గుట్టుగా మంచిప్ప!

గుట్టుగా మంచిప్ప!

రీ డిజైనింగ్​తో లాభం లేదని ఎక్స్​పర్ట్స్​చెప్తున్నా పట్టని సర్కారు
మేఘా కోసమే పనులు చేస్తున్నారనే ఆరోపణలు
మళ్లీ ఉద్యమబాట పట్టిన నిర్వాసితులు

రైతుల ఉద్యమంతో మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణంపై వెనక్కి తగ్గినట్లు నటించిన రాష్ట్ర సర్కారు, ఆందోళనలు చల్లారగానే గుట్టుగా పనులు చేయిస్తోంది. కాళేశ్వరం 21, 22 ప్యాకేజీల్లో భాగంగా నిజామాబాద్​ జిల్లా మోపాల్​ మండలంలో చేపట్టిన మంచిప్ప రిజర్వాయర్​ కెపాసిటీ  0.375 టీఎంసీలు. రూ. 330 కోట్లతో రిజర్వాయర్ సహా ప్యాకేజీ పనులు పూర్తయ్యే అవకాశమున్నప్పటికీ సర్కారు రీడిజైనింగ్​ పేరుతో అంచనా వ్యయాన్ని రూ. 3,500 కోట్లకు పెంచింది. దీని వల్ల కొత్తగా పెరిగే ఆయకట్టు పెద్దగా లేదని ఎక్స్​పర్ట్స్​చెప్పినా సర్కారు పెడచెవిన పెట్టింది. దీంతో తమ గ్రామాలు మునుగుతున్నాయంటూ మంచిప్ప సహా పది తండాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో వెనక్కి తగ్గింది. ఆరు నెలలు గడవకముందే  మళ్లీ పోలీస్​పహారా నడుమ పనులు ప్రారంభించడంతో రైతులు మరోసారి ఉద్యమబాట పడ్తున్నారు. 

నిజామాబాద్, వెలుగు : 2007లో ప్రాణహిత - -చేవెళ్ల కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 21, 22వ ప్యాకేజీ పనులు చేపట్టారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పై ఆధారపడి నిర్మించిన ఈ ప్యాకేజీల ద్వారా నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్​ జిల్లాల పరిధిలో 3.4 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. 0.375 టీఎంసీల కెపాసిటీతో మంచిప్ప కొండెం చెరువును రిజర్వాయర్​గా మార్చాలని నిర్ణయించారు. మొత్తం ప్రాజెక్టుకు రూ. 330 కోట్లు అవుతుందని అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు ప్రాజెక్టును రీ డిజైన్​చేసింది. రెండు ప్యాకేజీల్లో 4 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేలా మార్పులు చేశారు.  మంచిప్ప కొండెం చెరువు కెపాసిటీని 3.5 టీఎంసీలకు పెంచారు. పనులను మేఘా కంపెనీ చేపడుతోంది. మంచిప్ప రిజర్వాయర్​నీటి సామర్థ్యం 3.5 టీఎంసీలకు పెంచడంతో అమ్రాబాద్​ పరిధిలో 4 తండాలు, బైరాపూర్​ పరిధిలో 4 తండాలు, మంచిప్ప పరిధిలో మంచిప్ప , మంచిప్ప తండా మొత్తం 11 గ్రామాలు నీట మునుగుతున్నాయి. సుమారు 12 వేల మంది నిరాశ్రయులవుతున్నారు. పది గ్రామాల్లోని 1,388 ఎకరాలతోపాటు 800 ఎకరాల ఫారెస్ట్​ భూములు ముంపునకు గురవుతున్నాయి. ఏడాదికి రెండు పంటలు అందిస్తున్న సాగు భూములు రీ డిజైన్ ​కారణంగా పోతుండడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేఘా కంపెనీ కోసమే రీ డిజైన్​ చేశారంటూ ఆరోపిస్తున్నారు. మంచిప్ప రిజర్వాయర్ కోసం 2008లో 150 ఎకరాల భూ సేకరణ చేపట్టారు. ఎకరాకు రూ. 5 లక్షల వరకు చెల్లించారు. ప్రస్తుతం మంచిప్పలో ఎకరం రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు పలుకుతోంది. కానీ ప్రభుత్వం పరిహారం ఎంత ఇస్తుందో ప్రకటించడం లేదు. దీంతో భూసేకరణకు వెళ్లిన అధికారులను పలుసార్లు రైతులు వెనక్కి పంపారు. 

డీపీఆర్ ను బహిర్గతం చేయాలని ఆందోళన

మంచిప్ప రిజర్వాయర్​పనులు ఆపాలంటూ గతేడాది ఫిబ్రవరి నుంచి నిర్వాసితులు దశలవారీగా నిరసనలు చేపట్టారు. గతేడాది ఏప్రిల్ 20, 27వ తేదీల్లో రిజర్వాయర్ వద్ద నిర్మాణ పనులు అడ్డుకున్నారు. మే 21న ప్రజాభిప్రాయ సభలో అడిషనల్ కలెక్టర్ ను నిలదీశారు. రీడిజైన్ పనులను నిలిపివేయాలని గడ్కొల్ పంప్ హౌస్ నిర్మాణ పనులును గతేడాది మే 26న అడ్డుకున్నారు. మే 28న కొందరు నిర్వాసితులతో సర్కారు మీటింగ్​ఏర్పాటు చేసింది. అయితే నిర్వాసితులందరూ మీటింగ్​కు వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని ముంపు గ్రామాల కమిటీ ప్రతినిధులు పట్టుబట్టారు. కలెక్టరేట్​ఎదుట నిరసన వ్యక్తం చేసి గేట్​కు మెమోరాండం సమర్పించారు. నిర్వాసితుల ఆందోళనతో సర్కారు పనులు ఆపేసింది. అయితే కొంతకాలంగా పోలీసు పహారాలో గుట్టుగా పనులు సాగిస్తున్నారు. 21 ప్యాకేజీలో అమ్రాబాద్ వాటర్ ఇన్ కమింగ్ పంప్ హౌజ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తాజాగా బైరాపూర్ పంప్ హౌజ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.  దీంతో ఈ నెల 20 నుంచి నిర్వాసితులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. 

సాగుభూములు ముంచుతున్రు

ప్యాకేజీ పనులు రీడిజైన్ చేసి 11 గ్రామాల్లో సాగు భూములను ముంచుతున్రు. రెండు పంటలు పండే సాగు భూములు నీటిపాలు చేస్తున్రు. పరిహారం కంటే భూముల రేటు పది రెట్లు ఎక్కువగా ఉంది. పాత డిజైన్ తో పనులు చేసేంతవరకు పోరాటం ఆగదు.

- నారాయణ, నిర్వాసితుడు, మంచిప్ప

రీడిజైన్ తో ఖజానా లూటీ                                        

రిజర్వాయర్ రీడిజైన్ తో ఖజానాను కొల్లగొడుతున్రు. రూ. 3,170 కోట్లు దుర్వినియోగం చేస్తున్రు. పాత డిజైన్ 0.375 టీఎంసీల ప్రకారమైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏడాదిలో రెండు పంటలు వచ్చే సాగు  భూములు  మునగడంతో నష్టపోతున్నం. రీడిజైన్ పనులను నిలిపివేయాలి.

- శంకర్ నాయక్, ముంపు గ్రామాల కమిటీ గౌరవ ప్రెసిడెంట్