రెండు నెలల్లో ప్రభుత్వ ఖజనాకు రూ.23 వేల147 కోట్లు

రెండు నెలల్లో  ప్రభుత్వ ఖజనాకు రూ.23 వేల147 కోట్లు

 

  • ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రాబడి
  • కాగ్​ రిపోర్ట్​లో వెల్లడి.. నిరుడితో పోలిస్తే 2,400 కోట్లు అధికం
  • కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు నిల్​

హైదరాబాద్​, వెలుగు : ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో రాష్ట్ర ఖజానాకు వివిధ రూపాల్లో రూ.23,147 కోట్ల ఆదాయం సమకూరింది. పన్నుల ద్వారా రూ.22,419 కోట్లు రాగా, రూ.728 కోట్లు పన్నేతర ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం మే వరకు పన్నుల ద్వారా రూ.20,097 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది రూ.2,400 కోట్ల ఆదాయం పెరిగింది. ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ -( కాగ్‌‌) కు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ, వ్యయ వివరాలు సమర్పించింది. ఇందులో జీఎస్టీ ద్వారా అత్యధికంగా రూ.8,087 కోట్లు రాగా, సేల్స్​ ట్యాక్స్​ రూపంలో రూ.5,459  కోట్లు ఖజానాకు చేరాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా రాలేదు.  ఈ ఏడాది ఏప్రిల్​, మే నెలల్లో ట్యాక్స్ రెవెన్యూ  నిరుడితో పోలిస్తే రూ.2,400 కోట్లు పెరిగింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో ట్యాక్స్ రెవెన్యూ కొంత తగ్గింది. పన్నుల రూపంలో ఏప్రిల్‌‌లో ఖజానాకు రూ.11,464 కోట్లు రాగా, మే నెలలో ఆ మొత్తం రూ.10,954 కోట్లకు  తగ్గింది.  ఆర్బీఐ నుంచి అప్పుల ద్వారా రూ.7,386 కోట్లు సమకూర్చుకుంది. అన్ని రకాలుగా ఖజానాకు రూ.30,534 కోట్లు రాగా, అందులో ప్రభుత్వం రూ.28,493 కోట్లు ఖర్చు చేసింది.

ఎక్సైజ్ ​ఆదాయం రూ.3,321 కోట్లు

ఎక్సైజ్ ట్యాక్స్ ​రూపంలో రూ.3,321 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,189 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.1,817 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. ఇతర పన్నుల రూపంలో మరో రూ.1,443 కోట్లు వచ్చాయి.  మే నెల వరకు గతంలో చేసిన అప్పుల వడ్డీల చెల్లింపుల కోసం రూ.3,729 కోట్లు, శాలరీల కోసం రూ.7,572 కోట్లు ఖర్చు చేసింది. పింఛన్లపై రూ.2,627 కోట్లు, రాయితీలపై రూ.2,081 కోట్లు ఖర్చు చేసింది. మూలధన వ్యయం కింద రూ.5 ,017 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ప్రైమరీ లోటు రూ.3,651 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ.7,380 కోట్లుగా నమోదైంది. ఏప్రిల్ నెలలో రెవెన్యూ మిగులు రూ.1,020 కోట్లుగా చూపిన ప్రభుత్వం, మే నెల ముగిసే నాటికి రెవెన్యూ లోటు రూ.328 కోట్లుగా పేర్కొంది.