
- నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 2 వేల కనెక్షన్స్ పెండింగ్
- ఆఫీసుల చుట్టూ రైతుల ప్రదక్షణలు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ ఆఫీసుల్లో అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. డిపార్ట్మెంట్లో బడ్జెట్ లేదనే సాకుతో వ్యవసాయ కనెక్షన్లకు మెటీరియల్ రిలీజ్ చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఏడాది నుంచి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అవసరమయ్యే ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్ ఇతర పరికాలు ఇవ్వకుండా రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో మూడు వేల కనెక్షన్లు..
నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే 2 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లకు మెటీరియల్ రిలీజ్ చేయాల్సి ఉంది. వీటికి వర్క్ ఆర్డర్లు రిలీజ్ చేసి పది నెలలు కావొస్తున్నా మెటీరియల్ మాత్రం సప్లై చేయలేదు. దీని కోసం రైతులు ఆఫీసర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. స్టోర్లలో ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టీ ఏబీ కేబుల్, ఏఏ కండెన్సర్లు, త్రిఫేజ్25 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, 100, 60 కెపాసిటీ కలిగిన ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేయక చాలా కాలమైంది. అడపాదడపా వచ్చిన మెటీరియల్ కూడా సిఫార్సు లేఖలకు, సెక్షన్ ఏఈల సూచన మేరకు అత్యవసరమైన ప్రాంతాల్లో వాడుతున్నారు.
కాగితాలపైనే ప్రపోజల్స్..
నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్క్ ఆర్డర్ రిలీజ్ చేసిన సర్వీసులకు మెటీరియల్ సప్లై చేయలేదు. దాదాపు 350 కిలోమీటర్లకు ప్రతిపాదించిన ఎల్టీ ఏబీ కేబుల్ నాలుగు లక్షల మీటర్లు అవసరం ఉంది. ట్రిపుల్ ఏ కండక్టర్లు 4.50 లక్షలు అవసరం ఉన్నాయి. త్రిఫేజ్ 26 కేవీఏలు 1091 కావాలని ఆఫీసర్లు ఎప్పటి నుంచో కోరుతున్నా డిపార్ట్మెంట్ నుంచి సప్లై చేయడం లేదు.
ఇక పట్టణాల్లో ఓవర్ లోడ్ సమస్య తీర్చేందుకు 400 కిలోమీటర్ల సరిపడా 11 కేవీలకు అల్యూమినియం కండక్టర్లు కావాలని ప్రపోజల్స్ పంపారు. లోవోల్టేజీ నియంత్రించేందుకు 100, 50 కేవీ కెపాసిటీ కలిగిన ట్రాన్స్ఫార్మర్లు 150 కావాలని డిపార్ట్మెంట్ కు ప్రపోజల్ పెట్టి చాలా కాలం అయ్యింది. నెలలు గడుస్తున్నా కండక్టర్లు, కేబుల్స్ సప్లై కాకపోవడంతో రైతులు, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మిర్యాలగూడ, నల్గొండలో సమస్య..
నల్గొండ డివిజన్లోనే ఎక్కువ మంది రైతులు కరెంట్ కనెక్షన్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ ఆర్డర్లు రిలీజ్ చేశారు. కానీ మెటీరియల్ లేక కనెక్షన్లు ఇవ్వలేదు. నల్గొండ డివిజన్లో ఎల్టీ ఏబీ కేబుల్ 92,300 మీటర్లు, ట్రిపుల్ కండ క్టర్లు 65,785, త్రీఫేజ్ 25 కేవీలు 248 అవసరం ఉన్నాయి. దేవరకొండలో 59,677 మీటర్లు, మిర్యాలగూడలో 1,19,685 మీటర్లు ఎల్టీ కేబుల్ అవసరం ఉంది. నల్గొండలో 65, 785, మిర్యాలగూడలో 2,02,360, దేవరకొండలో 99,158 ట్రిబుల్ ఏ కండక్టర్లు అత్యవసరమని అధికారులు చెబుతున్నారు. త్రిఫేజ్ 25 కేవీలు నల్గొండలో 248, మిర్యాలగూడలో 572, దేవరకొండలో 180 అవసరం ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే వీటిని రిలీజ్ చేస్తే పెండింగ్ కనెక్షన్లు క్లియర్ అవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు.