గ్లోరియాకు ట్రీట్మెంట్ చేస్తూ స్పృహ తప్పిన 23 మంది నర్స్ లు

గ్లోరియాకు ట్రీట్మెంట్ చేస్తూ స్పృహ తప్పిన 23 మంది నర్స్ లు

అది ఫిబ్రవరి 19, 1994. శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న 31 ఏండ్ల గ్లోరియా రామిరెజ్ కాలిఫోర్నియాలోని రివర్‌సైడ్ జనరల్ హాస్పిటల్‌లో చేరింది. అక్కడున్న నర్సులు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఇంతలో బ్లడ్ శాంపిల్ తీసుకుంటున్న ఓ నర్సు ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఆమెకు ఏం జరిగిందో తెలుసుకునేలోపు మరో నర్స్.. ఇలా ఒకరిద్దరు కాదు, గ్లోరియాకు ట్రీట్మెంట్ చేస్తున్న 23 మంది నర్స్ లు ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. ట్రీట్మెంట్ అందక  గ్లోరియా ప్రాణం పోయింది.  కొద్ది సేపటి వరకూ అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. గ్లోరియా బ్లడ్ నుంచి అమ్మోనియా లాంటి వింత వాసన వచ్చిందని వాళ్లు చెప్పారు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? అనేది ఇప్పటికీ వీడని మిస్టరీనే.

గర్భాశయ క్యాన్సర్‌‌తో బాధపడుతున్న గ్లోరియా రామిరెజ్.. కాలిఫోర్నియాలోని రివర్‌సైడ్‌లో తన కుటుంబంతో పాటు నివసించేది. ఉన్నట్టుండి ఒక రోజు ఆమెకు ఛాతి బరువెక్కిపోయింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది. దాంతో వెంటనే రివర్ సైడ్ జనరల్ హాస్పిటల్‌కు కాల్ చేసింది. హాస్పిటల్‌కు చేరుకునేసరికి గ్లోరియా స్పృహ కోల్పోయింది. ఆమె హార్ట్ బీట్ చాలా స్పీడ్‌గా ఉంది. హాస్పిటల్ స్టాఫ్ ఆమెకు వెంటిలేటర్ పెట్టి, ఇంట్రావీనస్ ఇన్‌ఫ్యూజన్ ఇచ్చారు. వెంటనే ఆమెను ఎమర్జెన్సీ వార్డ్​కు తీసుకెళ్లారు. స్పృహలోకి తెచ్చేందుకు కొన్ని మందులు ఇచ్చి చూశారు. కానీ ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. 

నర్సులంతా కుప్పకూలి..

ఆమెను కాపాడేందుకు అక్కడున్న స్టాఫ్ అంతా ట్రై చేస్తున్నారు. అప్పుడే ఆమె శరీరంపై జిడ్డు పేరుకుపోయి ఉండడాన్ని గమనించారు వాళ్లు. అలాగే ఆమె దగ్గర ఏదో వింత వాసన వస్తున్నట్టు వాళ్లకు అనిపించింది. అవేమీ పట్టించుకోకుండా సుసాన్ కేన్ అనే నర్సు రక్త పరీక్ష కోసం రక్తం తీయడానికి గ్లోరియా చేతిలో సూదిని గుచ్చింది. వెంటనే ఆమెకు గుప్పుమని అమ్మోనియా లాంటి వాసన వచ్చింది. దాంతో ఆమె పక్కనే ఉన్న డాక్టర్ మౌరీన్‌ను వాసన ఎక్కడ్నించి వస్తుందని అడిగింది. ఆ వాసన గ్లోరియా బ్లడ్ నుంచే వస్తుందని చెప్పిందామె. అక్కడున్న మరో స్టాఫ్ వెల్చ్, డాక్టర్ జూలీ కూడా ఆ వాసన గ్లోరియా నుంచే అని కన్ఫర్మ్ చేశారు. వింత వాసనతో పాటు గ్లోరియా రక్తంలో ఏవో కణాలు తేలుతున్నట్టు కూడా డాక్టర్ జూలీ గుర్తించింది. ఇదంతా జరుగుతుండగా నర్స్ సుసాన్ కేన్ మూర్ఛపోయింది. ఆమెను ఐసీయూకి తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత డాక్టర్ జూలీ కూడా వికారంగా ఉందని చెప్తూ, తప్పటడుగులు వేస్తూ అక్కడి నుంచి హాస్పిటల్ కారిడార్ వరకూ నడుచుకుంటూ వెళ్లింది. తల పట్టుకుని ఒక్కసారిగా నేలమీద కుప్పకూలిపోయింది. దాంతో గ్లోరియాను కాపాడే బాధ్యత డాక్టర్ మౌరీన్ తీసుకుంది. ఏదైనా చేద్దాం అనుకునేలోగానే మౌరీన్ కూడా మూర్ఛపోయి, కింద పడిపోయింది. ఈలోగా డాక్టర్ మార్క్ థామస్ అక్కడికొచ్చాడు.  హాస్పిటల్ స్టాఫ్‌ను, పేషెంట్లను అలర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో అతని నర్స్ సాలీ బల్దేరాకు వాంతులు మొదలయ్యాయి. ముఖం, చేతులు, చర్మం కాలిపోతున్నాయని ఆమె  అరిచింది. డాక్టర్ మార్క్ థామస్ ఆమెను బయటకు తీసుకెళ్లాడు. చివరిగా మిగిలిన మరొక నర్సు కూడా అక్కడి నుంచి బయటకు పరిగెత్తుతూ తన అవయవాలపై పట్టుకోల్పోయి కింద పడిపోయింది. అలా అక్కడున్న హాస్పిటల్ స్టాఫ్ అంతా ఒక్కొక్కరుగా కుప్పకూలిపోయారు.  

