
- ఇప్పటికే బోర్డులు, ట్రిబ్యునళ్లు.. అపెక్స్ కౌన్సిల్!.. వాటితోనే కానిది కమిటీతో ఎలా సాధ్యమనే ప్రశ్న
- కమిటీలో పరిష్కారం దొరక్కుంటే మళ్లీ సీఎంల వద్దకు
- అపెక్స్ కౌన్సిల్లోనే చర్చించవచ్చు కదా? అనే అభిప్రాయాలు
- బోర్డులు విఫలమవుతున్నందున కమిటీలో పరిష్కారం దొరికే చాన్స్ లేకపోలేదంటున్న మరికొందరు
హైదరాబాద్, వెలుగు:నదీ జలాల వివాదాలపై కేంద్రం కమిటీ వేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జలాల తరలింపు, ప్రాజెక్టుల నిర్వహణ, కొత్త ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి ఇప్పటికే ఇటు బోర్డులు, అపెక్స్ కౌన్సిల్‌తో పాటు ఇటు ట్రిబ్యునళ్లు ఉండగా, కొత్తగా ఇంకో కమిటీ ఎందుకన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
బోర్డుల దగ్గర తేలని అంశాలను అపెక్స్ కౌన్సిల్లో చర్చించి పరిష్కరించుకునేందుకు ఓ ప్రత్యామ్నాయమున్నది. ఇటు నీటి వాటాల కేటాయింపులకు సంబంధించి ట్రిబ్యునళ్లలో వాదనలూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ తేలని అంశాలు.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీతో ఎలా తేలుతాయని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బోర్డులు, అపెక్స్ కౌన్సిల్లో పరిష్కారం కాని సమస్యలు.. కొత్త కమిటీతో పరిష్కారమవుతాయా అని అనుమానపడ్తున్నారు. కమిటీ అనేది సాగదీత వ్యవహారంలా, కేంద్రానికి సమస్యలను పరిష్కరించే ఉద్దేశం కనిపించడం లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇరు రాష్ట్రాల నడుమ జలవివాదాల పరిష్కారంలో కృష్ణా, గోదావరి బోర్డులు విఫలమవుతున్నందున కమిటీతో కొంత మేలు జరగవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి.
బోర్డుల్లో తేలట్లే..
కృష్ణా, గోదావరి జలాల వివాదాలకు సంబంధించి ఏపీ విభజన చట్టం ప్రకారం కేంద్రం కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది. బోర్డులున్నాయన్న పేరేగానీ.. ఏ సమస్యకూ బోర్డుల దగ్గర పరిష్కారం దొరకడం లేదు. కేవలం రెండు రాష్ట్రాల మధ్య మీడియేటర్ పాత్ర వరకే బోర్డులు పరిమితమవుతున్నాయన్న వాదన వినిపిస్తున్నది.
ఉదాహరణకు కృష్ణా బోర్డునే తీసుకుంటే.. ఏపీ శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతున్నా బోర్డు నియంత్రించలేని స్థితికి చేరిపోయింది. విచ్చలవిడిగా ఏపీ పాల్పడుతున్న జలదోపిడీని అడ్డుకోవాల్సిన బోర్డు.. పరోక్షంగా ఆ రాష్ట్రానికే సహకరిస్తున్నదన్న విమర్శలూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం, అధికారులు ఎన్నిసార్లు ఏపీ తీరుపై ఫిర్యాదు చేసినా.. ఆ రాష్ట్రానికే బోర్డు వంత పాడుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పదేండ్లుగా ఏపీ జలదోపిడీ లెక్కలు తీస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు. ఇటు సాగర్ ప్రాజెక్టును అధీనంలోకి తీసుకోవడం, శ్రీశైలం డెడ్‌స్టోరేజీ నుంచి చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌ను చేపట్టడం, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్‌కు లైనింగ్ చేస్తున్నా బోర్డు ఆపే ప్రయత్నమే చేయలేదన్న విమర్శలున్నాయి. ఇటు గోదావరి బోర్డు కూడా.. పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో తెలంగాణలో కలిగే ముంపుపై సర్వే చేయించాల్సిన అంశంపైనా సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలున్నాయి.
ఇటు బనకచర్ల ప్రాజెక్టుపైనా తొలుత గోదావరి బోర్డు నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. ప్రాజెక్టు వివరాలకు సంబంధించి కేంద్రం బోర్డుకు లేఖలు రాసినా.. ఆ విషయాలను మెంబర్ స్టేట్‌గా తెలంగాణకు చెప్పింది లేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకే కేంద్రం బోర్డులను ఏర్పాటు చేసినా.. ఆ దిశగా ఈ పదేండ్లలో అడుగులు పడలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కమిటీలో పరిష్కారం దొరికేనా?
పదేండ్లుగా బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ మీటింగుల్లో లభించని పరిష్కారం ఇప్పుడు కేంద్రం కొత్తగా వేయబోయే కమిటీతో లభిస్తుందా అనేదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నదీ జలాల వివాదాలపై కేంద్రం ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీని సోమవారం లోపు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ అధికారుల స్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించకపోతే మళ్లీ సీఎంల స్థాయిలోనే చర్చించుకోవాల్సి ఉంటుందన్న మెలిక కూడా పెట్టారు.
వాస్తవానికి అపెక్స్ కౌన్సిల్‌ను రెండు రాష్ట్రాల సీఎంలతో చర్చించే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారు. అక్కడ పరిష్కారం దొరకనప్పుడు.. ఇప్పుడు కమిటీ ద్వారా దొరకకుంటే మళ్లీ సీఎంల స్థాయిలోనూ చర్చించుకున్నా దొరుకుతుందా అని పలువురు ఎక్స్పర్ట్స్ ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఇలా కమిటీలు వేసే బదులు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్నే ఏర్పాటు చేసి నేరుగా అక్కడే చర్చించుకోవచ్చుగా అన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కేవలం కాలయాపన కోసమే.. ఏపీ సీఎం చంద్రబాబు ఇలా ప్రతిపాదించగానే కేంద్రం అలా కమిటీకి తలూపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణంలో చర్చలు కొనసాగించేందుకు కమిటీ దోహదం చేస్తుందని, బోర్డుల ద్వారా సాధ్యం కాని కొన్ని సమస్యలకు కమిటీ ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ట్రిబ్యునల్‌లో వాదనలు..
కృష్ణా జలాల పున:పంపిణీకి సంబంధించి ప్రస్తుతం ట్రిబ్యునల్‌లో వాదనలు నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, నీటి వినియోగం, క్యాచ్మెంట్ ఏరియా తదితర అంశాల ఆధారంగా తెలంగాణకు 71 శాతం వాటా కోసం ప్రభుత్వం కొట్లాడుతున్నది. దానికి సంబంధించిన తీర్పు ఈ ఏడాది చివరిలోగా వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగానే ట్రిబ్యునల్ కేటాయింపులు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
మరోవైపు ఇదే నీటి వాటాలకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల సీఎంలతో చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. గతంలో 2016, 2020లో రెండు సార్లు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లు జరిగినా సమస్యకు పరిష్కారం లభించలేదు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయమూ కుదరలేదు. అపెక్స్ కౌన్సిల్లో కేంద్రమే మీడియేషన్ బాధ్యతలు చూసినా సమస్యలకు పరిష్కారం ఇప్పటికీ లభించలేదు.