
- పాక్ ఐఎస్ఐ సమన్వయంతోనే అటాక్స్ జరిగాయని వెల్లడి
న్యూఢిల్లీ: ముంబై మారణహోమం (26/11) కీలక సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ రాణా కీలక విషయాలు బయట పెట్టాడు. ముంబైలో మారణహోమం జరుగుతున్నపుడు తాను ఆ నగరంలోనే ఉన్నానని అతను వెల్లడించాడు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సమన్వయంతోనే దాడులు జరిగాయని తెలిపాడు. ఈ కేసులో రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం అతను ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నాడు. సోమవారం అతడిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు విచారించారు.
తనతో పాటు తన అనుచరుడు, స్నేహితుడు డేవిడ్ కోల్ మన్ హెడ్లీ పాక్ లోని లష్కరే తాయిబా వద్ద పలుమార్లు శిక్షణ తీసుకున్నామని చెప్పాడు. ముంబై దాడులకు లష్కరే ఒక స్పై నెట్ వర్క్ గా పనిచేసిందని తెలిపాడు. ముంబైలో టెర్రర్ దాడులకు ముందు ఛత్రపతి శివాజీ టెర్మినస్ వంటి ప్రాంతాల్లో తాను రెక్కీ నిర్వహించానని రాణా ఒప్పుకున్నాడు. కాగా.. రాణాను విచారించిన తర్వాత ముంబై పోలీసులు అతడిని సాధ్యమైనంత త్వరగా తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. పాక్ సంతతి కెనడియన్ అయిన రాణాను ఈ ఏడాది ఎక్స్ ట్రడిషన్ పై భారత్ కు తీసుకువచ్చారు. తనను భారత్ కు అప్పగించవద్దంటూ అమెరికా సుప్రీంకోర్టులో అంతకుముందు అతడు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.