
15 లక్షల ఉద్యోగాలు లభించాయి: మంత్రి సబిత
హైదరాబాద్, వెలుగు: ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 17వేలకు పైగా పరిశ్రమలు రాగా.. 15లక్షల ఉద్యోగావకాశాలు లభించాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొత్తగా1500కు పైగా ఐటీ కంపెనీలు కేవలం మంత్రి కేటీఆర్ కృషివల్లే రాష్ట్రానికి వచ్చాయన్నారు. దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులు ఐటీ రంగంలో పనిచేస్తున్నారని చెప్పారు. ఐటీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకురావాలని అధికారులకు సూచించారు. పరిశ్రమలతో స్టూడెంట్లను అనుసంధానం చేయాలనీ, ఈ దిశగా రోడ్ మ్యాప్ రూపొందించాలని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, టీసీఎస్, టీఎస్ఆన్లైన్ సంయుక్తంగా ‘ఉపాధి పెంపొందించేలా విద్యాబోధన’ అనే అంశంపై సెమినార్ నిర్వహించాయి. ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏటా లక్షల మంది డిగ్రీలతో బయటికెళ్తున్నారు కానీ అంతా ఉపాధి అవకాశాలను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాన్ని మార్చాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. కొన్ని కాలేజీల్లో స్టూడెంట్లు పోటీపడి చేరితే, మరి కొన్నింటి వైపు చూడటం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో స్టూడెంట్లు పోటీపడి చేరే
రోజులు రావాలన్నారు. ఈ దిశగా కోర్సులను రూపొందించాలన్నారు.
స్టూడెంట్ల ఆలోచన మారుతోంది
ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. నిరంతరం ఇంటర్న్‌షిప్, ఆంట్రప్రెన్యూర్, ఫ్యాకల్టీ ఓరియంటేషన్‌లను నిర్వహించడం ద్వారానే స్టూడెంట్లను ఉద్యోగాలకు సన్నద్ధం చేయగలమని చెప్పారు. స్టూడెండ్ల ఆలోచనలు మారుతున్నాయని సెలవుల్లోనూ కొందరు ఇంటర్న్ షిప్‌లు వెతుక్కుంటున్నారని పేర్కొన్నారు. కొందరు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు హాజరుకాకుండా, రీసెర్చ్ చేసి ఏదో ఒక పరిశ్రమను స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ తరహాలో మన విద్యావిధానాన్ని సమూలంగా మార్చాలని ఆయన అన్నారు.