వాహనం లోయలో పడి 19 మంది మృతి 

వాహనం లోయలో పడి 19 మంది మృతి 
  •  చనిపోయిన వారిలో 18 మంది మహిళలు
  • మృతులంతా తునికాకు సేకరించే ఆదివాసీలు.. చత్తీస్​గఢ్​లోని 
  • కవర్థా జిల్లాలో ఘోర ప్రమాదం
  • వెహికల్ బ్రేకులు ఫెయిల్ అయినట్టు పోలీసుల అనుమానం
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, చత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లో ఒక వాహనం లోయలో పడి 19 మంది ఆదివాసీలు దుర్మరణం చెందారు. మృతుల్లో 18 మంది మహిళలు ఉన్నారు. కవర్ధా జిల్లాలోని కుకుదూర్​ పోలీస్​స్టేషన్ పరిధిలో బహ్పానీ గ్రామం సమీపంలోని బంజారా ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కవర్ధా జిల్లాలోని సెంహారా గ్రామానికి చెందిన 36 మంది ఆదివాసీలు తునికాకును సేకరించేందుకు సోమవారం ఉదయం అడవిలోకి వెళ్లారు.

ఆకు సేకరించిన తర్వాత మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు 25 మంది ఆదివాసీలు ఒక వాహనంలో సొంతూరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. బహ్పానీ వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి 40 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది. ప్రమాదంలో డ్రైవర్​తో పాటు 19 మంది అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మృతదేహాలు ఘటనాస్థలంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల గ్రామాల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వారు వచ్చి గాయపడ్డ వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కవర్ధా ఎస్పీ డా.అభిషేక్ పల్లవ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బహ్పానీ గ్రామం సమీపంలోకి వచ్చాక ‘‘బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.. బండి పడిపోతది అని డ్రైవర్ ఒక్కసారిగా అరిచాడు.. వాహనంలోంచి ఒకరిద్దరు పురుషులు కిందకు దూకారు” అని గాయపడిన వారు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు.

కొండ ప్రాంతాల్లో, ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపే వారు ఎప్పటికప్పుడు వాటి ఫిట్ నెస్​ను చెక్​చేస్తుండాలని సూచించారు. మరోవైపు ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ, చత్తీస్​గఢ్​ సీఎం విష్ణు దేవ్ ​శాయి, డిప్యూటీ సీఎం విజయ్ ​శర్మ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.