ఒక్క రోజే 1500 మరణాలు.. దేశంలో కొత్తగా 2.61లక్షల మందికి కరోనా

ఒక్క రోజే 1500 మరణాలు.. దేశంలో కొత్తగా 2.61లక్షల మందికి కరోనా
  • దేశంలో కొత్తగా 2.61 లక్షల మందికి కరోనా
  • ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరం: కేజ్రీవాల్‌
  • తమిళనాడులో ప్రతి ఆదివారం లాక్‌డౌన్‌
  • కఠినమైన ఆంక్షల దిశగా బెంగళూరు
  • మహారాష్ట్రలో 67 వేలు, ఢిల్లీలో 25 వేల కేసులు
  • తమిళనాడులో  ప్రతి ఆదివారం లాక్‌‌డౌన్‌‌
  • కఠినమైన ఆంక్షల దిశగా బెంగళూరు

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా నాలుగో రోజూ 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 15.6 లక్షల టెస్టులు చేయగా 2.61 లక్షల మంది వైరస్‌‌ బారిన పడ్డారు. ఇందులో మహారాష్ట్రలో 67 వేలు, ఢిల్లీలో 25 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.47 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. 1.38 లక్షల మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారని, దీంతో మొత్తం రికవరీలు 1.28 కోట్లకు చేరాయని వివరించింది. ప్రస్తుతం 18,01,316 యాక్టివ్‌‌ కేసులు ఉన్నాయంది. వైరస్‌‌ బారిన పడి గత 24 గంటల్లో 1,501 మంది ప్రాణాలు కోల్పోయారని.. ఇందులో మహారాష్ట్రలో 419, ఢిల్లీలో 167, చత్తీస్‌‌గఢ్‌‌లో 158, ఉత్తరప్రదేశ్‌‌లో 120 మంది చనిపోయారని తెలిపింది. దేశంలో ఒక్కరోజులో ఇంత ఎక్కువ మంది మరణించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,77,150కు చేరింది.   
92 రోజుల్లో 12 కోట్ల డోసులు
దేశంలో 92 రోజుల్లో 12.26 కోట్ల వ్యాక్సిన్‌‌ డోసులను పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది. ఈ లక్ష్యం చేరుకోవడానికి అమెరికాలో 97 రోజులు, చైనాలో 108 రోజులు పట్టిందని తెలిపింది. ఆరోగ్య సిబ్బందిలో 91లక్షల మందికి పైగా తొలి డోసు టీకా తీసుకున్నారని, 57 లక్షల మంది రెండో డోసు వేసుకున్నారని చెప్పింది. ఫ్రంట్‌‌ లైన్‌‌ వర్కర్లలో 1.12 కోట్ల మంది తొలి డోసు, 55 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం డోసుల్లో 8 రాష్ట్రాల్లోనే 59.5 శాతం ఇచ్చారని వివరించింది. ఇందులో మహారాష్ట్రలో 1.21 కోట్లు, ఉత్తరప్రదేశ్‌‌లో 1.07 కోట్లు, గుజరాత్‌‌లో 1.03 కోట్ల డోసులు ఇచ్చారంది. గత 24 గంటల్లో 26 లక్షల డోసులు పంపిణీ చేశారు. 
ఢిల్లీలో నిండిపోతున్న ఆస్పత్రులు
ఢిల్లీలో గత 24 గంటల్లో 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌‌ కేజ్రీవాల్‌‌ అన్నారు. కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రులపై ఒత్తిడి ఎక్కువవుతోందని, ఐసీయూలన్నీ రోగులతో నిండిపోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 100 బెడ్లే ఉన్నాయన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం సాయం చేస్తోందని చెప్పుకొచ్చారు. బెడ్ల కోసం ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం స్పోర్ట్స్‌‌ కాంప్లెక్సులను వాడుకుంటున్నామని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని, వైరస్‌‌ను ఎదుర్కోవడానికి అనేక మార్గాలున్నాయని ధైర్యం చెప్పారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్యాసింజర్ల ఆర్టీపీసీఆర్‌‌ రిపోర్టులు పరిశీలించని 4 ఎయిర్‌‌లైన్స్‌‌పై ఢిల్లీ సర్కారు కేసులు నమోదు చేసింది. బెడ్లకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చిన రెండు ప్రైవేటు హాస్పిటల్స్‌‌పైనా కేసులు పెట్టింది. 
బెంగళూరులో లాక్‌‌డౌన్‌‌ అవసరం ఉంది: మంత్రి సుధాకర్‌‌
కరోనా కేసులు పెరుగుతుండటంతో బెంగళూరులో మరింత కఠినమైన ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉందని కర్నాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్‌‌ అన్నారు. ఇదే విషయాన్ని సీఎం యడియూరప్పకు చెప్పానన్నారు. బెంగళూరులో లాక్‌‌డౌన్‌‌ విధించడంపై సీఎంతో మాట్లాడానని, సోమవారం జరిగే ఆల్‌‌ పార్టీ మీటింగ్‌‌లో అందరి అభిప్రాయం తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
తమిళనాడు, బీహార్‌‌లలో నైట్‌‌ కర్ఫ్యూ
ప్రతి ఆదివారం పూర్తి లాక్‌‌డౌన్‌‌ పెడుతున్నట్టు తమిళనాడు సర్కారు వెల్లడించింది. మిగతా రోజుల్లో నైట్ కర్ఫ్యూ ఉంటుందని తెలిపింది. బీహార్‌‌లోనూ నైట్ కర్ఫ్యూ విధించారు. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌‌ సెంటర్లను మే 15 వరకు మూసే ఉంచాలని చెప్పారు.
ఢిల్లీలో బెడ్లు పెంచండి ప్రధాని మోడీకి కేజ్రీవాల్ లెటర్
ఢిల్లీలో కేంద్ర సర్కారు పరిధిలోని ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలని ప్రధాని మోడీకి.. సీఎం కేజ్రీవాల్ ఆదివారం లేఖ రాశారు. కేంద్రం పరిధిలో 10  వేల బెడ్లు ఉన్నాయని, ఇందులో 1,800 బెడ్లను మాత్రమే కరోనా పేషెంట్లకు రిజర్వ్ చేశారని, 7 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ సరఫరా కూడా పెంచాలని కోరారు. డీఆర్డీవో అందుబాటులోకి తెస్తున్న 500 ఐసీయూ బెడ్ల కెపాసిటీని వెయ్యికి పెంచాలని రిక్వెస్ట్ చేశారు. బెడ్ల కొరత, ఆక్సిజన్  సరఫరా అంశాలను ఇప్పటికే, కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్ష వర్ధన్ దృష్టికి తీసుకెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఐసీయూ బెడ్లు దాదాపు ఫుల్ అయ్యాయని, ఆక్సిజన్ సరఫరా సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.