ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసుకు సంబంధించిన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళను కిలోమీటర్ల కొద్దీ లాక్కెళ్లిన కారులోని ఐదుగురు వ్యక్తులతో ముడిపడిన పలు అంశాలు కూడా దర్యాప్తులో బయటపడ్డాయి. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1వ తేదీన వేకువజామున ఆ ఐదుగురు వ్యక్తులు కలిసి కారులోనే దాదాపు రెండున్నర బాటిళ్ల మద్యం తాగారని పోలీసులు గుర్తించారు. ఢిల్లీ శివారులోని హర్యానా గ్రామం ముర్తాల్ ధాబాలకు చాలా ఫేమస్. ముర్తాల్ లోని ధాబాలో విందు చేసేందుకు ఈ ఐదుగురు కలిసి ఢిల్లీ నుంచి కారులో బయలుదేరారు. అయితే వారు ముర్తాల్ కు చేరుకోలేదని.. దారి గురించి కన్ఫ్యూ్జ్ అయి మార్గం మధ్యలోనే ఉత్తర ఢిల్లీలోని తమ ఇళ్లకు వెనుదిరిగారని విచారణలో వెల్లడైంది.
ముర్తాల్ నుంచి ఢిల్లీ వైపు వచ్చే క్రమంలో కారులోనే వీళ్లు రెండున్నర బాటిళ్ల మద్యం తాగారు. కారును ఆపి రోడ్డు పక్కన చిరుతిండ్లను తిన్నారు. అనంతరం కారులో బయలుదేరిన వీరు మద్యం మత్తులో ఒక స్కూటీని ఢీకొట్టారు. ఆ స్కూటీని అంజలి సింగ్ డ్రైవింగ్ చేస్తుండగా.. వెనుక ఆమె స్నేహితురాలు నిధి కూర్చొని ఉంది. వేకువజామున 2 గంటల సమయంలో ఢిల్లీలోని సుల్తాన్ పురి ఏరియాలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఒక హోటల్ లో విందుకు హాజరయ్యాక.. స్కూటీపై ఇళ్లకు బయలుదేరిన కొన్ని నిమిషాలకే అంజలి సింగ్, నిధి ఈ ప్రమాదం బారినపడటం గమనార్హం.
ఆ ఐదుగురిని అరెస్టు చేసిన అనంతరం పోలీసులు విచారించగా.. అంజలి సింగ్ కాలు తమ కారు ముందు టైరులో ఇరుక్కుపోయిందనే విషయాన్ని మద్యం మత్తులో గుర్తించలేకపోయామని చెప్పారు. ఇదే విధంగా అంజలి సింగ్ ను దాదాపు 13 కిలోమీటర్ల పాటు కారుతో లాక్కెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చివరకు కాంఝావాలా ఏరియా సమీపంలో కారును ఆపగా.. కింది భాగంలో అంజలి సింగ్ చేయి వేలాడుతూ కనిపించింది. దాన్ని చూసి భయపడిన ఐదుగురు ఆమె మృతదేహాన్ని అక్కడే పడేసి కారులో పరారయ్యారు.