
- అత్యాధునిక టెక్నాలజీతో కూల్చివేత చేపట్టిన టీఎస్‌ఐఐసీ
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటి కూల్చివేతను చేపట్టారు. టీఎస్‌ఐఐసీ అధికారుల అనుమతులు తీసుకొని ఎడిఫైస్ ఇంజినీరింగ్ అండ్ జెట్ డిమాలిషన్ అనే ప్రైవేట్ సంస్థ వాటిని కూల్చివేసింది. ఐదంతస్తుల చొప్పున ఉన్న ఈ రెండు భవనాల్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని కూల్చివేయాలని సంబంధిత యాజమాన్యం నిర్ణయించింది.
దీంతో టీఎస్‌ఐఐసీ అధికారుల పర్మిషన్స్ తీసుకొని కూల్చివేశారు. ఈ భవనాల కూల్చివేతకు భారీగా పేలుడు పదార్థాలను ఉపయోగించారు. కేవలం 5 సెకన్లలోనే అవి నేల మట్టం అయ్యాయి. వీటి పక్కన ఉన్న బిల్డింగులకు ఎలాంటి నష్టం జరగకుండా కూల్చివేత చేపట్టారు. దీంతో ఆ ఏరియాలో భారీగా దుమ్మూ ధూళీ అలుముకుంది. కాగా, ఈ కూల్చివేతకి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని జీహెచ్ఎంసీ ఆఫీసర్లు తెలిపారు.