
- వడ్డీతోసహా వసూలు చేయాలంటూ సీఎం ఆదేశాలు
- కంపెనీలకు నోటీసులు జారీ చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: జంట నగరాల్లో హౌసింగ్ బోర్డు స్థలాలను లీజుకు తీసుకుని స్టార్ట్ హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మించి.. బోర్డుకు లీజు బకాయిలు కట్టని కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆయా కంపెనీలు కూకట్ పల్లి, గచ్చిబౌలిలాంటి కీలక ఏరియాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్, హోటల్స్ నిర్మించాయి. వీటిలో లులూ గ్రూప్, మధుకాన్ గ్రూప్, యూనివర్సల్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు కంపెనీలు కలిపి రూ. 585 కోట్ల మేరకు లీజు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
కూకట్ పల్లిలో లులూ మాల్ హౌసింగ్ బోర్డు భూమిలో ఉండగా, జేఎన్ టీయూ ఎదురుగా మెయిర్ రోడ్డుపై మధుకాన్ గ్రూప్ భారీ హోటల్ నిర్మిస్తోంది. యూనివర్సల్ రియల్టర్స్ చాలా స్థలాలను వివిధ ప్రాంతాల్లో లీజుకు తీసుకుంది. గత ప్రభుత్వంలో లీజు బకాయిలను వసూలు చేయటంలో నిర్లక్ష్యం వహించడంతో బకాయిలు ఐదేండ్లుగా పెద్ద ఎత్తున పేరుకుపోయాయి.
అయితే, ఇటీవల హౌసింగ్ బోర్డుపై రివ్యూ చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. బకాయిలు, వడ్డీతో కలిపి వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మూడు కంపెనీలకు హౌసింగ్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. వడ్డీతో కలిపి బకాయిలు కట్టాలని పేర్కొన్నారు. ఇందులో ఒక కంపెనీ రెండు నెలల్లో సగం బకాయిలు చెల్లిస్తామని హౌసింగ్ బోర్డుకు అంగీకార పత్రం రాసిచ్చినట్లు తెలుస్తోంది.
స్కీమ్ లకు నిధుల సమీకరణ
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలు చేస్తోంది. ఇప్పటివరకు 2 లక్షల ఇండ్లు స్టార్ట్ కాగా, లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. వెయ్యి కోట్లను సర్కారు జమ చేసింది. కేంద్రం నుంచి ఇంతవరకు అమౌంట్ రాకపోవటంతో ప్రతి లబ్ధిదారుడికి 4 దశల్లో రూ.5 లక్షలను ప్రభుత్వం అందజేస్తోంది. నిధుల విడుదలలో ఇబ్బంది రాకుండా గ్రీన్ చానల్ ద్వారా ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. రానున్న రోజుల్లో ఇండ్ల నిర్మాణం స్పీడప్ అయితే నిధుల కొరత రాకుండా ఉండేందుకు గాను రాజీవ్ స్వగృహ జాగాలు, అపార్ట్ మెంట్ ల వేలం, హౌసింగ్ బోర్డు స్థలాల లీజు అమౌంట్ ఇలా అన్ని రకాలుగా హౌసింగ్ శాఖ ఆదాయం
సమకూరుస్తోంది.
గతంలోనూ నోటీసులు
గత ఏడాది డిసెంబర్ లో హౌసింగ్ బోర్డు భూములను లీజు తీసుకుని నిర్మాణాలు చేపట్టిన, చేపడుతున్న మొత్తం 21 ప్రాజెక్టులను అధికారులు గుర్తించారు. ఇందులో 6 ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతున్న కంపెనీల లీజు బకాయిలు రూ. కోట్లలో ఉండటంతో బోర్డుకు, కంపెనీలకు మధ్య ఉన్న అగ్రిమెంట్ రద్దు చేశారు. ఆ భూముల్లో కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నందున వాటిని కొనవద్దని, నిర్మాణాలను ఆపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో కొన్ని కంపెనీలు అధికారులను సంప్రదించి బకాయిలు కట్టేందుకు గడువు ఇవ్వాలని కోరాయి. అనంతరం కొన్ని కంపెనీలు బకాయిలు కట్టాయి. తాజాగా మరో మూడు కంపెనీలు గత 8 నెలల నుంచి బకాయిలు కట్టడం లేదని అధికారులు గుర్తించారు.