ఆరని సీఏఏ మంటలు.. కాల్పుల్లో ముగ్గురు మృతి

ఆరని సీఏఏ మంటలు.. కాల్పుల్లో ముగ్గురు మృతి
  • మంగళూరులో ఇద్దరు, లక్నోలో ఒకరు మృతి
  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
  • ఢిల్లీలో 19 మెట్రో స్టేషన్లు బంద్..10 కి.మి. మేర ట్రాఫిక్​ జామ్​
  • పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌‌‌‌
  • మొబైల్​ సర్వీసులకు ఆటంకం
  • లక్నో, అహ్మదాబాద్​లో  హైటెన్షన్​
  • ముంబైలో పలువురు బాలివుడ్‌ స్టార్ల సపోర్టు
  • పోలీసుల అదుపులో ఏచూరి, యోగేంద్ర యాదవ్​, రామచంద్ర గుహ

న్యూఢిల్లీ: సిటిజన్​షిప్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ  గురువారం జరిగిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసు కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. కర్నాటకలోని మంగళూరులో నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. లక్నో   పరివర్తన్​ చౌక్​ దగ్గర  జరిగిన   కాల్పుల్లో  ఒకరు చనిపోయారు. ఈచట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో గురువారం కూడా ఆందోళనలు జరిగాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎర్రకోట, మండీ హౌస్‌‌‌‌ దగ్గర 144 సెక్షన్‌‌‌‌  పెట్టారు.  ఆయా ప్రాంతాల్లో ఆందోళన చేసేందుకు వచ్చిన లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో వదిలిపెట్టారు. వాళ్లకు కేటాయించిన  ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసన తెలపాలని చెప్పినప్పటికీ నాయకులు  వినలేదని పోలీసులు అన్నారు. లీడర్లను అరెస్టు చేయడంతో జామియా మిలియా యూనివర్సిటీ స్టూడెంట్స్‌‌‌‌, మరి కొంత మంది ఆందోళనకారులు జంతర్‌‌‌‌‌‌‌‌మంతర్‌‌‌‌‌‌‌‌ వద్ద నిరసన చేపట్టారు.  కొంతమంది  పోలీసులకు పూలు ఇచ్చి వినూత్నంగా తమ నిరసనలు తెలిపారు.

19 మెట్రోస్టేషన్లు బంద్‌‌‌‌

ఆందోళనలతో  19 మెట్రోస్టేషన్లను అధికారులు  టెంపరరీగా  మూసేశారు. గురువారం ఉదయం 7 స్టేషన్లను మూసేసిన ఢిల్లీ మెట్రో అధికారులు ఆందోళనలు ఉధృతం అవడంతో మరో 12 స్టేషన్లను కూడా మూసేసినట్లు ప్రకటించారు. జామియా మసీద్‌‌‌‌, జామియా మిలియా తదితర స్టేషన్లు క్లోజ్‌‌‌‌ అయ్యాయి. సెక్రటేరియట్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ను మూసేసినప్పటికీ ఇంటర్‌‌‌‌‌‌‌‌చేంజ్‌‌‌‌ ఫెసిలిటీ మాత్రం అందుబాటులో ఉంది. రెండు మినహా 17 స్టేషన్లను మళ్లీ సాయంత్రానికి ఓపెన్​ చేశారు. ఆందోళనకారులు రోడ్లపైకి రావడంతో గురువారం ఉదయం వివిధ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌ అయింది. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనకారులు వస్తున్నారనే సమాచారంతో బోర్డర్‌‌‌‌‌‌‌‌లో సెక్యూరిటీ ఏర్పాటు చేసి ప్రతి  వెహికిల్​ను  తనిఖీ చేశారు. ఢిల్లీ–-గుర్గావ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వే పై దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌ అయింది. దీంతో  పలు ఎంఎన్​సీలు …ఇంటి నుంచే వర్క్‌‌‌‌ చేయాలని తమ ఎంప్లాయీస్​కు మెయిల్స్‌‌‌‌ పంపాయి. అయితే ఎంప్లాయిస్‌‌‌‌ ఎవరూ సోషల్‌‌‌‌ మీడియా డిబేట్స్‌‌‌‌లో పాల్గొనవద్దని  వార్నింగ్​ ఇచ్చాయి. ఐడియా, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌, జియో లాంటి టెలికాం సంస్థలు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్‌‌‌‌  సర్వీసుల్ని నిలిపేశాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిస్‌‌‌‌, ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌, ఇంటర్నెట్‌‌‌‌ సేవలను ఆపేశామని ఆయా సంస్థలు ప్రకటించాయి. అయితే ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ తిరిగి సేవలను ప్రారంభించింది.

19 ఫ్లైట్లు క్యాన్సిల్‌‌‌‌, మరికొన్ని డిలే

ఇండిగో, విస్తారా, ఎయిర్‌‌‌‌‌‌‌‌ఇండియాకు చెందిన 19 ఫ్లైట్లు క్యాన్సిల్‌‌‌‌ అయ్యాయి. మరో 16 ఫ్లైట్లు డిలే అయినట్లు ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌ ప్రకటించాయి. ఉద్యోగులు  ఎన్‌‌‌‌ హెచ్‌‌‌‌ – 8పై ట్రాఫిక్‌‌‌‌లో ఇరుక్కుపోయినందున ఫ్లైట్లను నడపలేకపోయామని చెప్పారు.

ఢిల్లీలో అరెస్టైన లీడర్లు

లెఫ్ట్‌‌‌‌ పార్టీ లీడర్లు సీతారాం ఏచూరి, డి. రాజా, బృందాకారత్‌‌‌‌, స్వరాజ్​  ఇండియా​ లీడర్​ యోగేంద్ర యాదవ్,  కాంగ్రెస్‌‌‌‌ లీడర్​ సందీప్‌‌‌‌ దీక్షిత్‌‌‌‌.

హిస్టోరియన్​ రామచంద్ర గుహ అరెస్టు

బెంగళూరు: సిటిజన్‌‌‌‌షిప్‌‌‌‌ ఎమెండ్‌‌‌‌మెంట్‌‌‌‌ చట్టానికి వ్యతిరేకంగా బెంగళూరులోని టౌన్‌‌‌‌ హాల్‌‌‌‌ దగ్గర ఆందోళనలో పాల్గొన్న  హిస్టోరియన్​ రామచంద్ర గుహను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. టీవీ చానల్‌‌‌‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆయనను  మధ్యలోనే లాక్కెళ్లారని ఆందోళనకారులు ఆరోపించారు.  రాష్ట్రంలోని  హుబ్బిళి, కాలబురగై, హసన్‌‌‌‌, మైసూరు‌‌‌‌, బళ్లారి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు  జరిగాయి. సీఎం యడియూరప్ప సెక్యూరిటీ అధికారులతో  పరిస్థితిని రివ్యూ చేశారు. మంగుళూరులో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో వారిని తరిమికొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్‌‌‌‌ చేశారు. 144 సెక్షన్‌‌‌‌ విధించినప్పటికీ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

3 dead as protests against CAA continue across India