ఫస్ట్ ఫేజ్62 శాతం .. తొలి విడత ఎన్నికలు ప్రశాంతం

ఫస్ట్ ఫేజ్62 శాతం .. తొలి విడత ఎన్నికలు ప్రశాంతం
  •     21 రాష్ట్రాలు,యూటీల్లోని 102 ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి
  •     మణిపూర్, అరుణాచల్​, బెంగాల్​లో పలుచోట్ల హింస
  •     మొరాయించిన ఈవీఎంలు
  •     నాగాలాండ్​లోని 6 జిల్లాల్లో జీరో ఓటింగ్


న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఫస్ట్ ఫేజ్​లో భాగంగా శుక్రవారం 21 రాష్ట్రాలు, యూటీల్లోని 102 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. మణిపూర్, బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో చెదురుమదురు ఘటనలు మినహా అన్నిచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 వరకూ కొనసాగింది. రాత్రి 9 గంటలకు అన్ని స్థానాల్లో కలిపి 62.37% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా బెంగాల్​లో 77.57%, అత్యల్పంగా రాజస్థాన్​లో 50.27% పోలింగ్ నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్ సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఫస్ట్ టైం ఓటర్లు, కొత్తగా పెండ్లి చేసుకున్న నవ దంపతులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమిళనాడు, అరుణాచల్, అస్సాంలోని పలు బూత్ లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. అండమాన్​లోనూ ఈవీఎంలలో సమస్యలు తలెత్తగా వెంటనే సరిచేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్​తో ఎన్నికలను బహిష్కరించాలన్న ఈఎన్ పీవో సంస్థ పిలుపు మేరకు తూర్పు నాగాలాండ్​లోని 6 జిల్లాల ప్రజలు ఓటింగ్​కు దూరంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్​లో 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా.. 18 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. మిగతా 6 విడతల్లో పోలింగ్ ముగిసిన తర్వాత జూన్ 4న అన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.

మణిపూర్​లో కాల్పులు.. బెంగాల్​లో గొడవలు

మణిపూర్, బెంగాల్, అరుణాచల్​లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇంఫాల్ ఈస్ట్ జిల్లా మోయిరంగ్ కాంపూ సాజెబ్​లోని పోలింగ్ బూత్ వద్ద కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వృద్ధుడు గాయపడ్డాడు. మోయిరంగ్ సెగ్మెంట్​లోని తామ్నాపోక్పీ పోలింగ్ బూత్ వద్ద కూడా కొందరు గాలిలోకి కాల్పులు జరుపుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఖోంగ్‌‌‌‌మాన్ జోన్ 4 పోలింగ్ స్టేషన్​లో ఓటర్లు, సాయుధ దుండగులకు మధ్య జరిగిన ఘర్షణలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల శబ్దం వినపడుతుండగా, ఓటర్లు పరుగెత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక, బెంగాల్​లోని కూచ్​బెహర్ పరిధిలోని పలు పోలింగ్ స్టేషన్ల వద్ద టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. పలుచోట్ల ఓటర్లను బెదిరించడం, ఏజెంట్లపై దాడుల వంటి ఘటనలు జరిగాయి. అరుణాచల్​లోని మూడు పోలింగ్ స్టేషన్ ల వద్ద గొడవలు జరగడంతో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి.

ఎన్నికలు ముగిసిన రాష్ట్రాలు/యూటీలివే..
 
ఫస్ట్ ఫేజ్​లో తమిళనాడు (39), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2), అండమాన్ నికోబార్ (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1), లక్షద్వీప్(1)లలో అన్ని లోక్ సభ స్థానాలకూ ఎన్నికలు ముగిశాయి. వీటిలో అరుణాచల్ ప్రదేశ్ (60), సిక్కిం (32) రాష్ట్రాల్లో లోక్ సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అలాగే, రాజస్థాన్ లో 12, యూపీలో 8, మధ్యప్రదేశ్​లో 6, అస్సాంలో 5, మహారాష్ట్రలో 5, బిహార్​లో 4, వెస్ట్ బెంగాల్​లో 3, త్రిపుర, జమ్మూకాశ్మీర్, చత్తీస్ గఢ్​లలో ఒక్కో స్థానానికి ఎన్నికలు ముగిశాయి. మణిపూర్​లో రెండు నియోజకవర్గాలు ఉండగా.. ఫస్ట్ ఫేజ్​లో ఒక సెగ్మెంట్ పూర్తిగా, మరో సెగ్మెంట్​లో సగం వరకు పోలింగ్ పూర్తయింది. 

  • అస్సాంలోని లఖింపూర్ నియోజకవర్గంలో సడెన్​గా నదీ ప్రవాహం పెరగడంతో పడవ ద్వారా ఈవీఎంను తరలిస్తున్న వాహనం కొట్టుకుపోయింది.  పోలింగ్ సిబ్బంది మాత్రం ప్రాణాలతో 
  • బయటపడ్డరు.
  •     జమ్మూకాశ్మీర్​లోని ఉధంపూర్ సెగ్మెంట్ లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఇక్కడ మొదటి ఆరు గంటల్లోనే 65.08 శాతం పోలింగ్ నమోదైంది. 
  •     అండమాన్​లో షోంపెన్ తెగకు చెందిన ఏడుగురు ఓటు హక్కును తొలిసారి వినియోగించుకున్నారు. ఈ తెగ ప్రజలు ఇప్పటి వరకు ఓటు వేయలేదు. 
  •     చత్తీస్ గడ్​లోని బీజాపూర్ జిల్లా గల్గామ్​లో ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ దేవేంద్ర కుమార్(32) ప్రమాదవశాత్తు గ్రనేడ్ లాంచర్ షెల్ పేలడంతో గాయపడి ఆస్పత్రిలో చనిపోయాడు.
  •     మిజోరంలో ఎన్నికల విధుల్లో ఉన్న  ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కు చెందిన జవాను లార్లిన్ పునియా (28) గుండెపోటుతో చనిపోయాడు.