
ఖట్మండ్: నేపాల్ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు నేపాల్ ను ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. నేపాల్ మొత్తం నీట మునిగింది. ఎటు చూసిన నీళ్లే..కొన్నిప్రాంతాల్లో ఇండ్లు మొత్తం నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ఇండ్లకు ఇండ్లే బురదల్లో కూరుకుపోయాయి.
గడిచిన 24 గంటల్లో నేపాల్ లో వరదలు, కొండచరియలు విరిగిపడి 14 మంది మృతిచెందారు. కొండచరియలు విరిగిపడి 8 మంది, పిడుగులు పడి ఐదుగురు, వరద ల్లో కొట్టుకుపోయి ఒకరు మృతిచెందినట్లు నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడిక్షన్ అండ్ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. ఇద్దరు ఆచూకీ లేకుండా పోయారు. తాప్లెజంగ్, పంచతర్, శంఖువసభ, సింధుపాల్‌చౌక్, రసువా, చిత్వాన్, లామ్‌జంగ్, పర్బత్, మయాగ్డి, నవల్‌పరాసి ఈస్ట్, గుల్మీ, డాంగ్, కస్కీ జిల్లాలు ఎక్కువగా వరద ప్రభావితమయ్యాయి.
నేపాల్ హోం మినిస్ట్రి ప్రకారం.. రుతుపవనాల కారణంగా కురుస్తున్న 33 జిల్లాల్లో కుండపోత వర్షాలకు గత 15 రోజుల్లో వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగి పడి మొత్తం 28 మంది చనిపోయారు. వీరిలో కొండచరియలు విరిగిపడి 14 మంది, పిడుగుపాటుకు 13 మంది, వరదల్లో ఒకరు మృతి చెందారు.
ఖాట్మండుకు పశ్చిమాన 125 కిమీ దూరంలో ఉన్న లామ్‌జంగ్ జిల్లాలో రాత్రిపూట కొండచరియలు విరిగిపడి మూడు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇద్దరు పిల్లలతో సహా నలుగురు వ్యక్తులు మృతిచెందారు. నేపాలీ రాజధానికి ఆగ్నేయంగా 500 కి.మీ దూరంలో ఉన్న మోరాంగ్ జిల్లాలో మంగళవారం నుంచి వరదలు నలుగురి ప్రాణాల ను బలిగొన్నాయి. పశ్చిమాన కస్కీ , తూర్పు నేపాల్‌లోని ఓఖల్‌ధుంగాలో కొండచరియలు విరిగిపడటంతో మరో ముగ్గురు మరణించారు.
ప్రతి యేటా నేపాల్ లో వరదలు , కొండచరియలు విరిగిపడటం వల్ల వందలాది మంది చనిపోతున్నారు. ఇవి ఎక్కువగా పర్వత ప్రాంతాలైన నేపాల్‌లో వర్షాకాలంలో జూన్ నుండి సెప్టెంబరు మధ్య ఎక్కువగా వరదలు సంభవిస్తాయి. ఇండ్లు , ఆస్తులు కోల్పోయి వందలాది మంది రోడ్డు పడతారు.