వచ్చే ఎండాకాలం ఎండలు మండుతై

వచ్చే ఎండాకాలం ఎండలు మండుతై

    2019 కంటే ఈ ఏడాది వేడి ఇంకా ఎక్కువైతది

    2020 తర్వాతా టెంపరేచర్లు పెరుగుతయ్  

    4 దశాబ్దాలుగా పెరుగుతున్న వేడి

    గ్రీన్ హౌజ్ వాయువుల్ని కంట్రోల్ చేయకుంటే కష్టం

    డబ్ల్యూఎంఓ వార్నింగ్  

గత ఏడాది కన్నా ఈ ఏడాది వాతావరణం మరింత వేడెక్కుతుందట. నలబై ఏండ్లలో వరుసగా1980, 1990, 2000, 2010 దశాబ్దాల్లో ఒకదానికి మించి ఒకటి హాట్‌‌‌‌ డెకేడ్స్‌‌‌‌గా నమోదయ్యాయట. ఇప్పుడు కొత్త దశాబ్దంలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతుందని, భూమి మరింత వేడెక్కడం ఖాయమని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ  ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఇప్పటికైనా గ్రీన్ హౌజ్ వాయువులను కంట్రోల్ చేయకపోతే గ్లోబల్ టెంపరేచర్లను కంట్రోల్ చేయడం కష్టమని ఈ మేరకు డబ్ల్యూఎంఓ చీఫ్ ​పెటేరీ టాలస్ బుధవారం ప్రపంచ దేశాలను హెచ్చరించారు.

2020 మరింత హాట్..

ఆస్ట్రేలియాలో బుష్​ఫైర్స్ విజృంభించి, లక్షలాది జంతువులను కాల్చేయడం వెనక క్లైమేట్ చేంజ్ ప్రభావమే ఉందని టాలస్ స్పష్టం చేశారు. ఈ ఏడాది కూడా ఇలాంటి ప్రకృతి విపత్తులు మరిన్ని ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వాతావరణ సంస్థల డేటా ప్రకారం, 2016 తర్వాత 2019 సెకండ్ హాటెస్ట్ ఇయర్‌‌‌‌గా రికార్డులకు ఎక్కిందని, 2019 ఏడాదికి 2020 కొనసాగింపుగా మారుతుందని అన్నారు. 2020లో మాత్రమే కాదు.. ఆ తర్వాతి సంవత్సరాల్లోనూ టెంపరేచర్లు క్రమంగా పెరిగే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో లేదా దశాబ్దంలో నమోదైన గ్లోబల్ టెంపరేచర్లు రికార్డ్ స్థాయిలో ఎక్కువగా నమోదయ్యాయని, గతంలో ఎన్నడూ ఇంతలా లేవని టాలస్ తెలిపారు.

గ్రీన్ హౌజ్ వాయువులను ఏటా7.6% తగ్గించాలె.. 

ప్యారిస్ ఒప్పందం ప్రకారం, మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి విడుదలవుతున్న గ్రీన్ హౌజ్ వాయువులను 2030 వరకూ ఏటా 7.6 శాతం తగ్గించాలని, అప్పుడే గ్లోబల్ టెంపరేచర్ల పెరుగుదలను ఈ శతాబ్దం చివరినాటికి 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్లకు కట్టడి చేయొచ్చని ఐక్యరాజ్యసమితి గత ఏడాది వెల్లడించిన విషయాన్ని టాలస్ గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్ల నమోదు 1850 నుంచి ప్రారంభమైందని, అప్పటి నుంచి గ్లోబల్ టెంపరేచర్లు సగటున 1.1 డిగ్రీలు పెరిగాయని ఆయన చెప్పారు. ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం గ్రీన్‌‌‌‌హౌజ్ వాయువులను కంట్రోల్ చేయకుంటే ఈ శతాబ్దం చివరినాటికి గ్లోబల్ టెంపరేచర్లు ఏకంగా 3 నుంచి 5 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

90 శాతం వేడి సముద్రాల్లోనే..

భూమిపై ఉండే మొత్తం వేడిలో 90 శాతం వేడిని మహాసముద్రాలే పీల్చుకుంటున్నాయట. అందుకే మహాసముద్రాల్లో వేడిని కచ్చితంగా గుర్తిస్తే గ్లోబల్ వార్మింగ్‌‌‌‌ను కూడా కచ్చితంగా అంచనా వేయొచ్చని డబ్ల్యూఎంఓ సైంటిస్టులు చెప్తున్నారు. 2019లో మహాసముద్రాలు గతంలో ఎన్నడూ లేనంత వేడెక్కాయని, గత ఐదు సంవత్సరాల్లోనూ ఓషన్ హీట్ రికార్డ్ స్థాయిలో  పెరిగిందని అంటున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఫ్యూచర్‌‌‌‌లో వాతావరణ మార్పుల ఎఫెక్ట్ మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి వానాకాలం  డేట్లు మారుతయ్: ఐఎండీ 

మనకు నైరుతి రుతుపవనాల రాకతో వానాకాలం స్టార్ట్ అవుతుంది. సాధారణంగా ఏటా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తయి. నాలుగు నెలల తర్వాత సెప్టెంబర్ 30న దేశం నుంచి పూర్తిగా తిరిగి వెళ్లిపోతయి. కానీ.. గత ఏడాది నైరుతి నార్మల్ డేట్ కంటే 4 రోజులు ఆలస్యంగా జూలై 19న దేశమంతా విస్తరించింది. దేశం నుంచి సెప్టెంబర్ 30న వెళ్లిపోవాల్సి ఉండగా, అక్టోబర్ 9న వెళ్లిపోయాయి. మరోవైపు ఆయా రాష్ట్రాలు, రీజియన్లలోనూ ఇండియా మెటిరియోలజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) అంచనా వేసిన డేట్లు తారుమారయ్యాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న రిఫరెన్స్ డేట్లు1940లలో నిర్ణయించినవని, అందుకే.. ఈ ఏడాది మాన్ సూన్ డేట్లను ఐంఎడీ సవరించనుందని మినిస్ట్రీ ఆఫ్​ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ ఎం. రాజీవన్ బుధవారం వెల్లడించారు. అయితే నైరుతి ప్రారంభ తేదీ జూన్ 1గానే ఉంటుందని, కానీ ఆయా రాష్ట్రాలు, రీజియన్లకు వేర్వేరు తేదీలను ప్రకటిస్తామని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం.మోహపాత్ర తెలిపారు. ఏప్రిల్ లో కొత్త డేట్లతో పాటు వర్షపాత అంచనాను కూడా విడుదల చేస్తామని చెప్పారు.