పార్టీ మారినోళ్లు గెలవలే

పార్టీ మారినోళ్లు గెలవలే

హైదరాబాద్ / ఖమ్మం, వెలుగు : 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, ఫార్వర్డ్ బ్లాక్  పార్టీల నుంచి గెలిచి.. బీఆర్ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. పార్టీ మారిన మొత్తం 14 మందిలో 12 మందిని ఓడించారు.  గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిచారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని బీఆర్ఎస్ గెల్చుకుంది. మిగిలిన 18 మందిలో 12 మంది పార్టీని వీడారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అలాగే, టీడీపీ నుంచి గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్​రావు, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సైతం బీఆర్ఎస్ కుండువా కప్పుకున్నారు.  

వీరిలో ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. మిగిలిన 14 మంది మళ్లీ కారు గుర్తుపై పోటీ చేయగా.. కేవలం ఇద్దరే విజయం సాధించారు. ఎల్బీ నగర్​లో  సుధీర్​రెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. సొంత ప్రయోజనాల కోసమే వారంతా బీఆర్ఎస్ లో చేరారని, వారిని చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ చేసిన ప్రచారం కలిసివచ్చింది.

ఆ నలుగురికీ తప్పని ఓటమి

మునుగోడు ఉప ఎన్నిక టైంలో బీజేపీ హైకమాండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తోందని, దానిని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్​రెడ్డి బయట పెట్టారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అప్పట్లో గొప్పగా చెప్పారు. దొంగ స్వాములను అడ్డుపెట్టుకొని బీజేపీ కుట్ర చేస్తోందని ఆడియో, వీడియో సాక్ష్యాలతో బయట పెట్టామని పేర్కొన్నారు. బీజేపీ దూతలుగా వచ్చిన స్వాములను రోహిత్​రెడ్డి మొయినాబాద్​లోని తన ఫాం హౌస్​కు పిలిపించి సాక్ష్యాలతో సహా బయట పెట్టారని చెప్పారు.

బీజేపీ కుట్రలను ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్​రెడ్డి , రోహిత్​రెడ్డి బయట పెట్టారని అభినందించారు. వీరిలో గువ్వల బాలరాజు ఒక్కరే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలువగా, మిగతా ముగ్గురు కాంగ్రెస్​లో గెలిచి బీఆర్ఎస్​లో చేరారు. ఈ నలుగురికి ఈ ఎన్నికల్లో మళ్లీ టికెట్లు ఇవ్వగా అందరూ ఓడిపోయారు. తాండూరులో పైలెట్ రోహిత్ రెడ్డికి టికెట్ఇచ్చేందుకు ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్​రెడ్డితో ఆగస్టులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిం చారు. అయినా తాండూరులో బీఆర్ఎస్​ గెలవలేదు.