2 లక్షల 30 వేల ప్రాణాలను మింగేసిన ఆ ప్రళయానికి 15 ఏళ్లు

2 లక్షల 30 వేల ప్రాణాలను మింగేసిన ఆ ప్రళయానికి 15 ఏళ్లు

అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారి అల్లకల్లోలంగా మారింది. హాయిగా ఒడ్డును తాకి వెళ్తున్న కెరటాలు ఉన్నట్టుండి రాక్కసి అలలుగా మారిపోయాయి. ఉవ్వెత్తున తీరంపైకి ఎగిసిపడి ప్రళయాన్ని సృష్టించాయి. నిమిషాల్లో లక్షలాది ప్రాణాలను మింగేసింది సముద్రం. 2004 డిసెంబరు 26న సంభవించిన సాగర విలయానికి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. నాటి సునామీ గాయాన్ని గుర్తు చేసుకుని బాధితులు ఇంకా మౌనంగా రోధిస్తున్నవాళ్లూ మిగిలి ఉన్నారు. మానవ చరిత్రలోనే అతి పెద్ద విపత్తుగా నిలిచిపోయిందీ ఈ సునామీ.

సమయం ఉదయం 9 గంటలు.. సముద్రం ఒడ్డున సరదాగా వాకింగ్‌కి వచ్చినవాళ్లు.. బీచ్‌లలో గడపాలని వచ్చిన టూరిస్టులు.. సాగరం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులు.. అంతా వాళ్ల హడావిడిలో ఉన్నారు. రోజూలానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం తీరం మీదికి దూకింది. ఒక్కసారిగా 50 నుంచి 100 అడుగుల ఎత్తు వరకు కెరటాలు ఎగసి పడ్డాయి. ఇండోనేషియాలోని సుమత్రా తీరం వద్ద హిందూ మహా సముద్రం గర్భంలో పుట్టిన పెను భూకంపం ఓ ప్రళయానికి దారి తీసింది. 9.1 తీవ్రతతో వచ్చిన సముద్రపు భూకంపంతో అలలు తీరంపైకి దూకి జనజీవనాన్ని కిలోమీటర్ల దూరం వరకు మింగేశాయి. ఆసియాలోని 14 దేశాల్లో కలిపి ఏకంగా 2 లక్షల 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది గూడు కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. తీవ్రంగా నష్టంపోయింది ఇండోనేషియానే. ఆ ఒక్క దేశంలోనే దాదాపు రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక థాయ్‌లాండ్‌లో 5300 మంది మరణించారు.

భారత్‌లో…

భారత్‌ కొంత తీవ్రత తక్కువే అయినా భారీగా నష్టం జరిగింది. ఇండోనేషియా ప్రాంతంలో పుట్టిన సునామీ భారత తీరానికి వచ్చే సరికి ఎఫెక్ట్ కొంత తగ్గింది. 7 నుంచి 12 అడుగుల ఎత్తులో అలలు ఎగసి పడ్డాయి. తీరం నుంచి అర కిలోమీటరు దూరం వరకూ దీని ప్రభావం కనిపించింది. ఆంద్రప్రదేశ్‌లో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్‌లలో కలిపి 10 వేల మంది మరణించారు. వేలాది మంది ఆశ్రయం కోల్పోయారు. వారికి ప్రభుత్వ క్యాంపులు ఏర్పాటు చేసి.. కొన్నాళ్ల తర్వాత ఇళ్లకు కట్టించింది. ఇక శ్రీలంకలో 30 వేల మంది మృతి చెందారు.

More News:

యజమానిపై పగతో కారును తగలబెట్టాడు

పెళ్లికి పెద్దలు నో.. చున్నీతో ఉరేసుకున్న బావమరదళ్లు

నార్వే యువరాణి మాజీ భర్త ఆత్మహత్య