నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

కోదాడ, వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 2 వేల అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. కోదాడకు చెందిన కిట్స్ మహిళా ఇంజినీరింగ్  కాలేజీ స్టూడెంట్లు, స్వర్ణ భారతి ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి  కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి,  ఎంపీపీ చింత కవిత, కిట్స్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణలతో పాటు పలువురు నాయకులు,  అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు సెంటర్ల లో విద్యార్థులు జాతీయ భావాన్ని చాటి చేప్పే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. వజ్రోత్సవ ద్విసప్తహా వేడుకలు ప్రతి ఒక్కరిలో జాతీయతా భావం నింపాయని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్​అన్నారు.

వీఆర్ఏల ‘పే స్కేల్ సాధన జాతర’

సూర్యాపేట, వెలుగు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్  చేస్తూ వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో  సూర్యాపేట ఆర్డీవో ఆఫీస్ ఎదుట సోమవారం ‘వీఆర్ఏల పేస్కేల్ సాధన జాతర’  కార్యక్రమం చేపట్టారు. డోలు వాయిద్య చప్పుళ్లతో పులి వేషధారణలతో వందల మంది  వీఆర్ఏ లు, మహిళలు బోనాలు, బతుకమ్మలను ఎత్తుకుని  కొత్త బస్టాండ్ మీదుగా.. మినీ ట్యాంక్ బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మహమ్మద్ రఫీ, మీసాల సునీల్ గవాస్కర్, లచ్చిమల్ల నరసింహరావు, పాల్వాయి వెంకన్న, శ్రీను మాట్లాడుతూ వీఆర్ఏలకు పేస్కే ల్ జీవో జారీ చేయాలని, ప్రమోషన్లు, వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  జేఏసీ నాయకులు గొబ్బి నర్సయ్య, గొరుగంటి మధుసూదన్ రావు  తదితరులు పాల్గొన్నారు. 

కొత్త పింఛన్లు ఇస్తలేరని రోడ్డెక్కిన్రు..

మిర్యాలగూడ, వెలుగు :  మిర్యాలగూడ హెడ్​ పోస్టాఫీస్​ పరిధిలో శాంక్షన్​అయిన కొత్త పింఛన్ల పంపిణీ నిలిపివేయడంతో లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇటీవల  మిర్యాలగూడ హెడ్​పోస్టాఫీస్​పరిధిలో కొత్తగా 30,874 మందికి పింఛన్లు శాంక్షన్​అయ్యాయి. అయితే ఈ నెల 17న పాత పింఛన్లనే పంపిణీ చేసిన అధికారులు, 18న  ప్రభుత్వ ఆదేశాలతో కొత్త, పాత పింఛన్ల పంపిణీ  నిలిపివేస్తున్నామని చెప్పారు. దీంతో సోమవారం మళ్లీ పింఛన్లు ఇస్తారేమోనని కొత్త, పాత పింఛన్​దారులు  తెల్లవారు జాము నుంచే మిర్యాలగూడ హెడ్​ పోస్టాఫీస్​ వద్దకు చేరుకున్నారు. పింఛన్లు ఇస్తలేమని సిబ్బంది చెప్పడంతో  ఆగ్రహించి మిర్యాలగూడ – కోదాడ  హైవేపై గంటకుపైగా రాస్తారోకో  చేశారు. కౌన్సిలర్లు చెప్పడంతోనే ఉదయం నుంచి లైన్​లో నిలబడ్డామని కానీ ఆఖరికి ఇస్తలేమని చెప్పడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు.  ప్రతి నెలా ఏడోతేదీ  వరకు వచ్చిన పింఛన్లు.. ఇప్పుడు  23 వరకు కూడా ఇస్తలేరని వాపోయారు.  కానీ ఉమ్మడి జిల్లా అంతటా పింఛన్ల పంపిణీ నిలిపేశామని ఇక్కడి పోస్టాఫీస్​ వర్గాలు తెలిపాయి.     

సీసీ రోడ్ల నిర్మాణంలో క్వాలిటీ పాటించాలి

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ మున్సిపాలిటీలో  సీసీ రోడ్లను క్వాలిటీ లేకుండా నిర్మిస్తున్నారని కాంగ్రెస్​ పార్టీ మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్​ బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు. ప్రతి పక్ష కౌన్సిలర్ల​ విషయంలో ప్రొటోకాల్​అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మున్సిపల్​ ఆఫీస్​ ఎదుట కాంగ్రెస్​లీడర్లు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ  సీసీ రోడ్లలో  సిమెంట్​ శాతాన్ని తగ్గించేందుకు స్టోన్​ డస్ట్​ వాడుతున్నారన్నారు.  రాత్రిరాత్రికే వార్డులో సీసీ, ఇతర నిర్మాణ  పనులు పూర్తి చేసి  బిల్లులు లేపుతున్నారని ఆరోపించారు. క్వాలిటీగా పనులు చేపట్టాలని డిమాండ్​చేశారు. కాంగ్రెస్​పార్టీ  పట్టణాధ్యక్షుడు వేణుగోపాల్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, కౌన్సిలర్లు జానీపాష,  శ్రీనివాస్​, శేఖర్​రెడ్డి, యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

దైవ చింతనతో మానసిక ప్రశాంతత

దేవరకొండ(పీఏపల్లి), వెలుగు: దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని శాసనమండలి చైర్మన్ ​గుత్తా సుఖేందర్​రెడ్డి అన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్​ తో కలసి సోమవారం ఆయన పీఏపల్లి మండలం ఘనపురం, పోల్కంపల్లి గ్రామాల్లో  కొత్తగా నిర్మించిన ఆలయాల్లో గ్రామదేవతల ప్రతిష్ఠాపన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దేవరకొండ ఎంపీపీలు జాన్​యాదవ్​, వంగాల ప్రతాప్​రెడ్డి, మున్సిపల్​ చైర్మన్​ఆలంపల్లి నర్సింహ్మ, మాజీ మున్సిపల్​ చైర్మన్​ దేవేందర్​ నాయక్​, గుడిపల్లి సర్పంచ్ శేఖర్​రెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్​వల్లపురెడ్డి, వైస్​ ఎంపీపీ సరిత  పాల్గొన్నారు.

