ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలకు నోబెల్

ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలకు నోబెల్

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థికవేత్తలు ఎంపికయ్యారు. ‘బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలు’ అనే అంశంపై అధ్యయనానికిగానూ బెన్ ఎస్.బెర్నాంకే, డగ్లస్ డబ్లు.డైమండ్, ఫిలిప్ హెచ్.డైబ్వింగ్ లకు నోబెల్ ప్రైజ్ ను ప్రకటించారు. ఈవిషయాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధికారికంగా వెల్లడించింది. ఆర్థిక రంగ నిపుణులకు ప్రదానం చేసే నోబెల్ ప్రైజ్ పూర్తి పేరు.. ‘స్వెరైస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకానమిక్ సైన్సెస్ ఇన్ మెమొరీ ఆఫ్ ఆల్ర్ఫెడ్ నోబెల్’. డిసెంబరు 10న స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో నోబెల్ బహుమతుల ప్రదానోత్సవం జరగనుంది. నోబెల్ ప్రైజ్ కు ఎంపికైన ముగ్గురు ఆర్థికవేత్తలకు కలిపి రూ.7.50 కోట్ల ప్రైజ్ మనీతో పాటు మెడల్, డిప్లొమా అందిస్తారు.

దేశాల ఆర్థిక వ్యవస్థల నిర్మాణంలో బ్యాంకుల పాత్ర ఏమిటి ?  ప్రత్యేకించి ఆర్థిక సంక్షోభాలు దేశాలను అలుముకున్నప్పుడు బ్యాంకుల పాత్ర ఏమిటి ?  బ్యాంకులు కుప్పకూలకుండా నిరోధించడం ఎందుకు అతి ముఖ్యం ? అనే అంశాలు కేంద్రంగా ఈ ముగ్గురు ఆర్థిక వేత్తల అధ్యయనం జరిగింది. బ్యాంకులను సంక్షోభాల నుంచి ఎలా గట్టెక్కించాలి ? ఆర్థిక సంక్షోభాల సమయంలో దేశాలు ఎలా స్పందించాలి ? అనే ప్రశ్నలకూ సమాధానం ఇచ్చేలా వారి అధ్యయనం జరిగింది. 


బెన్ ఎస్.బెర్నాంకే ఏం చేశారంటే.. 

బెన్ ఎస్.బెర్నాంకే 2006 నుంచి 2014 సంవత్సరాల మధ్యకాలంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కు 14వ చైర్మన్ గా వ్యవహరించారు. ఈ వ్యవధిలో ఆయన ఎన్నో కీలక సవాళ్లను ఎదుర్కొన్నారు. అంతకుముందు 2000 సంవత్సరంలో అమెరికాను అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం నీడలు తొలగిపోయేలా ఉండేందుకు అవసరమైన ఉపశమన చర్యలను పకడ్బందీగా అమలు చేశారు. అందుకే ఆయనను 2009 సంవత్సరంలో ‘టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ప్రకటించారు. ఆర్థిక సంక్షోభం ఊపిరి సలుపని పరిస్థితులు సృష్టించినప్పుడు బ్యాంకులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానికి మార్గం చూపేలా 2006 నుంచి 2014 సంవత్సరాల మధ్యకాలంలో ఆయన అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలకు రూపకల్పన చేశారు. 

డగ్లస్ డైమండ్, ఫిలిప్ డైబ్వింగ్ ప్రతిపాదనలివీ.. 

ఆర్థికవేత్తలు డగ్లస్ డబ్లు.డైమండ్, ఫిలిప్ హెచ్.డైబ్వింగ్ లు బ్యాంకులు కుప్పకూలినప్పుడు ఆర్థిక వ్యవస్థలు, ప్రభుత్వాల స్పందన ఎలా ఉండాలనే దానిపై పకడ్బందీ ప్రణాళికలను ప్రతిపాదించారు. బ్యాంకుల్లోని డిపాజిట్లపై ప్రభుత్వం బీమా (డిపాజిట్ ఇన్సూరెన్స్) చేయాలని సూచించారు. దేశ ప్రభుత్వమే బ్యాంకుల్లోని తమ డిపాజిట్లకు పూచీకత్తుగా ఉందనే విషయం డిపాజిటర్లకు తెలిస్తే.. బ్యాంకులు దివాలా తీసిన సందర్భాల్లో వాళ్లు క్యూ కట్టే అవకాశం ఉండదని తెలిపారు.