
షావర్మా తిని ఫుడ్ పాయిజనింగ్‌తో చికిత్స పొందుతూ ఓ 24 ఏళ్ల యువకుడు మరణించాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో అక్టోబర్ 25న చోటుచేసుకుంది. అనంతరం ఫుడ్ ఆఫర్ చేసిన రెస్టారెంట్‌ను అధికారులు మూసివేసినట్లు సమాచారం.
అక్టోబర్ 18న కొట్టాయం వాసి రాహుల్ నాయర్ లే హయత్ రెస్టారెంట్ నుంచి షవర్మా భోజనం ఆర్డర్ చేశాడు. అతను ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత అక్టోబర్ 19 న కక్కనాడ్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రిలో చేరాడు. అలా చికిత్స పొందుతూనే.. నాయర్ అదే రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే బలహీనత కారణంగా అక్టోబర్ 22న మరోసారిఆసుపత్రిలో చేరాడు.
Also Read : అవాక్కయ్యారా : యుద్ధ విమానం ఆయిల్ ట్యాంకులు ఊడి పడ్డాయి.. ట్రక్కుల్లో ఎత్తుకెళ్లిన ఆర్మీ
అనంతరం నాయర్ పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో అతనిపై విషప్రయోగం జరిగిందన్న విషయం స్పష్టమైంది. అయితే అది షవర్మా వల్ల జరిగిందా, లేదా అనేది నిర్ధారించుకోవడానికి పరీక్ష ఫలితాల కోసం వేచి చూడాల్సింది ఉంది. రాహుల్ కిడ్నీ, కాలేయం పాడైపోయి గుండెపోటుకు గురయ్యారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
నాయర్ ఆసుపత్రిలో ఉన్నంత కాలం, అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యులు అతన్ని వెంటిలేటర్ సపోర్ట్ పై ఉంచారు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ యజమానిపై త్రిక్కకర పోలీసులు కేసు నమోదు చేశారు. రెస్టారెంట్‌లో తీసిన నమూనాల పరీక్ష ఫలితాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.