
ముంబైని వణికించిన వర్షాలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 133 భవనాలు నేల కూలగా, 15 మంది చనిపోయారు. ఇవాళ్టి నుంచి మరో ఐదు రోజులపాటు యూపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అలర్ట్ గా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటక, గోవా, కొంకణ్ తీర ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాంలలో కూడా ఇవాళ(శనివారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.