14 వేల739 మంది బాధితులు.. 606 కోట్ల లూటీ.. ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్ పేరుతో దోచుకున్న సైబర్ నేరగాళ్లు

14 వేల739 మంది బాధితులు..  606 కోట్ల లూటీ.. ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్ పేరుతో  దోచుకున్న సైబర్ నేరగాళ్లు
  • రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 8 నెలల్లోనే దోపిడీ
  • షేర్ మార్కెట్‌‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ట్రాప్ 
  • సోషల్ మీడియా వేదికగా గ్రూపులు ఏర్పాటు.. నకిలీ యాప్‌‌లలో పెట్టుబడులు పెట్టించి మోసం
  • బాధితుల్లో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులు, స్టూడెంట్లు

రంగారెడ్డి జిల్లా హయత్‌‌నగర్‌‌‌‌ మండలం హస్తినాపురానికి చెందిన రియల్ ఎస్టేట్‌‌ వ్యాపారికి ఈ ఏడాది జులై 13న మౌనిక పేరుతో వాట్సప్‌‌ మెసేజ్‌‌ వచ్చింది. అందులో https://m.ironfxsvip.vip పేరుతో సైబర్ నేరగాళ్లు లింక్‌‌ పంపించారు. తామిచ్చే టిప్స్‌‌తో షేర్ మార్కెట్‌‌లో పెట్టుబడులు పెడితే, పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ చూపారు. బాధితుడితో ముందుగా రూ.50 వేలు ఇన్వెస్ట్‌‌ చేయించి, 24 శాతం లాభం వచ్చినట్టు చూపారు. ఇలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి, బాధితుడి నుంచి ఆగస్టు 23 వరకు రూ.4.87 కోట్లు వసూలు చేశారు.

హైదరాబాద్‌‌, వెలుగు: 
ఒకప్పుడు ఓఎల్‌‌ఎక్స్‌‌ యాడ్స్‌‌తో మొదలైన సైబర్ మోసాలు.. రోజురోజుకు రూపం మార్చుకుంటున్నాయి. సైబర్ నేరగాళ్లు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆన్‌‌లైన్‌‌లో అందినకాడికి దోచుకుంటున్నారు. వాట్సప్‌‌, టెలిగ్రామ్‌‌, ఎక్స్‌‌ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌ల వేదికగా ఇన్వెస్ట్‌‌మెంట్ ఫ్రాడ్స్‌‌ చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు, స్టూడెంట్స్, గృహిణులకు ఈజీమనీ ఆశగా చూపి మోసాలకు పాల్పడుతున్నారు. షేర్ మార్కెట్‌‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి, ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్‌‌ఫామ్‌‌ల పేరుతో సోషల్ మీడియాలో లింక్‌‌లు పంపించి రూ.వందల కోట్లు కొట్టేస్తున్నారు.  ఇలా ఈ ఏడాది 8 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 14,739 మంది నుంచి రూ.606.40 కోట్లు దోచుకున్నారు.  

గ్రూపులు క్రియేట్ చేసి.. 

సైబర్ నేరగాళ్లు వాట్సప్‌‌‌‌, టెలిగ్రామ్‌‌‌‌, ఎక్స్‌‌‌‌, ఇతర సోషల్‌‌‌‌ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ వేదికగా ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌, ట్రేడింగ్‌‌‌‌కు సంబంధించి గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రూపులో ఎక్కువ మందిని చేర్చుతున్నారు. ఇలాంటి గ్రూపుల్లో సభ్యులుగా సైబర్ నేరగాళ్లే ఉండి చాటింగ్‌‌‌‌ చేస్తున్నారు. ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ల పేరుతో నకిలీ లింకులను గ్రూపులో పోస్టు చేస్తున్నారు.  అందులో పెట్టుబడి పెడితే తమకు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వచ్చాయంటూ ఇతరులను నమ్మిస్తున్నారు. 

ఇలా ఆ గ్రూపులోని అమాయకులను ట్రాప్‌‌‌‌ చేసి, రూ.5 వేలు మొదలు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. మొదట్లో 15 శాతం లాభాలు వచ్చాయంటూ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ అకౌంట్‌‌‌‌లో చూపుతున్నారు. వాళ్లను నమ్మించేందుకు కొద్ది మొత్తం విత్‌‌‌‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. ఆ తర్వాత అకౌంట్‌‌‌‌యాక్టివ్‌‌‌‌లో ఉండాలంటే తమ సూచనలకు అనుగుణంగా డిపాజిట్స్ చేయాలని చెబుతున్నారు. 

టాస్క్‌‌‌‌ల పేరుతో ట్రాప్ చేసి.. 

వివిధ టాస్క్‌‌‌‌ల పేరిట అమాయకులను సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేస్తున్నారు. ‘‘అమెజాన్ సహా ఇతర మల్టీ నేషనల్‌‌‌‌ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను మేం ప్రమోట్‌‌‌‌ చేస్తున్నాం. మీరు కేవలం మీ ఫోన్‌‌‌‌లో స్క్రీన్ షాట్‌‌‌‌ తీసి రేటింగ్ ఇస్తే చాలు. ఒక్కో క్లిక్, ఒక్కో స్క్రీన్ షాట్‌‌‌‌కు రూ.200 చొప్పున ఇస్తాం” అని నమ్మిస్తున్నారు. ఇది ఈజీ టాస్క్ కావడంతో చాలా మంది గృహిణులు, యువతులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా తమ ట్రాప్‌‌‌‌లో చిక్కిన వారికి తక్కువ మొత్తంలో డబ్బు విత్‌‌‌‌డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నారు. 

