తొలి విడతలో 20 మందికి కార్పొరేషన్ల చైర్మన్​ పోస్టులు!

తొలి విడతలో 20 మందికి కార్పొరేషన్ల చైర్మన్​ పోస్టులు!

హైదరాబాద్, వెలుగు:  వివిధ కార్పొరేషన్లకు​చైర్మన్ల నియామకంపై కాంగ్రెస్​ పార్టీ దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. లోక్​సభ ఎన్నికల్లోపు తొలి విడతగా 20 మందికి పదవులివ్వాలని నిర్ణయించారని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే కొందరి పేర్లతో లిస్ట్​ కూడా రెడీ అయినట్టు చెప్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉన్న కొందరికి తొలి విడతలోనే చైర్మన్​​పదవులను ఇవ్వనుందని తెలిసింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 54 కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను రద్దు చేస్తూ జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా పోస్టులకు పార్టీలో పోటీ తీవ్రంగా పెరిగింది. వందల మంది లీడర్లు ఆ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీ పెద్దలకు విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. పార్టీ కోసం వారు చేసిన సేవలను వివరిస్తున్నారు. 

యువ నేతలతో లిస్టు సిద్ధం?

కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటికే కొందరి పేర్లను పార్టీ పెద్దలు పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. చాలా వరకు యువతకే పెద్దపీట వేసే యోచనలో కాంగ్రెస్​ పార్టీ ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గోషామహల్​ టికెట్​ ఆశించిన ఫిషర్​మెన్​ కాంగ్రెస్​ చైర్మన్​ మెట్టు సాయి, ఓయూ విద్యార్థి నేత బాల లక్ష్మి, ఎన్​ఎస్​యూఐ స్టేట్​ ప్రెసిడెంట్​ బల్మూరి వెంకట్, యూత్​ కాంగ్రెస్​ స్టేట్​ ప్రెసిడెంట్​ శివసేనా రెడ్డి, చరణ్​ కౌశిక్​ యాదవ్, పున్నా కైలాష్​ నేత, భవాని రెడ్డి, కల్వ సుజాత, రవళి, చారకొండ వెంకటేశ్, చిలుకా మధుసూదన్​ రెడ్డి, రాయల నాగేశ్వరరావు, ఒబెదుల్లా కొత్వాల్, రాజీవ్​ రెడ్డి, శంకర్​ నాయక్, బెల్లయ్య నాయక్, బోదనపల్లి వేణుగోపాల్​ రెడ్డి వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారితోపాటు మరికొందరి పేర్లనూ పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారని చెప్తున్నారు. 

80కిపైనే కార్పొరేషన్ల చైర్మన్లు..

గత ప్రభుత్వం 54 కార్పొరేషన్లకే చైర్మన్లను నియమించింది. అయితే, మొత్తం 80కిపైగా కార్పొరేషన్లు ఉన్నాయని, అవన్నీ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయని కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఓ యువనేత చెప్తున్నారు. వాటన్నింటినీ భర్తీ చేస్తే చాలా మందికి న్యాయం చేసినట్టవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి లిస్టు సిద్ధం చేసినా.. ఎవరికి ఏ కార్పొరేషన్​ అన్నది మాత్రం ఇంకా డిసైడ్​ చేయలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బెవరేజెస్​ కార్పొరేషన్, వేర్​ హౌసింగ్, టీఎస్​ఐఐసీ (తెలంగాణ స్టేట్​ ఇండస్ట్రియల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్​), సివిల్​ సప్లైస్, డెయిరీ డెవలప్​మెంట్​ కార్పొరేషన్, రైతుబంధు సమితి, మెడికల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్, ఆర్టీసీ, రోడ్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ వంటి వాటి కోసం ఎక్కువ పోటీ నెలకొన్నట్టు చెప్తున్నారు. అయితే, పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఎన్​ఎస్​యూఐ, యూత్​ కాంగ్రెస్, ఓయూ విద్యార్థి నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. మరోవైపు లోక్​సభ ఎన్నికలకు ముందు కొందరికి పదవులిస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. 

ఎమ్మెల్సీ అభ్యర్థులపైనా దృష్టి

కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికనూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్​ పార్టీ భావిస్తున్నట్టుగా తెలిసింది. గవర్నర్​ కోటా ఎమ్మెల్సీలను మినహాయించి.. మిగతా నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తున్నది. నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్​ ఖాన్​కు ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. అతనితో పాటు వేంనరేందర్​ రెడ్డి, అద్దంకి దయాకర్​ వంటి వాళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.