
జొహన్నెస్‌బర్గ్/ ముంబై: ఐపీఎల్ రీస్టార్ట్‌కు రంగం సిద్ధం అవుతుండగా.. ఫారిన్ ప్లేయర్ల అందుబాటుపై సందేహాలు తొలగడం లేదు. ముఖ్యంగా ప్లేఆఫ్స్ దశలో పలు ఫ్రాంచైజీలు కీలక ప్లేయర్ల సేవలు కోల్పోనున్నాయి. సౌతాఫ్రికా ప్లేయర్లంతా ప్లే ఆఫ్స్‌కు దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల11వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నేపథ్యంలో లీగ్ కంటే నేషనల్ టీమ్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని తమ ప్లేయర్లకు సౌతాఫ్రికా బోర్డు సూచించింది.
ఈ నెల 26 తర్వాత తమ టెస్టు క్రికెటర్లంతా స్వదేశానికి తిరిగి రావాలని పేర్కొనడంతో ప్లే ఆఫ్స్‌లో పలు జట్లు సఫారీల సేవలు కోల్పోనున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ టీమ్‌కు ఎంపికైన ఆస్ట్రేలియా క్రికెటర్లతో పాటు ఈ నెల 29 నుంచి జరిగే వెస్టిండీస్–ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు ఎంపికైన ఇరు జట్లలోని పలువురు ఐపీఎల్ ప్లేయర్లూ లీగ్‌లో కొనసాగడంపై సందిగ్దత నెలకొంది.
వాయిదాతో ఇబ్బంది
ఇండియా–పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఆగిన ఐపీఎల్ శనివారం తిరిగి ప్రారంభం కానుంది. అయితే, ఈ నెల 25న జరగాల్సిన ఫైనల్.. జూన్ 3వ తేదీకి మారడం సఫారీ ప్లేయర్లతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఇబ్బందిగా మారింది. లీగ్ ముగిసేంత వరకూ ప్లేయర్లను అందుబాటులో ఉంచాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులను బీసీసీఐ కోరింది.
కానీ, క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నాహాలపై దృష్టి పెట్టింది. లీగ్‌లో పాల్గొనడం ప్లేయర్ల పర్సనల్ చాయిస్ అంటూనే డబ్ల్యూటీసీ సన్నాహాలే తమ మొదటి ప్రాధాన్యత అని సీఎస్‌ఏ డైరెక్టర్ ఎనోచ్ ఎన్‌క్వే తెలిపారు. ‘మే 26 తర్వాత టెస్ట్ ఆటగాళ్లు తిరిగి రావాలని మేం ప్లాన్ చేశాం. ఈ విషయంలో బీసీసీఐ, ఐపీఎల్‌తో చర్చలు జరుపుతున్నాం’ అని తెలిపారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపికైన ఎనిమిది మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్‌లో వివిధ జట్లకు ఆడుతున్నారు. వారిలో కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్), లుంగి ఎంగిడి (బెంగళూరు), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), మార్‌క్రమ్ (లక్నో), ర్యాన్ రికెల్టన్ (ముంబై), కార్బిన్ బాష్ (ముంబై), మార్కో యాన్సెన్ (పంజాబ్ కింగ్స్), వియాన్ మల్డర్ (సన్‌రైజర్స్) ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. కానీ, ఐపీఎల్ లీగ్ దశ ఈనెల 27తో ముగియనుంది.
29 నుంచి జూన్ 3 వరకు జరిగే ఫ్లే ఆఫ్స్‌తో సీఎస్‌ఏ డబ్ల్యూటీసీ ప్రిపరేషన్స్‌తో క్లాష్ వస్తోంది. తమ ప్లేయర్లు ఈ నెల 26 నాటికి తిరిగి రావాలని బీసీసీఐతో ఒప్పందం చేసుకున్నామని, ఈ ప్లాన్‌లో మార్పు ఉండదని సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రీ కాన్రాడ్ స్పష్టం చేశాడు. సీఎస్‌ఏ గట్టి వైఖరి తీసుకుంటుండగా క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లకు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇచ్చింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా తమ నో -అబ్జెక్షన్ సర్టిఫికెట్లను సమీక్షిస్తోంది.
ఏ జట్టులోకి ఎవరొస్తున్నారు?
పంజాబ్ కింగ్స్ జట్టులోని ఫారిన్ ప్లేయర్లు- మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మిచెల్ ఓవెన్ - తిరిగి వస్తున్నారు. మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ రాకపై ఇంకా స్పష్టత లేదు. ఆర్‌సీబీ టీమ్‌కు ఆడుతున్న ఇంగ్లండ్ ప్లేయర్లు ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్ మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండవచ్చు. జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) గాయంతో లీగ్‌కు దూరం కానున్నాడు. జాకబ్ బెథెల్ (ఇంగ్లండ్), రొమారియో షెపర్డ్ (వెస్టిండీస్), లుంగి ఎంగిడి (సౌతాఫ్రికా) గురించి క్లారిటీ రావాల్సి ఉంది.
ముంబై ఇండియన్స్ జట్టులో ట్రెంట్ బౌల్ట్ సహా విదేశీ ప్లేయర్లంతా తిరిగి రానున్నారు. అయితే, విల్ జాక్స్, కార్బిన్ బాష్ ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. గుజరాత్ టైటాన్స్ జట్టులో జోస్ బట్లర్, గెరాల్డ్ కోయెట్జీ మినహా విదేశీ ఆటగాళ్లంతా ఇండియాలోనే ఉన్నారు. అయితే, బట్లర్, రబాడ, రూథర్‌ఫోర్డ్‌కు లీగ్ దశ తర్వాత ఎన్‌ఓసీ లభిస్తుందా అనేది స్పష్టంగా తెలియడం లేదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నా కెప్టెన్ పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ తిరిగి రానున్నారు. హెన్రిచ్ క్లాసెన్ కూడా జట్టులో చేరనున్నాడు. అయితే, ఇతర విదేశీ ఆటగాళ్లు - ఎషాన్ మలింగ, కమిందు మెండిస్, వియాన్ మల్డర్ - రాకపై స్పష్టత లేదు. సీఎస్కే ఫారిన్ ఆటగాళ్లు నూర్ అహ్మద్, డెవాల్డ్ బ్రెవిస్, మతీష పతిరణ, డెవాన్ కాన్వే జట్టులో చేరనున్నారు. రచిన్ రవీంద్ర రాకపై స్పష్టత లేదు. సామ్ కరన్ జట్టులో చేరే అవకాశం ఉన్నా.. జెమీ ఓవర్టన్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి రావడం కష్టం. ర్-మెక్‌గర్క్ లీగ్‌ను వైదొలిగాడు. మిగిలిన విదేశీ ఆటగాళ్లు త్వరలో జట్టులో చేరనున్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోని విండీస్ ప్లేయర్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రోవ్‌మన్ పావెల్ తోపాటు క్వింటన్ డికాక్, రహ్మనుల్లా గుర్బాజ్ జట్టులో చేరనున్నారు. అయితే, మొయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్ రాకపై స్పష్టత లేదు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో మార్‌క్రమ్, జోసెఫ్ మినహా మిగతా ఫారినర్స్ అంతా తిరిగి రానున్నారు. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. గాయంతో జోఫ్రా ఆర్చర్ మిగిలిన సీజన్ నుంచి తప్పుకున్నాడు. హెట్‌మయర్, హసరంగ, ఫజల్‌హాక్ ఫారూఖీ, మఫాకా, లువాన్ ప్రిటోరియస్ అందుబాటులో ఉంటారు.