28 రాష్ట్రాలు.. 20 మంది ప‌ర్వతారోహ‌కులు.. అత్యంత ఎత్తైన శిఖ‌రాల‌పై జెండా ఎగిరేశారు

28 రాష్ట్రాలు..  20 మంది ప‌ర్వతారోహ‌కులు.. అత్యంత ఎత్తైన శిఖ‌రాల‌పై జెండా ఎగిరేశారు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (ఎన్ఐఎంఏఎస్)కు చెందిన 20 మంది ప‌ర్వతారోహ‌కులు అరుదైన ఫీట్ సాధించారు. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ఎత్తైన శిఖ‌రాల‌పై జాతీయ జెండాల‌ను ఎగుర‌వేశారు. హ‌ర్ శిఖ‌ర్ తిరంగా మిష‌న్‌లో భాగంగా 20 మంది ప‌ర్వతారోహ‌కులు ఈ కార్యక్రమంలో సాహోసోపేతంగా పాల్గొన్నారు.

 ఆజాదీ కా అమృత్ మ‌హోత్సవ్‌లో భాగంగా ఈ మిష‌న్ చేప‌ట్టారు. అరుణాచ‌ల్ ప్రదేశ్‌కు చెందిన అడ్వంచ‌ర్ స్పోర్ట్స్ విభాగం చాలా సాహ‌సోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 2022, అక్టోబ‌ర్ 16న అరుణాచ‌ల్ ప్రదేశ్ నుంచి ప‌ర్వతారోహ‌ణ మొదలు పెట్టారు. దేశ‌వ్యాప్తంగా ఆ బృందం 30 వేల కిలోమీట‌ర్లు తిరిగింది.

అక్టోబ‌ర్ 3వ తేదీన సిక్కింలో ఉన్న మౌంట్ జాంగ్‌సాంగ్ అధిరోహించే క్రమంలో ప‌ర్వతారోహ‌కులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. క్లౌడ్ బ‌స్ట్ వ‌ల్ల ఆక‌స్మిక వ‌ర‌ద‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చిందని వివరించారు. ఆ రోజు రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో తాము సేద‌తీరుతున్నామ‌ని, ఆ స‌మ‌యంలోనే ఒక్కసారి వ‌ర‌ద నీరు దూసుకువ‌చ్చింద‌ని, అయితే 10 నిమిషాల్లోనే త‌మ బృందం అల‌ర్ట్ అయ్యింద‌ని చెప్పారు. స్వయంగా ప‌ర్వతారోహ‌కులు కావ‌డం వ‌ల్ల తాము కొండ‌ల మీద‌కు ఎక్కామ‌ని, ఆ ప‌ది నిమిషాల్లో.. కింద వైపు కాకుండా.. పైకి వెళ్లడం వ‌ల్ల త‌మ ప్రాణాలు ద‌క్కాయ‌ని క‌ల్నల్ ర‌ణ్‌వీర్ సింగ్ జ‌మ్మాల్ అనే పర్వతారోహకుడు తెలిపారు.

కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎత్తైన శిఖ‌రాల వ‌ద్దకు రోడ్డు స‌దుపాయాలు కూడా లేవని, మరికొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టు స‌మ‌స్యలు ఎదుర‌య్యాయ‌ని, కొన్ని రాష్ట్రాల్లో భాషా స‌మ‌స్యలు త‌లెత్తిన‌ట్లు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వ‌ర‌కు అత్యంత ఎత్తైన శిఖ‌రాల‌కు ఎటువంటి నామ‌క‌ర‌ణం చేయ‌లేద‌న్నారు. పంజాబ్‌లోని నైనా దేవి రేంజ్‌లో ఉన్న అత్యంత ఎత్తైన శిఖ‌రానికి ఇంకా పేరు పెట్టలేద‌ని క‌ల్నల్ తెలిపారు.