బన్సాలీ ‘దేవదాసు’ ఎందుకంత ప్రత్యేకమంటే..

బన్సాలీ ‘దేవదాసు’ ఎందుకంత ప్రత్యేకమంటే..

దేవదాసు..ఓ భగ్న ప్రేమికుడు. ప్రేమను గెలిపించుకోలేని పిరికివాడు. కట్టుబాట్లని ఎదిరించి ప్రేమించిన అమ్మాయి చేయి అందుకునే తెగింపు లేక..మందు మత్తులో మునిగి తేలి మరణించిన చేతగానివాడు. అలాంటివాడు ఈ ప్రపంచానికి ఎందుకు నచ్చాడు? శరత్‌చంద్ర అతడి కథను అంత అందంగా రాయడం వల్లనా? లేక ఆ నవలను దర్శకులు అద్భుతంగా తెరకెక్కించడం వల్లనా? ఈ ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టమే. 

దేవదాసు ఓ గొప్ప కలం నుంచి పుట్టాడు. నాటి నుంచి నేటి వరకు వెండితెరపై మళ్లీ మళ్లీ పుడుతూనే ఉన్నాడు. అంటే అతనిలో ఏదో ప్రత్యేకత ఉందనే కదా. అతని కథకి కట్టి పడేసే శక్తి ఉందనే కదా. అందుకేనేమో..1928 నుంచి ఇప్పటి వరకు దేవదాస్ ప్రేమ సెల్యూలాయిడ్‌పై పదే పదే ఊపిరి పోసుకుంటూనే ఉంది. మన దేశంలో బెంగాలీ, మలయాళం, అస్సామీస్, హిందీ, తెలుగు భాషల్లోనే కాదు..బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాల్లో కూడా దేవదాసు కథ తెరకెక్కింది. అయితే వీటన్నింటిలో ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన సినిమాలు రెండు...ఒకటి వేదాంతం రాఘవయ్య తీసిన తెలుగు ‘దేవదాసు’. రెండోది భన్సాలీ తెరకెక్కించిన హిందీ ‘దేవదాస్’. 

సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్‌చంద్ర ఛటర్జీ ఏ ముహూర్తాన ‘దేవదాస్’ నవల రాశాడో గానీ.. మొత్తం అందరి మనసు దాని చుట్టూనే తిరిగింది. దేవదాసును ప్రతి ఇండస్ట్రీ పోటీపడి ప్రేమించింది. ఎట్టేకలకి మనవంతు వచ్చింది. తెలుగు ‘దేవదాసు’కి క్లాప్‌ పడింది. భగ్న ప్రేమికుల కథ. హీరో చచ్చిపోవడం. దీన్ని తట్టుకునే శక్తి ప్రేక్షకులకు లేదేమోనని ఎంతమంది చెప్పినా నిర్మాత డీఎల్ నారాయణ ఒప్పుకోలేదు. సినిమా తీసి చూపించారు. హిట్టు కొట్టి కాలర్ ఎగరేశారు. నాటి మన సినిమాకి ముందు, తర్వాత కలుపుకుని మొత్తం పన్నెండుసార్లు దేవదాసు కథ సినిమా రూపం దాల్చింది. వాటిలో కొన్ని హిట్ అయితే అయ్యుండొచ్చు కానీ మన సినిమా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది మాత్రం మరేదీ లేదు. ఒక్క సంజయ్ లీలా భన్సాలీ తీసిన దేవదాస్ తప్ప. సరిగ్గా ఇరవయ్యేళ్ల క్రితం..ఇదే నెలలోతన మార్క్ దేవదాస్‌ని మార్కెట్లోకి దించాడు భన్సాలీ. 

అందరూ అందరే!

