యాదిలో.. అతివాదుల నాయకుడు

యాదిలో.. అతివాదుల నాయకుడు

బాల గంగాధర తిలక్‌‌ కొంకణ కోస్తా తీరంలోని రత్నగిరిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో 1856లో పుట్టాడు. బ్రాహ్మణ సంప్రదాయాలు, ఆచారాల మధ్య కఠిన క్రమశిక్షణతో పెరిగాడు. యుక్త వయసు రాగానే పూణాకు వెళ్లాడు. కొన్నాళ్లకు మరాఠా, కేసరి అనే రెండు జర్నల్స్‌‌కు యజమాని అయ్యాడు. మొదటిసారిగా మరాఠాలో ప్రచురించిన ‘కేసరి’ ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.  తిలక్‌‌కు 29 సంవత్సరాలు ఉన్నప్పుడు భారత జాతీయ కాంగ్రెస్‌‌ మొదటి సమావేశాలు బొంబాయిలో జరిగాయి. కానీ.. తిలక్‌‌ హాజరు కాలేదు. అప్పటికే ఆయన బాంబే ప్రెసిడెన్సీలో తనదైన ముద్రవేశాడు. 

1889లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్‌‌ 5వ సెషన్‌‌కు ఆయన ఒక డెలిగేట్‌‌. ఆ సెషన్‌‌లో, దాని తర్వాత  జరిగిన సెషన్‌‌లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు, ముఖ్యంగా ‘బ్రిటీష్‌‌ గవర్నమెంట్‌‌ను దయా భిక్ష కోరడాన్ని మానుకోవాలి’ అనే ఆయన డిమాండ్‌‌ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌‌ వ్యతిరేకించేలా చేసింది. ఆయన చేసిన ప్రసిద్ధ నినాదం ‘‘స్వరాజ్యం నా జన్మ హక్కు. దానిని నేను పొంది తీరుతాను” అనేది ఇండియా అంతటా భావోద్రేకాన్ని రేకెత్తించింది. ఆ కాలంలో మరాఠా ప్రజలకు వారి ప్రాచీన ఘనత గురించి అవగాహన కలిగించాడు. దక్కన్‌‌లోని గ్రామాలకు, పూణా పట్టణ ప్రజల దగ్గరకు వెళ్లి గణేశ్​ మహోత్సవాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశాడు. 

1893లో పూణాలో మొదటిసారిగా గణేశ్‌‌ ఉత్సవాలు జరిపించాడు. గణపతి సొసైటీలు, గోవధ వ్యతిరేక సొసైటీని కూడా స్థాపించాడు. అప్పటినుంచి హిందువుల తరఫున పోరాడే యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. మరాఠా వీరుల్లో సెంటిమెంట్‌‌ని మేల్కొల్పడానికి శివాజీ ఉత్సవాలను పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాడు. 1895లో శివాజీ మొదటి రాజధాని రాయగడ్‌‌లో మొదటిసారి ఉత్సవాలు నిర్వహించాడు. 

1896–97లో దేశంలో కరువు కాటకాలు వచ్చాయి. అప్పుడు తిలక్‌‌ అవిశ్రాంతంగా, నిస్వార్థంగా శ్రమించాడు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పనిచేసినా మరణాల రేటు తగ్గలేదు. దానికి తోడు 1897లో బొంబాయి ప్రెసిడెన్సీలో ప్లేగు వ్యాధి సోకింది. అప్పుడు కూడా తిలక్‌‌ ‘సార్వ జనిక్‌‌ సభ’ ద్వారా ఎంతో సేవ చేశాడు. తన ‘కేసరి’ పత్రికలో బ్రిటిష్ వాళ్ల మీద తీవ్రంగా ధ్వజమెత్తాడు. అదే సంవత్సరంలో దామోదర్‌‌‌‌ చాపేకర్‌‌‌‌ ఇద్దరు బ్రిటిష్​ అధికారులను చంపేశాడు. 

ఆ హత్యలతో తిలక్‌‌కు నేరుగా సంబంధం లేదు. కానీ.. ‘కేసరి’లో రాసిన వ్యాసాలు పురికొల్పడం వల్లే చాపేకర్‌‌‌‌ హత్యలు చేశాడని తిలక్‌‌ని 18 నెలల పాటు జైలుకు పంపారు. విడుదలైన తర్వాత కాంగ్రెస్‌‌ పార్టీలోని అతివాదులకు నాయకుడిగా మారాడు. ఆ తర్వాత బెంగాలీ సంస్కరణ వాది బిపిన్ చంద్రపాల్‌‌తో సఖ్యత ఏర్పడడంతో అప్పటివరకు మరాఠా సనాతన బ్రాహ్మణ వాదిగా పేరున్న తిలక్‌‌కు సంస్కరణ వాదంపై సదుద్దేశం ఏర్పడింది. తర్వాత ‘స్టాండింగ్‌‌ కమిటీ ఫర్‌‌‌‌ దక్కన్‌‌’కు సెక్రటరీ అయిన తిలక్‌‌ ‘చర్చలు, తీర్మానాలతో ఏమీ సాధించలేం. ప్రత్యక్ష కార్యాచరణ వల్లే లక్ష్యాన్ని సాధించగలం’ అని ప్రకటించాడు. అప్పటినుంచి బెంగాల్‌‌లో కూడా ఆయన ఆలోచనలు ప్రభావవంతంగా వేళ్లూనుకున్నాయి. 

1908లో బెంగాల్‌‌లో మరో బ్రిటిషర్‌‌ హత్య జరిగింది. అప్పుడు తిలక్‌‌ ‘కేసరి’లో ఆ చర్యను పదకొండేండ్ల క్రితం నాటి చాపేకర్‌‌‌‌ ఘటనతో పోల్చి మెచ్చుకున్నాడు. దాంతో మళ్లీ రెండోసారి కేసు నమోదైంది. తనను తాను రక్షించుకోవడానికి రెండున్నర గంటలపాటు ప్రసంగించినప్పటికీ శిక్ష విధించారు. అప్పటినుంచి ఆయన బ్రిటీష్‌‌ వారి పట్ల తీవ్ర వ్యతిరేకత రేకెత్తించాడు.

 అందుకే ఆయనను అందరూ ‘భారత అశాంతి పిత’ అనేవాళ్లు. ఆ తర్వాత కూడా ఆయన స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. 1920లో కాంగ్రెస్‌‌ గాంధీ సిద్ధాంతం, అహింసాయుత సహాయ నిరాకరణను చేపట్టింది. కొత్త సిద్ధాంతం ‘సత్యాగ్రహం’ని ఆచరణలో పెట్టడానికి ఆగస్టు 1 తేదీని నిర్ణయించారు. ఆరోజే తిలక్ మరణించాడు. గాంధీ, నెహ్రూలతోపాటు బ్రహ్మాండమైన జన సందోహం ఆయన అంత్యక్రియల్లో పాల్గొంది. . 

- మేకల మదన్​మోహన్​ రావు,కవి, రచయిత-