దేవాలయాలతోనే ఆధ్యాత్మిక చింతన

పెన్ పహాడ్, వెలుగు:  ఆలయాలతోనే ఆధ్యాత్మిక చింతన అలవడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల  జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మాచారం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న సీతారామాలయం నిర్మాణానికి భూమిపూజ చేశారు.  నాభిశిల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరై శంకుస్థాపన చేశారు.  వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 

మహా ప్రస్థానం పనులను స్పీడప్ చేయాలి 

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మహా ప్రస్థానం పనులను స్పీడప్​చేయాలని  మంత్రి జగదీశ్​రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం మహా ప్రస్థానం పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా ప్రస్థానం నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

మునుగోడులో కాంగ్రెస్ గెలవడం ఖాయం

చండూరు, వెలుగు: మునుగోడు  బైఎలక్షన్​లో  కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని  డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం చండూరులో ముఖ్య కార్యకర్తలతో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం పార్టీని వీడితే నష్టమేమీ లేదని, నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ  బలంగా ఉందని చెప్పారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మునుగోడులో పొలిటికల్ డ్రామాలు​ఆడుతున్నాయని విమర్శించారు.  ఒకరిని ఒకరు తిట్టుకోవడం కోసమే మీటింగ్స్​పెట్టుకున్నారన్నారు.  ప్రాజెక్టులో భూములు కోల్పోయిన  లక్ష్మణాపురం, చర్లగూడెం, కిష్టరాయునిపల్లి నిర్వాసితులు  ఏడేండ్లుగా నిరసనలు  చేపట్టినా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.  కేసీఆర్ మునుగోడులో అభ్యర్థిని ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి మాట్లాడుతూ  రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారని, మరి మీటింగ్​లో  కేంద్ర హోంశాఖ మంత్రి ఏ అభివృద్ధికి హామీ ఇచ్చారో చెప్పాలన్నారు. చలమల్ల కృష్ణారెడ్డి  మాట్లాడుతూ మునుగోడులో మీటింగ్ పెట్టిన  సీఎం కేసీఆర్ కు మోటార్లు, మీటర్లు తప్ప ప్రజా సమస్యలు కనిపించలేదన్నారు.  సుజావుద్దీన్, గండు వెంకట్ గౌడ్, రావిరాల నగేశ్,   సంజయ్,  ధర్మయ్య, లింగయ్య ఉన్నారు.'

రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీకి తిరుగులేదు 

నకిరేకల్, వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీకి తిరుగులేదని డీసీసీ ప్రెసిడెంట్​శంకర్​నాయక్ ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ సెక్రటరీ కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్స్​ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీస్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం కొండేటి మల్లయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్​ పార్టీని  మరింత బలోపేతం చేసేందుకు కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు.   కాంగ్రెస్​లీడర్లు​దుబ్బాక నర్సింహ్మారెడ్డి, చెరుకు సుధాకర్​మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉందని పార్టీ నుంచి ఎవరు వెళ్లినా  అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు.  తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీ రుణం తీర్చుకునేందుకు అందరూ కలసికట్టుగా పనిచేసి విజయం సాధించాలన్నారు.  మాజీ జడ్పీటీసీలు నరసింహ యాదవ్​,  వెంకట నర్సయ్య యాదవ్​, మాజీ ఎంపీపీలు  శ్రీనివాస్​, వెంకన్న, నాయకులు ఆదిమల్ల శంకర్​, పరమేశ్​, డీసీసీ మెంబర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాం

సూర్యాపేట, వెలుగు: స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జిల్లాలో ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగాయని కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు. ఈ వేడుకల్లో భాగస్వాములై సక్సెస్​చేసేందుకు కృషి చేసిన అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, యువత కు కలెక్టర్  కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం వల్లే వజ్రోత్సవ వేడుకల్లో సూర్యాపేట జిల్లా తన ప్రత్యేకతను చాటుకున్నదని చెప్పారు. ఈ నెల 9 నుంచి 21వ తేదీ వరకు  రోజూ ప్రభుత్వం నిర్ధేశించిన కార్యక్రమాలను  పక్కాగా నిర్వహించామని తెలిపారు.  

ముగింపు కార్యక్రమానికి తరలివెళ్లిన అధికారులు ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు సూర్యాపేట జిల్లాకు చెందిన ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సోమవారం హైదరాబాద్ కు తరలివెళ్లారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ముగింపు సంరంభానికి జిల్లా  నుంచి 200 మందికి పైగా 5 బస్సులలో బయలుదేరి వెళ్లగా జడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపికా జెండా ఊపి  బస్సులను ప్రారంభించారు.  

సమస్యలను వెంటనే పరిష్కరించాలి -  

ప్రజావాణి సమస్యలపై అధికారులు  వెంటనే పరిష్కరించాలని  అడిషనల్​కలెక్టర్ యస్. మోహన్ రావు  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి  కార్యక్రమంలో పాల్గొని ప్రజల  నుంచి   దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములకు సంబంధించిన వివరాలను మీ సేవ కేంద్రాలలో   సరైన రీతిలో నమోదు చేసుకోవాలని సూచించారు.  భూ సమస్యలపై 22,   ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు 35 వచ్చాయని వీటిని అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.