ఏ సినిమాకైనా ఆర్టిస్టుల ఎంపికే మొదటి సక్సెస్. దేవదాస్‌ పాత్రని ఏఎన్నార్ పోషించినంత అద్భుతంగా ఎవరూ పోషించలేదని చాలామంది అంటుంటారు. ఆ తర్వాతి స్థానం బహుశా షారుఖ్‌దే కావచ్చు. కళ్లతోనే ప్రేమను కురిపించే రొమాంటిక్ హీరో ఇమేజ్ అతనిది. ప్రేమలోని బాధని పలికించడంలో ఎక్స్పర్ట్ అతను. అందుకే భన్సాలీ షారుఖ్‌ను ఎంచుకున్నాడు. అతను ప్రాణంగా ప్రేమించే పార్వతిని ప్రేక్షకులూ అంతే ప్రేమించగలగాలి. అందుకే ప్రపంచమే మెచ్చిన ఐశ్వర్యారాయ్‌ని తీసుకున్నాడు. మరో జన్మంటూ ఉంటే నా జీవితంలో నీకు స్థానమిస్తాను అని దేవదాస్‌ లాంటి అమర ప్రేమికుడితో చెప్పించగల చంద్రముఖి కావాలి. అందుకు మాధురీ దీక్షిత్‌ని మించిన చాయిస్‌ లేదు. ఈ ముగ్గురి ఎంపికతోనే మొదటి విజయం సాధించేశాడు భన్సాలీ. సినిమా చూస్తున్నంతసేపూ ఈ ముగ్గురి నుంచీ చూపు తిప్పుకోలేం. అంతగా జీవించేశారు. ఇక వాళ్లని తయారు చేసిన విధానం కూడా ప్రత్యేకమే. దేవదాస్ కాస్త సింపుల్‌గా కనిపించినా.. పార్వతి, చంద్రముఖిల డ్రెస్సింగ్, మేకప్‌ మామూలుగా ఉండవు. రకరకాల గాగ్రా చోళీలు, బెనారస్ చీరలు, సిల్క్ దుస్తులు డిజైన్ చేయించాడు. ఓ పాటలో మాధురీ దీక్షిత్ వేసుకున్న డ్రెస్ ముప్ఫై కిలోల బరువుంది. దాని ధర పదిహేను లక్షల పైనే. ఒక్ర డ్రెస్‌కే అంత పెట్టాడంటే కాస్ట్యూమ్స్‌ పైన ఎంత శ్రద్ధ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. మిగతా పాత్రల విషయంలోనూ భన్సాలీ ఎంతో కేర్ తీసుకున్నాడు. పార్వతి తల్లిగా నటించిన కిరణ్‌ ఖేర్‌‌తో పాటు దేవదాస్‌ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్‌గా నటించిన జాకీ ష్రాఫ్‌ కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తారు. 


             
ఈ దేవదాస్ బాగా రిచ్

భన్సాలీ సినిమా అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేదేంటో తెలుసా.. ఖరీదైన సెట్స్, కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్, కలర్‌‌ఫుల్ విజువల్స్. ‘దేవదాస్’ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కథ ప్రకారం దేవదాసు బాగా డబ్బున్నవాడు. అన్ని సినిమాల్లోనూ అలాగే చూపించారు కూడా. అయితే భన్సాలీ మూవీలో ఆ రిచ్‌నెస్ ఓ రేంజ్‌లో ఉంటుంది. పెద్ద పెద్ద మేడలు.. ఖరీదైన కార్లు.. ఎటు చూసినా ఆడంబరాలు.. ధగధగలు మిలమిలలూ..చూసేవాళ్ల కళ్లు చెదిరిపోవాల్సిందే. పార్వతి ఇల్లు, చంద్రముఖి ఇల్లు, ఆ తర్వాత పార్వతి వాళ్ల అత్తవారిల్లు.. ఏదీ దేనికీ తీసిపోదు. రిచ్‌నెస్ లేని ఫ్రేమ్ అంటూ ఉండదు సినిమాలో. నిజంగా అప్పట్లో అలానే ఉండేదేమో అన్న భ్రమలో పడేస్తాడు ప్రేక్షకుల్ని. నలభై రెండు జెనరేటర్లు, రెండు వేల ఐదొందల లైట్లు పెట్టి మూడు మిలియన్ వాట్ల పవర్‌‌తో వెలిగించిన సెట్స్ ని చూస్తుంటే మామూలుగా ఉంటుందా! కేవలం ఈ లైటింగ్‌ కోసమే ఏడొందల మంది లైట్‌మెన్స్ పని చేశారంటే అది భన్సాలీ సినిమా విషయంలోనే జరుగుతుంది. కేవలం చంద్రముఖి ఇంటి సెట్‌కే నూట ఇరవై మిలియన్లు ఖర్చు పెట్టారంటే చిన్న విషయమా. బాలీవుడ్‌లో అత్యంత కాస్ట్లీ సెట్ ఇదే. ఆర్టిఫీషియల్ సరస్సు, మైల్టీ డైమెన్షనల్ సెట్లు, గ్లాస్ డోర్లు... కేవలం సెట్స్ కే కొన్ని వందల మిలియన్లు ఖర్చు పెట్టే సత్తా భన్సాలీకి మాత్రమే ఉందనేది వాస్తవం. 

