దేశవ్యాప్తంగా 20 వేలకుపైగా స్కూళ్లు మూతపడినయ్ : కేంద్రవిద్యాశాఖ

దేశవ్యాప్తంగా 20 వేలకుపైగా స్కూళ్లు మూతపడినయ్ : కేంద్రవిద్యాశాఖ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభించిన 2020–21 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 20 వేలకుపైగా స్కూళ్లు మూతపడ్డాయని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో టీచర్ల సంఖ్య కూడా రెండు శాతం తగ్గిందని తెలిపింది. ఈ మేరకు గురువారం కేంద్ర విద్యా శాఖ ఒక రిపోర్ట్ ను విడుదల చేసింది. 2021–22 విద్యా సంవత్సరంలో స్కూల్​ ఎడ్యుకేషన్​కి సంబంధించి ద యూనిఫైడ్​ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్​ సిస్టం ఫర్​ ఎడ్యుకేషన్​ ప్లస్(యుడైస్+) రిపోర్ట్​ అనేక కీలక అంశాలను ప్రస్తావించింది. దేశంలోని మొత్తం స్కూళ్లలో 44.85 శాతం స్కూళ్లలో మాత్రమే కంప్యూటర్​ సౌకర్యం ఉందని, అందులో 34 శాతం స్కూళ్లకే ఇంటర్నెట్​ కనెక్షన్​ ఉందని తెలిపింది. 2020–21 రిపోర్ట్​ ప్రకారం దేశంలో 15.09 లక్షల స్కూళ్లు ఉండగా.. 2021–22 రిపోర్ట్​ ప్రకారం ఆ సంఖ్య 14.89 లక్షలకు తగ్గింది. కరోనా మహమ్మారి వల్ల ఈ కాలంలో ప్రైవేట్, ఇతర మేనేజ్​మెంట్లలోని స్కూళ్లు మూతపడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ రిపోర్ట్​ పేర్కొంది. ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులకు 27 శాతం స్కూళ్లలో మాత్రమే టాయిలెట్లు ఉన్నాయని, ఇందులో 49 శాతం బడుల్లో మాత్రమే ర్యాంప్స్, హ్యాండ్​ రెయిల్స్ ఉన్నాయని వివరించింది.

ఎన్​రోల్​మెంట్లు తగ్గినయ్

కరోనా మహమ్మారి స్టూడెంట్ల ఎన్​రోల్​మెంట్​పైనా తీవ్ర ప్రభావం చూపిందని, ముఖ్యంగా ప్రీ ప్రైమరీ క్లాసులకు సంబంధించి ఎక్కువ ప్రభావం కనిపించిందని కేంద్ర విద్యా శాఖ రిపోర్ట్ లో తెలిపింది. కరోనా కారణంగా అడ్మిషన్లను వాయిదా వేసుకోవడం దీనికి ఒక కారణం కావొచ్చంది. 2021–22లో ప్రైమరీ నుంచి హయ్యర్​ సెకండరీ వరకు 25.57 కోట్ల మంది ఎన్ రోల్​ అయ్యారని, అంతకుముందు ఏడాది(2020–21)తో పోలిస్తే ఇది 19.36 లక్షలు ఎక్కువని వివరించింది. 2020–21లో టీచర్ల సంఖ్య 97.87 లక్షలు ఉంటే 2021–22లో ఆ సంఖ్య 95.07 లక్షలకు తగ్గిందని, 2020–21లో ప్రైమరీ క్లాసులు చెప్పే టీచర్లు 35.4 శాతం ఉంటే 2021–22 నాటికి అది 34.4 శాతానికి తగ్గింది. అదే అప్పర్​ ప్రైమరీ విషయానికి వస్తే.. 2020–21లో 21.5 శాతం ఉంటే 2021–22 నాటికి 18.9 శాతానికి పరిమితమైంది. 2021–22లో టీచర్ల తగ్గుదలను గమనిస్తే ప్రభుత్వ స్కూళ్లలో 0.9 శాతం, గవర్నమెంట్​ ఎయిడెడ్ స్కూళ్లలో 1.45 శాతం, ప్రైవేట్​ స్కూళ్లలో 2.94 శాతం, ఇతర స్కూళ్లలో 8.3 శాతం టీచర్ల సంఖ్య తగ్గింది.