సోలార్ యాత్రకి 3 సార్లు గిన్నిస్‌‌ బుక్‌‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌లో చోటు

సోలార్ యాత్రకి 3 సార్లు గిన్నిస్‌‌ బుక్‌‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌లో చోటు

ప్రపంచాన్ని వణికిస్తున్న క్లైమేట్ ఛేంజ్ లాంటి సమస్యలకు సోలార్ ఎనర్జీ ఒక మంచి సొల్యూషన్. కానీ, మనదేశంలో  సోలార్ వస్తువులను వాడేవాళ్ల సంఖ్య మాత్రం చాలా తక్కువ. అందుకే దేశమంతటా సోలార్‌‌‌‌ ఎనర్జీపై అవగాహన తీసుకొచ్చేందుకు పూనుకున్నాడు మధ్యప్రదేశ్‌‌లోని ప్రొఫెసర్ చేతన్ సోలంకి. “క్లైమేట్ ఛేంజ్ అనేది ఎంత పెద్ద సమస్య అంటే.. ఒకవేళ గాంధీజీ ఉండి ఉంటే క్లైమేట్ ఛేంజ్ కోసం పెద్ద ఎత్తున మార్చ్ చేసేవాడు” అంటాడాయన.  అనడమే కాదు గాంధీని ఆదర్శంగా తీసుకొని  రెండేండ్లుగా బస్సులోనే మకాం ఉంటూ, ‘ఎనర్జీ స్వరాజ్’ పేరుతో దేశమంతా తిరుగు తున్నాడు. అందుకే ఈ ప్రొఫెసర్‌‌‌‌ను అంతా ‘సోలార్ గాంధీ’ అని పిలుస్తుంటారు.

ఐఐటీ బాంబేలో డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ ఎనర్జీ సైన్సెస్‌‌లో ప్రొఫెసర్‌‌‌‌గా పనిచేస్తున్న ​చేతన్​ సోలంకి.. సోలార్‌‌ పవర్‌‌ మీద పీహెచ్‌‌డీ చేశాడు.  తనకు బహుమతిగా లభించిన రూ.70లక్షలతో ఒక బస్సు కొని, దాన్నే ఇల్లుగా మలుచుకున్నాడు. బస్సుని పూర్తిగా సోలార్​ ఎనర్జీతో నడిచేలా డిజైన్ చేసి,  అందులో దేశమంతటా తిరుగుతున్నాడు. వెళ్లిన ప్రతీ చోటా తన బస్సుని ఉదాహరణగా చూపిస్తూ.. ‘మీరు కూడా మీ ఇళ్లను సోలార్‌‌‌‌తో నడిపించొచ్చు’ అని చెప్తుంటాడు. అక్కడి పిల్లలకు సోలార్ లైట్లు, ఇతర పరికరాలు తయారుచేయడం నేర్పుతుంటాడు. సోలంకి చేస్తున్న సోలార్ యాత్రకి ఇప్పటికే 3 సార్లు గిన్నిస్‌‌ బుక్‌‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌లో చోటు దక్కింది. 

ప్రోగ్రామ్స్ ఇవే..

సోలంకి చేస్తున్న ‘ఎనర్జీ స్వరాజ్’ యాత్ర 2020లో మధ్య ప్రదేశ్ నుంచి మొదలైంది. ఈ యాత్ర2030 వరకూ కొనసాగుతుంది. ఇప్పటి వరకూ ఈ బస్సు 10 వేల కిలోమీటర్లు తిరిగింది.  సుమారు 46 వేల మందికి సోలార్ ఎనర్జీపై అవగాహన కల్పించినట్లు చెప్తున్నాడు. ఈ యాత్రలో భాగంగా 2030 నాటి కి దేశవ్యాప్తంగా 2 లక్షల కిలోమీటర్ల టూర్, సోలార్‌‌‌‌పై వెయ్యికి పైగా స్పెషల్ షోలు, లక్ష మందికి సోలార్ ఎనర్జీపై ట్రైనింగ్​, లక్ష మొక్కలను నాటడం వంటి ప్రోగ్రామ్స్ పూర్తి చేస్తామని సోలంకి చెప్తున్నాడు.

బస్సులోనే అన్నీ..

సోలంకి సోలార్  బస్సుకు పైన 3.2 కిలోవాట్ల సోలార్​ ప్యానెల్స్​ ఉంటాయి. బస్సులో ఆరు కిలోవాట్ల కెపాసిటీ  బ్యాటరీ  ఉంటుంది. బస్సులో బెడ్ రూం, ఆఫీస్ స్పేస్, కిచెన్, రిఫ్రిజిరేటర్, ట్రైనింగ్ రూం... ఇలా  అన్నిరకాల సౌకర్యాలు ఉంటాయి. సోలంకితో పాటు బస్సు నడిపే మరో వలంటీర్ కూడా ఈ యాత్రలో ఉన్నాడు. పదేండ్ల పాటు సోలంకి ఆ బస్సులోనే ఉంటాడు. యాత్ర పూర్తయ్యే వరకూ ఇంటికి వెళ్లేది లేదని చెప్తున్నాడు సోలంకి.