ఇందుకోసం ప్రత్యేక వర్చువల్ అకౌంట్లకు పాస్‌‌‌‌వర్డ్స్‌‌‌‌, ఐడీలు క్రియేట్‌‌‌‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌ వైపు మళ్లిస్తున్నారు. ట్రేడింగ్ సైట్లలో చేరాలని యూజర్ ఐడీ, పాస్‌‌‌‌వర్డ్ ఇచ్చి రిజిస్ట్రేషన్‌‌‌‌ చేస్తున్నారు. నమ్మించేందుకు పలు ఫ్యాబ్రికేటెడ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ అకౌంట్లు, పేమెంట్‌‌‌‌ రిసీట్లతో పెట్టుబడి పెట్టించి.. వివిధ ట్యాక్సుల పేరుతో వసూలు చేస్తున్నారు. 

వర్చువల్‌‌‌‌ అకౌంట్లలోనే అసలు మాయ.. 

బాధితులు ఇన్వెస్ట్ చేసిన డబ్బుతో పాటు డెయిలీ ఎర్నింగ్‌‌‌‌ అమౌంట్‌‌‌‌, కమీషన్‌‌‌‌ పేరుతో యాప్‌‌‌‌ నిర్వాహకుల వర్చువల్ అకౌంట్స్‌‌‌‌లో అమౌంట్ కనిపిస్తుంది. పెట్టిన పెట్టుబడికి అవసరమైతే 10 రెట్లు కూడా లాభాలు చూపుతుంటారు. ఈ అమౌంట్‌‌‌‌ను డిపాజిట్‌‌‌‌ చేసినోళ్లు విత్‌‌‌‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. కొంతమేరకు మాత్రమే విత్‌‌‌‌డ్రా చేసుకునే అవకాశం ఇస్తారు.  

ఈ సమయంలో విత్‌‌‌‌డ్రా చేసుకునే అమౌంట్‌‌‌‌కు సంబంధించి తప్పుడు ఎంట్రీ చేశారని, మొత్తం డబ్బు కోల్పోతారని భయాందోళనకు గురిచేస్తుంటారు. ఇందుకుగాను ఆర్బీఐ నిబంధనల ప్రకారం ట్యాక్సులు, జరిమానాలు చెల్లించాలని చెప్తారు. ఆ తరువాతే మొత్తం డబ్బు విత్‌‌‌‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని నమ్మిస్తాను. ఇలా తమ టార్గెట్‌‌‌‌ పూర్తి చేసుకున్న తరువాత బాధితుడి అకౌంట్‌‌‌‌ను డిసెబుల్‌‌‌‌ చేస్తున్నారు. చివరకు బాధితుల ఫోన్ నంబర్స్ బ్లాక్ చేస్తుంటారు.  

చందానగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ యువకుడు హైటెక్‌‌‌‌ సిటీలోని ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. షేర్ మార్కెట్‌‌‌‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. అతణ్ని ఆగస్ట్‌‌‌‌ 1న ‘వీఐపీ 263’  పేరుతో ఉన్న టెలిగ్రామ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌లో యాడ్‌‌‌‌ చేశారు. మొదటి విడతగా రూ.50 వేలు పెట్టుబడి పెట్టించి, 6.62 శాతం ప్రాఫిట్‌‌‌‌ వచ్చినట్టు చూపారు. ఈ క్రమంలోనే పెట్టుబడి పెట్టించి, లాభాలు చూపించి కమీషన్లు, వివిధ ట్యాక్స్‌‌‌‌ల పేరుతో మొత్తం రూ.3.31 కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బులను విత్‌‌‌‌ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో బాధితుడు మోసపోయానని గ్రహించాడు.  

లాభాలకు ఆశపడి మోసపోతున్నరు.. 

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు, ట్రేడింగ్‌‌‌‌కు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్‌‌‌‌ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాల్లో ట్రేడింగ్‌‌‌‌, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫ్రాడ్స్‌‌‌‌లోనే బాధితులు రూ.కోట్లల్లో కోల్పోతున్నారు. లాభాలు వస్తున్నాయని నమ్మి అప్పులు చేసిన మరీ ట్రేడింగ్‌‌‌‌ చేస్తున్నారు. ఇలాంటి వారిలో ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులే అధికంగా ఉంటున్నారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన ఉన్నప్పుడే నియంత్రణ సాధ్యం. మోసం జరిగిన వెంటనే 1930 లేదా ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌పీ పోర్టల్‌‌‌‌ ద్వారా ఫిర్యాదు చేస్తే డబ్బు ఫ్రీజ్‌‌‌‌ చేసే అవకాశం ఉంటుంది.  
- శిఖాగోయల్‌‌‌‌, డైరెక్టర్, 
సైబర్ సెక్యూరిటీ బ్యూరో