుంబ యాజమాని పేరు మీద దరఖా స్తులు స్వీకరించారు. అప్లికేషన్​లో కుటుంబ సభ్యులందరి వివరాలు నమోదు చేసుకునేలా ఆప్షన్స్​ ఇచ్చారు. ఈ లెక్కన ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు వచ్చినట్టుగా ప్రభుత్వం భావిస్తున్నది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆరు గ్యారంటీలనూ అమలు చేయాలని అనుకుంటున్నది. ఒక్కో ఇంటి నుంచి కనీసం ఇద్దరు లబ్ధిదారులు ఉంటారని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇస్తేనే, దీనిపై స్పష్టత వస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఆసరా పింఛన్లు, రైతుబంధు అందుతున్నోళ్లు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో చాలా వరకు అప్లికేషన్లు తగ్గినట్టు తెలిసింది. లేదంటే దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగేదని ఆఫీసర్లు చెబుతున్నారు.