సర్కార్​ లిక్కర్​ ఆమ్దానీ .. తొమ్మిదేండ్లలో 2 లక్షల కోట్లు

సర్కార్​ లిక్కర్​ ఆమ్దానీ .. తొమ్మిదేండ్లలో  2 లక్షల కోట్లు
  • గడిచిన రెండేండ్లుగా రూ.30 వేల కోట్ల పైనే 
  • ఆగస్టు నెలలోనే రూ.6 వేల కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లిక్కర్‌ ఏరులై పారుతోంది. దాంతో సర్కార్​కు మస్తుగా ఆమ్దానీ వస్తోంది. ఏడాదికేడాది, నెల నెలకు ప్రభుత్వానికి ఇన్‌కం పెరుగుతూనే ఉంది. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లిక్కర్​తో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.2 లక్షల కోట్లు దాటింది. 2021 సంవత్సరం నుంచి మద్యంతో వస్తున్న ఆదాయం రూ.30 వేల కోట్లు దాటుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం అది రూ.40 వేల కోట్లకు చేరే చాన్స్​ ఉందని అంచనా వేస్తున్నారు. వైన్స్​లు, బార్ల సంఖ్య పెంచడం, గ్రామాల్లో బెల్ట్​ షాపులపై చర్యలు తీసుకోకపోవడం, అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ అమ్మించడం, మద్యం ధరలు పెంచడంతో ప్రభుత్వానికి అంతకంతకు ఆదాయం పెరుగుతూ వస్తోంది. గత ఏడేండ్ల లెక్కలు చూస్తే  లిక్కర్​ సేల్స్​ దాదాపు రెండింతలు పెరిగాయి. ఆదాయం మూడింతలకు చేరువలో ఉన్నది. 

లిక్కర్​ సేల్స్​ ఏడేండ్లలో డబుల్

రాష్ట్రంలో 2,620 మద్యం షాపులతోపాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లు ఉన్నాయి. వాటిలో లిక్కర్​ సేల్స్​ ఏడేండ్లలో డబుల్​ అయ్యాయి. ఆదాయం మూడింతలైంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.14,184 కోట్ల లిక్కర్​ అమ్ముడుపోయింది. అంతే స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చింది.  అప్పుడు 2.72 కోట్ల ఐఎంఎల్​ లిక్కర్​ కేస్​లు, 3.36 కోట్ల బీర్​ కేస్​లు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో 3.51 కోట్ల లిక్కర్​ కేస్​లు, 4.78 కోట్ల బీర్​ కేస్​లు సేల్​ కాగా.. రూ. 35 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు యావరేజ్​గా రూ.110 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.  ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలల్లో రూ.15,346 కోట్లు లిక్కర్​ సేల్స్​ జరిగాయి. 

గత నెలలో ఆల్​టైం రాబడి

ఆగస్టు నెలలో  రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి ఎక్సైజ్​ ద్వారా ఆదాయం వచ్చింది. తెలంగాణ చరిత్రలోనే ఆబ్కారీ శాఖ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ఒకే నెలలో ఎక్కువ రాబడి వచ్చిన నెలగా ఆగస్టు​ నిలిచింది. ఈ నెలలో రూ.3 వేల కోట్ల విలువచేసే మద్యం డిపోల నుంచి సరఫరా అయ్యింది. అలాగే, మద్యం అప్లికేషన్ల టెండర్లు, వైన్​షాపులు దక్కించుకున్నోళ్లు కట్టిన ఫస్ట్ ఇన్​స్టాల్​మెంట్​తో కలిపి ఇంకో రూ.3 వేల కోట్లు వచ్చింది. ఇలా ఒక్క నెలలోనే ఎక్సైజ్​ రాబడి రూ.6 వేల కోట్లు వచ్చినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. 

సేల్స్​కు టార్గెట్లు

రాష్ట్రంలో లిక్కర్​ వినియోగాన్ని కంట్రోల్​ చేయాల్సిన ప్రభుత్వం.. కొత్త వైన్స్​లు, బార్లకు అనుమతులు ఇస్తోంది. ఇలా సేల్స్​ పెరుగుతుంటే మస్తు ఆదాయం సమకూరుతుండటంతో ఇంకింత గుంజేందుకు సర్కారు మరింత ప్రోత్సహిస్తోంది. ఉన్న మద్యం దుకాణాలు చాలవన్నట్లు  ఏడాదిన్నర కింద  కొత్తగా మరో 404 వైన్స్​లకు పర్మిషన్‌ ఇచ్చింది. అంతకుముందే కొత్తగా 159 బార్లను నడిపేందుకు లైసెన్స్​లు మంజూరు చేసింది. మద్యం దుకాణాలు వేళలు పెంచింది. లిక్కర్‌ సేల్స్‌ పెంచాలని ఎప్పటికప్పుడు ఆబ్కారీ శాఖ అధికారులను పురమాయిస్తోంది. వాళ్లు మద్యం వ్యాపారులను వేధిస్తున్నారు. మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా బెల్ట్‌ షాపులు నడుస్తున్నా.. ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తోంది. ఇలా రాష్ట్రంలో 6 వేలకు పైగా బెల్ట్​ షాపులు ఉన్నట్లు ఎక్సైజ్​ అధికారులే చెబుతున్నారు. దీంతో లిక్కర్​ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతున్నది.

డీ అడిక్షన్ సెంటర్లు పెడ్తలే 

మద్యానికి బానిసైన వారిని మామూలు స్థితికి తేవడానికి డీ అడిక్షన్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్లలో ట్రీట్‌మెంట్ చేస్తారు. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఇన్‌పేషెంట్‌గా జాయిన్‌ చేసుకుని చికిత్స అందిస్తారు. కానీ, రాష్ట్రంలో డీ అడిక్షన్‌ సెంటర్ల వ్యవస్థ సరిగా లేదు. తెలంగాణ వ్యాప్తంగా రెండు రిహాబిలిటేషన్‌ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. డ్రగ్స్‌, సిగరెట్లు, లిక్కర్​ తదితర మత్తు పదార్థాలకు బానిసైన వారంతా ఈ సెంటర్లకే క్యూ కడుతున్నారు. ఇక జిల్లాల్లో  అడిక్షన్‌ సెంటర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం జిల్లాకో సెంటరైనా ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.