
సుజాతనగర్, వెలుగు : ప్రైవేట్ ట్రేడర్స్ ను వే బ్రిడ్జి కాంటాలో మోసగించిన 26 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్ తెలిపారు. సుజాతనగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. మండల కేంద్రంలోని పత్తి కాంటా వద్ద ప్రైవేట్ గా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో జూలూరుపాడు మండలం పాపకోలు గ్రామానికి చెందిన కేశ పూర్ణ వెంకట కృష్ణారావు, సుజాతనగర్ మండలం కోమటిపల్లికి చెందిన మూడు భీమ్లా అనే వ్యక్తులు పత్తిని కొనుగోలు చేస్తుంటారు.
మూడు నెలలుగా తాము కొనుగోలు చేసిన పత్తి, అమ్ముకునే పత్తిలో భారీగా కాంటా వ్యత్యాసం రావడాన్ని గమనించి ఈనెల 8న సుజాతనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి కాంటా మోసంతో సంబంధం ఉన్న 26 మందిని శనివారం అరెస్ట్ చేశారు. పత్తి మార్కెట్ లో గుమాస్తా గా పనిచేస్తున్న భూక్యా అర్జున్ వే బ్రిడ్జ్ ఆపరేటర్లు గోతం సతీశ్, అక్కినపల్లి రాజేశ్ తో చేతులు కలిపి వేబ్రిడ్జి వద్దకు వస్తున్న ట్రాలీ ఆటో పత్తికి ఉన్న దానికంటే అదనంగా మరికొంత కలిపి ఎక్కువ వెయిట్ ఉన్నట్లుగా వేబిల్ రిసిప్ట్ ఇచ్చేవారు.
దీనికి గాను ట్రాలీ ఆటో వారు వేబ్రిడ్జి ఆపరేటర్ కు అదనంగా డబ్బులు చెల్లించేవారు. దీంతో వే బిల్ ప్రామాణికంగా పత్తిని కొనుగోలు చేసే వ్యాపారి నష్టపోయేవాడు. ఈ విధంగా మూడు నెలలుగా 18 ట్రాలీ ఆటోలతో 268.95 క్వింటాల పత్తి అదనంగా చూపి సుమారు రూ.16,58,947 మేర వ్యాపారులను నష్టపరిచారు. దీంతో మోసంతో సంబంధం ఉన్న ఆటో డ్రైవర్లు, మరికొందరు కలిపి మొత్తం 28 మందిగా గుర్తించి వారిలో 26 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై రమాదేవిని డీఎస్పీ అభినందించారు.