సికింద్రాబాద్​ స్టేషన్​ విధ్వంసకాండలో 1500 మంది

సికింద్రాబాద్​ స్టేషన్​ విధ్వంసకాండలో 1500  మంది

అగ్నిపథ్​ స్కీమ్​ ను నిరసిస్తూ ఈనెల 17న (శుక్రవారం) ఉదయం 8.56  గంటల సమయంలో సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్ లోకి 1500 మంది చొరబడి విధ్వంసానికి తెగబడ్డారని రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు.  గేట్​ నంబర్​ 3 నుంచి అకస్మాత్తుగా స్టేషన్​ లోకి  వచ్చిన నిరసనకారులు తమతో తెచ్చుకున్న పెట్రోల్ తో రైలు బోగీలను తగులబెట్టారని తెలిపారు.  ఆదివారం రాత్రి నిర్వహించిన  ప్రెస్​ మీట్​లో ఘటన చోటుచేసుకున్న క్రమాన్ని ఆమె వివరించారు.  ‘‘పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. నిరసనకారులు  రైల్వే ట్రాక్​ పైకి వెళ్లి రాళ్లను రువ్వారు. దీంతో 30 రైలు కోచ్​ లు దెబ్బతిన్నాయి. నాలుగు రైలు కోచ్​లను పెట్రోలు పోసి తగులబెట్టారు. వీటిలో రైల్వే మెయిల్​ సర్వీస్​ కూడా ఉంది. తగులబడిన సమయంలో అందులో చాలా కార్గో ఉంది”అని పేర్కొన్నారు.

20  రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది..

ఆందోళనకారులను నిలువరించేందుకు రైల్వే పోలీసులు గాల్లోకి 20  రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చిందని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. నిరసనకారుల దాడిలో తొమ్మిది మంది పోలీసు సిబ్బంది గాయపడినట్లు చెప్పారు.  మొత్తం 46  మందిని అరెస్టు చేశామన్నారు. అరెస్టయిన వారంతా తెలంగాణ వారేనని స్పష్టం చేశారు. సీసీ  కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, మిగితా నిరసనకారులను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోందని వివరించారు. నిరసనకారులు  దాడికి..  కొన్ని రోజుల ముందు నుంచే వాట్సాప్ గ్రూప్ లు పెట్టి  స్టేషన్​పై ఎటాక్​ చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పారు. ఈ కుట్ర వెనుక కోచింగ్ సెంటర్ల పాత్ర కూడా ఉందని, వాటిని గుర్తించే దిశగా దర్యాప్తు జరుగుతోందన్నారు.  ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  అలాంటి వారికి భవిష్యత్తు లో ప్రభుత్వ ఉద్యోగాలు  రావని స్పష్టం చేశారు.  ఇక రైల్వే ఆర్పీఎఫ్​ ఇంచార్జి సుధాకర్​ మాట్లాడుతూ..  ‘‘56  రైల్వే కోచెస్ డ్యామేజ్ అయ్యాయి. కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. ఇంకా దర్యాప్తు జరుగుతోంది. కేసును హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేశాం” అని తెలిపారు.