
ఏటూరునాగారం, వెలుగు: జిల్లాలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, రైతులకు అక్కడే ట్రక్ షీట్అందించాలని ములుగు కలెక్టర్ దివాకర సూచించారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, తాడ్వాయి, వెంకటాపురం, గోవిందరావుపేట పరిధిలోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
జిల్లాలో వానాకాలానికి సంబంధించిన దాదాపు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు లక్ష్యంగా 175 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతుల ధాన్యం నాణ్యతను వ్యవసాయ విస్తరణ అధికారులు పరిశీలించి ధ్రువీకరించాలని పేర్కొన్నారు.
ఏటీసీలను వినియోగించుకోవాలి
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లలో నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఏటూరునాగారం, వాజేడు మండలాల్లోని ప్రభుత్వ ఆర్‌ఐటీఐలలో కొత్తగా ఏర్పాటుచేసిన ఏటీసీ కేంద్రాలను ఆయన సందర్శించారు. క్యాంపస్‌లను పరిశీలించి, సిబ్బందితో, శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి శిక్షణా కార్యక్రమాల పురోగతి, సదుపాయాలు, ఏటీసీ పనుల స్థితిని పరిశీలించారు.