యూపీలో రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

యూపీలో రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  రామ్ సనేహి ఘాట్ సమీపంలోని కొత్వాలి ఏరియాలో రోడ్డు పక్కన ఆపి ఉంచిన డబుల్ డెక్కర్ బస్సును.. వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొన్న ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 19 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. డబుల్ డెక్కర్ బస్సు హర్యాణ నుంచి బీహార్ వెళ్తుండగా... రామ్ సనేహి ఏరియాలో పాడైపోయింది. దాంతో బస్సును అక్కడే నిలిపివేసి ప్రయాణికులు బస్సు ముందు నిద్రపోయారు. అదే టైంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్ బస్సును బలంగా ఢీ కొట్టింది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన టైంలో వర్షం పడడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలిగింది. డెడ్ బాడీలను పోస్టుమార్టమ్ కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మృతులంతా బీహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

కాగా.. ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2 లక్షల రూపాయలు ప్రకటించారు. అదేవిధంగా క్షతగాత్రులకు రూ. 50 వేల ఆర్థికసాయం ప్రకటించారు.