కారణమేంటో..

ఇదంతా చూసి  డాక్టర్ ఒచోవా..  హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ ప్రకటించాడు. అక్కడి పేషెంట్లను మరో వార్డుకు షిఫ్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. అప్పటికి గ్లోరియా ప్రాణాలతోనే ఉంది. ఒచోవా తన నర్సులతో కలిసి గ్లోరియాకు ట్రీట్మెంట్ చేస్తున్నాడు. గ్లోరియా పల్స్ పడిపోతోంది. స్టాఫ్ ఎంతగానో ప్రయత్నించారు. కానీ చివరికి గ్లోరియా ప్రాణాలు విడిచింది.  గ్లోరియా హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన 45 నిమిషాల్లోనే ఇదంతా జరిగింది. ఆ రోజు రాత్రి 23 మంది హాస్పిటల్ స్టాఫ్ స్పృహ కోల్పోయారు. డాక్టర్ జూలీతో పాటు మరికొంత మంది ఐసీయూలో చేరాల్సి వచ్చింది.  గ్లోరియా మరణంతో పాటు ఆ రోజు హాస్పిటల్ స్టాఫ్‌కు ఏం జరిగింది? అనేది ఇప్పటివరకూ తేలని మెడికల్ మిస్టరీగా మిగిలిపోయింది.

అధికారికంగా గ్లోరియా మరణానికి కారణం కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పటికీ.. ‘ఆ కిడ్నీ ఎలా ఫెయిల్ అయింది?’ అనేది మాత్రం తెలియదు. అలాగే గ్లోరియా రక్తంలో ఉన్న వింత కణాలు, కెమికల్ వాసనలు ఏంటనేవి కూడా సైంటిస్టులకు అంతుచిక్కడం లేదు. అలాగే హస్పిటల్ స్టాఫ్‌లో ఒక్కొక్కరు ఒక్కోలా స్పృహ కోల్పోవడానికి కారణాలు ఏంటనేది కూడా ఇప్పటికీ మిస్టరీనే. 

ఎన్నో వాదనలు

ఆ తర్వాతి రోజు  జనరల్ హాస్పిటల్ రివర్‌సైడ్‌లో అర్థరాత్రి ఏదో జరిగిందన్న వార్త అన్ని అమెరికన్ వార్తాపత్రికల్లో వచ్చింది. గ్లోరియా మరణం అమెరికాలో హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన.. తర్వాతి రోజుల్లో అనేక ఫోరెన్సిక్ పరిశోధనలకు తెరలేపింది. అమెరికన్ ఫోరెన్సిక్ చరిత్రలో అత్యంత కీలకమైన పరిశోధనల్లో ఒకటిగా గ్లోరియా కేసు రికార్డుకెక్కింది. ఈ మెడికల్ డిటెక్టివ్ కేసు.. పోలీసులకు, ఫోరెన్సిక్ సైంటిస్టులకు, డాక్టర్లకు అంతుచిక్కను ప్రశ్నలను మిగిల్చింది. ఈ కేసుపై రరకరకాల వాదనలు బయటకొచ్చాయి. హాస్పిటల్ పక్కన ఉన్న మురికి కాలువ నుంచి మొదలై హస్పిటల్‌లో రహస్యంగా దాచిన కెమికల్స్ వరకూ అన్ని కోణాల్లో దీన్ని పరిశోధించారు. కానీ, ఏ వాదననూ వంద శాతం నిజమని రుజువు చేయలేకపోయారు. దాంతో నిజమేంటో ఇప్పటికీ తేలలేదు.

