పాండురంగాపురంలో బొడ్రాయి ప్రతిష్ఠకు చందా ఇవ్వలేదని.. 20 కుటుంబాల బహిష్కరణ

పాండురంగాపురంలో బొడ్రాయి ప్రతిష్ఠకు చందా ఇవ్వలేదని.. 20 కుటుంబాల బహిష్కరణ
  • భద్రాద్రి జిల్లా పాండురంగాపురంలో ఘటన

పినపాక, వెలుగు : బొడ్రాయి ప్రతిష్ఠకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో సుమారు 20 కుటుంబాలను బహిష్కరించారు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగాపురం గ్రామంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠకు ఓ ప్రజాప్రతినిధి ఆధ్వర్యలో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతిష్ఠ ఖర్చుల కోసం గ్రామంలోని ప్రతి ఇంటికి రూ.6 వేలు చందా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే 20 కుటుంబాలకు చెందిన వారు చందా ఇచ్చేందుకు నిరాకరించారు.

దీంతో వారి ఇండ్లకు ఎవరూ వెళ్లొద్దని, వారికి చెందిన షాపుల్లో కొనుగోలు చేయొద్దని ఆంక్షలు విధించారు. దీంతో పాటు సదరు కుటుంబాలకు చెందిన రేషన్‌‌‌‌ కార్డులు రద్దు చేయిస్తామని, కరెంట్‌‌‌‌, తాగునీటి సరఫరా నిలిపివేస్తామని బెదిరించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో సునీల్‌‌‌‌కుమార్‌‌‌‌, ఎంపీవో వెంకటేశ్వరరావు గ్రామానికి చేరుకొని కమిటీ సభ్యులతో మాట్లాడారు. బలవంతపు వసూళ్లకు పాల్పడినా, ప్రభుత్వ పథకాలు నిలిపివేసేందుకు ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.