మ్యూజికల్‌ ఫీస్ట్

దేవదాస్‌ లాంటి  ప్రేమకథకి సంగీతం ప్రాణం పోస్తుంది. తెలుగు దేవదాసులోనూ ప్రతి పాట హిట్టే. అందుకే భన్సాలీ కూడా మ్యూజిక్‌పై ఫోకస్ పెట్టాడు. ఇస్మాయిల్ దర్బార్‌‌పై బాధ్యత పెట్టాడు. అతడు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఒకటీ రెండూ కాదు.. సినిమాలో తొమ్మిది పాటలుంటాయి. ఈ రోజుల్లో అన్ని పాటలంటే ఎవరికైనా విసుగు పుడుతుంది. కానీ దేవదాస్‌లో ఏ పాటనీ మిస్సవడానికి ఇష్టపడరు ప్రేక్షకులు. వినడానికే కాదు, చూడటానికి కూడా అంత అద్భుతంగా ఉంటాయి మరి. అందుకే బాలీవుడ్ సౌండ్‌ ట్రాక్ ఆఫ్ ద ఇయర్‌‌గా సంచలనం సృష్టించింది ఈ సినిమా ఆడియో. ఆ యేటి టాప్ ఫైవ్ హిందీ ఆల్బమ్స్ లో మొదటి వరుసలో చేరింది. ముఖ్యంగా మాధురీ దీక్షిత్‌పై తీసిన ‘మార్‌‌ డాలా’ సాంగ్‌ టాప్ టెన్ మోస్ట్ లిస్టెడ్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ పాట ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. ఆమధ్య పవన్ కళ్యాణ్ ‘గబ్బర్‌‌సింగ్‌’లోని అంత్యాక్షరి సీన్‌లో కూడా ఈ పాటని వాడారు.

దటీజ్ భన్సాలీ

అందరూ తీసిన, అందరికీ తెలిసిన కథని కూడా తన స్టైల్‌లో తీయడం భన్సాలీకే చెల్లింది. దేవదాస్‌ కథలో లేని మెరుపులు, హంగుల్ని చేర్చడంలోనే కాదు.. సర్‌‌ప్రైజెస్ ఇవ్వడంలోనూ సక్సెస్ అయ్యాడు భన్సాలీ. ముఖ్యంగా అతడు క్రియేట్ చేసిన ఓ సందర్భం సినీ ప్రియుల మనసులు దోచుకుంది. అదే.. చంద్రముఖి, పార్వతి స్నేహితులు కావడం. దేవదాసు కోసం తన వృత్తిని వదిలేస్తుంది చంద్రముఖి. అతని ఆరాధనలోనే గడుపుతూ ఉంటుంది. అది అర్థం చేసుకున్న పార్వతి ఆమెను గౌరవిస్తుంది. ఓ దేవదాసీ అని తెలిసి కూడా తన ఇంట్లోని పూజకి ఆహ్వానిస్తుంది. ఆమెతో కలిసి ఆడిపాడుతుంది. ఆ సీన్స్, వాళ్లిద్దరూ ‘డోలారే డోలారే’ అంటూ చేసిన డ్యాన్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మాధురి, ఐశ్వర్య ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లే కావడం కూడా బాగా కలిసి వచ్చింది. ఇంతవరకు ఎవరికీ రాని థాట్ వచ్చింది, దటీజ్ భన్సాలీ అంటూ హ్యాట్సాఫ్ చెప్పారు. 

ఇన్ని ప్రత్యేకతలున్నా ఈ సినిమాని విమర్శించినవారు లేకపోలేదు. అనవసరమైన హంగులపై ఎక్కువ శ్రద్ధ పెట్టారని, దానివల్ల అసలు సోల్ మిస్సయిపోయిందని కొందరు కామెంట్ చేశారు. నెగిటివ్ రివ్యూస్ కూడా రాశారు. అయితే ఇన్‌వాల్వ్ అయి చూసినవారి మనసుల్ని మాత్రం ఈ సినిమా బలంగా తాకిందని చెప్పాలి. లేదంటే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం ఎందుకు కురుస్తుంది..ఓవర్సీస్‌లో సైతం రికార్డులు ఎలా సృష్టిస్తుంది. చివరికి చైనాలో కూడా హిట్టు కొట్టి రెండొందల యాభై కోట్లకు పైన ఎలా వసూలు చేస్తుంది! ఆరు ఇంటర్నేషనల్ అవార్డులు.. ఐదు నేషనల్ అవార్డులు.. పదకొండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఎలా సాధిస్తుంది. ఇవే సాక్ష్యం.. భన్సాలీ దేవదాస్‌ ద బెస్ట్ అని ఒప్పుకోడానికి.