శరీరమే కెమికల్ ఫ్యాక్టరీ

కానీ, అన్ని రకాల పరిశోధనల్లో తేలిందేంటంటే కొన్ని అసాధారణ రియాక్షన్స్ వల్ల  గ్లోరియా శరీరం ఒక కెమికల్ ఫ్యాక్టరీ తయారైంది. ఆఖరికి రక్తంలోకి కూడా రకరకాల రసాయనాలు, కణాలు వచ్చి చేరాయి. ‘అయినప్పటికీ ఆమె  ప్రాణాలతో ఎలా ఉండగలిగింది?’ అనేది డాక్టర్లకు అంతుచిక్కడం లేదు. అలాగే హస్పిటల్ స్టాఫ్ అనారోగ్యానికి కారణమైన రసాయనిక వాయువులు.. గ్లోరియా శరీరం నుంచి వెలువడిన వాయువులు ఒకటి కాదని గ్లోరియా పోస్టుమార్టం రిపోర్టు తర్వాత తెలిసింది. ఫెడరల్ రీసెర్చ్ సెంటర్, టాక్సికాలజీ రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి.  

సాధ్యం కాని థియరీ

క్యాన్సర్‌‌తో బాధ పడుతున్న గ్లోరియా.. లిడోసాయినే, పారాసెటమాల్, కొడీన్,  ట్రిమెథోబెంజమైడ్ లాంటి ఎన్నో రకాల మందులు వాడింది. కానీ, ఆమె రక్తంలో కనిపించిన అత్యంత అసాధారణమైన రసాయనం మాత్రం ‘డైమిథైల్ సల్ఫోన్’. ఇది కొన్నిరకాల మొక్కల్లో మాత్రమే కనిపించే సల్ఫర్ సమ్మేళనం. కొన్నిసార్లు అమైనో ఆమ్లాల ద్వారా కొద్దిమొత్తంలో శరీరంలో కూడా ఉత్పత్తి అవుతుంది. కానీ, గ్లోరియా రక్తంలో ఉన్న  డైమిథైల్ సల్ఫోన్ చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. దానికి కారణం  గ్లోరియా వాడిన మందుల్లో ‘డైమిథైల్ సల్ఫాక్సైడ్’ ఎక్కువగా ఉండడమే అని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు.  అలాగే హాస్పిటల్‌లో నర్సులు మూర్ఛపోవడానికి కారణం ‘డైమిథైల్ సల్ఫేట్‌’ అనే మరో రసాయనం అని కూడా పరిశోధనల్లో తేలింది. అయితే గ్లోరియా శరీరంలో ఉన్న ‘డైమిథైల్ సల్ఫోన్’..  డైమిథైల్ సల్ఫేట్‌గా ఎలా మారింది అనేది మరో మిస్టరీ. ఎందుకంటే డైమిథైల్ సల్ఫోన్‌.. డైమిథైల్ సల్ఫేట్‌గా మారడం సాధ్యం కాదు. ఇక్కడ అర్థం కాని మరో విషయం కూడా ఉంది.  ఒక మనిషి డైమిథైల్ సల్ఫేట్‌కు ఎక్స్​పోజ్ అయితే  దాని ప్రభావం సాధారణంగా కొన్ని గంటల తర్వాత కనిపిస్తుంది. కానీ, హాస్పిటల్‌లో నర్సులంతా నిమిషాల్లో కుప్పకూలిపోయారు. డైమిథైల్ సల్ఫేట్ ప్రభావం కారణంగా  మతిమరుపు, పక్షవాతం, మూత్రపిండాలు, కాలేయం, గుండె లాంటి అవయవాలు దెబ్బతింటాయి. కానీ, హాస్పిటల్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా కుప్పకూలిపోయారు. దీనికి కారణమేంటో తెలియలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ అనుమానం దేనితో సరితూగలేదు. దాంతో గ్లోరియా శరీరమే ఒక మిస్టరీ అనుకుని ఆ పరిశోధనలను ఆపేశారు.

గ్లోరియా రామిరెజ్ మృతదేహాన్ని గాలి చొరబడని సంచిలో మూసివేసి చాలారోజుల పాటు ప్రయోగాలు చేశారు. అధికారికంగా ఆమె కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోయింది. అయితే కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి అసలు కారణం ఏంటన్నది డాక్టర్లతో పాటు, కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు. ఆమెకు గర్భాశయ క్యాన్సర్ ఉన్నప్పటికీ ఆమె చనిపోవడానికి కారణం మాత్రం అది కాదు.  రెండు నెలల తర్వాత గ్లోరియా మృతదేహాన్ని ఆమె కుటుంబానికి ఇచ్చారు. అక్కడే రివర్‌సైడ్ స్మశానవాటికలో ఆమెను ఖననం చేశారు.  గ్లోరియా రామిరెజ్ ‘టాక్సిక్ లేడీ’గా చరిత్రలో నిలిచిపోయింది.