2.1 కోట్ల మహిళా ఓట్లు మిస్సింగ్

2.1 కోట్ల మహిళా ఓట్లు మిస్సింగ్

ఇండియాకు స్వతంత్రం వచ్చినప్పుడే దేశంలోని మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ‘ఇదో అసాధారణ విజయం’ అని అప్పట్లో ఓ చరిత్రకారుడన్నారు. కానీ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లయిన తర్వాత దేశంలో 2.1 కోట్ల మంది మహిళలకు ఇంకా ఓటు హక్కు అనేదే లేదు. అంటే ఓటర్ల లిస్టులో వారి పేర్లు మిస్సయ్యాయి. సరాసరి ఒక్కో నియోజకవర్గం లో సుమారు 38 వేల ఓట్లు. మొత్తంగా ఈ సంఖ్య శ్రీలంక జనాభాకు సమానం. మరీ ఇంత భారీ మొత్తంలో ఓట్ల గల్లంతా ? కారణమేంటి?

ఉత్తరాదిలోనే ఎక్కువ
ఓటరు లిస్టులో కనబడకుండా పోయిన మహిళా ఓటర్ల సంఖ్యను ఎన్నికల నిపుణులు ప్రణయ్‌‌ రాయ్‌‌, దొరాబ్‌‌ సొపరివాలా రాసిన ‘ద వర్డిక్ట్‌‌: డీకోడింగ్‌‌ ఇండియాస్‌‌ ఎలక్షన్స్‌‌’లో వెల్లడించారు. ఈ పుస్తకం ఇంకా విడుదలవలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 ఏళ్ల పైబడిన మహిళల సంఖ్యను వీరు లెక్కలోకి తీసుకున్నారు. ఈ సంఖ్యను తాజా ఓటరు లిస్టుతో పోల్చి చూశారు. దాని ప్రకారం సుమారు 2.1 కో ట్ల మంది మహిళల పేర్లు ఓటర్‌‌ లిస్టులో లేవు. ఉత్తరప్రదేశ్‌‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌‌లలో మిస్సయిన మహిళా ఓటర్ల సంఖ్య.. మొత్తం ఓటర్ల సంఖ్యలో సగం కన్నా ఎక్కువ. వీటితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రా లైన ఆంధ్రప్రదేశ్‌‌, తమిళనాడు చాలా బెటర్‌‌. ఉత్తరప్రదేశ్‌‌ లాంటి రాష్ట్రాల్లో ఒక్కో సెగ్మెంట్‌‌లో సుమారు 80 వేల ఓట్లపైనే మిస్సయ్యాయి. దేశంలో ప్రతి ఐదు సీట్లలో ఒక స్థానంలో గెలుపోటముల మధ్య తేడా 38 వేల కన్నా తక్కువుంది. దీన్ని బట్టి మిస్సయిన ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేయగలవన్నమాట.

కారణమేంటి?
మరి ఎందుకు మహిళా ఓటర్లు ఎక్కువగా మిస్సవుతున్నారు? అంటే తొలి కారణం పెళ్లయ్యాక మహిళల ఇల్లు మారుతుంది. అప్పుడు కొత్త ఓటరుగా రిజిస్టర్‌‌ చేసుకోవడం లేదు. దేశంలో 30–34 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో కేవలం 3–4 శాతం మందే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారు. ఓటరు లిస్టు లో పబ్లిష్‌‌ చేసేందుకు పెళ్లికాని మహిళల ఫొటోలను కొన్ని కుటుంబాలు ఇవ్వడం లేదు. మరోవైపు దేశంలో మహిళ ఓటర్ల రిజిస్ట్రేషన్‌‌ గణనీయంగా పెరుగుతోందని మాజీ ఎలక్షన్‌‌ కమిషనర్‌‌ ఎస్‌‌వై ఖురేషీ చెప్పారు. కానీ ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌కు సంబంధించి ఇంకా సామాజిక కారణాలున్నాయన్నారు. ‘‘కొందరు తల్లిదండ్రులు వారి కూతుర్ల వయసు చెప్పేందుకు ఇష్టపడరు. ఎందుకంటే అది వాళ్ల పెళ్లిపై ప్రభావం చూపుతుందని వాళ్ల అనుమానం’’ అని ఆయన అన్నారు. మరి 2019 సార్వత్రిక ఎన్నికలు నెల రోజులు కూడా లేవు. ఇలాంటి సమయంలో ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు. దీనికి ఓ పరిష్కారాన్ని రాయ్‌‌ సూచిస్తున్నారు. మహిళలు రిజిస్టర్‌‌ చేసుకోకున్నా 18 ఏళ్లపైబడి ఉండి గుర్తింపు కార్డులుంటే ఓటేసేందుకు అనుమతించాలంటున్నారు.

ఈసారి వాళ్లే ఎక్కువ..
దేశంలో ఈసారి సాధారణ ఎన్ని కల్లో మహిళల ఓటింగ్‌‌ శాతం మగవారికన్నా ఎక్కువగా ఉండనుంది. చాలా మంది మహిళలు తమ కుటుంబం, భర్తను సంప్రదించకుండానే స్వతంత్రంగా ఓటేస్తున్నామని చెప్పారు. వాళ్ల భద్రత కోసం పోలింగ్‌‌ స్టేషన్ల దగ్గర మహిళలకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. పోలింగ్‌‌ స్టేషన్‌‌లో కనీసం ఓ మహిళా అధికారి ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో 660 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. అదే 1951లో వీరి సంఖ్య కేవలం 24. ఈమధ్య మహిళలను ప్రత్యేక నియోజకవర్గంగా పార్టీలు భావిస్తున్నాయి. వాళ్లను ఆకట్టుకునేలా పథకాలు ప్రవేశపెడుతున్నాయి. తక్కువ ధరకు కుకింగ్‌‌ గ్యాస్‌‌, చదువుకోడానికి స్కాలర్‌‌షిప్‌‌లు, కాలేజీకి వెళ్లేందుకు సైకిళ్లు ఇస్తున్నాయి.