2,500 మందికి పైగా పోలీసులకు కరోనా.. 30 మంది మృతి

2,500 మందికి పైగా పోలీసులకు కరోనా.. 30 మంది మృతి
  • ఒక్క ముంబైలోనే 18 మరణాలు
  • మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్​లో ఆందోళన

ముంబై: లాక్​డౌన్​లోనూ డ్యూటీ చేస్తున్న పోలీసులను వైరస్ కబళిస్తోంది. దేశంలోనే అత్యంత ఎక్కువగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా బారిన పడి పోలీసులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,500 మందికి పైగా పోలీసులు వైరస్ బారిన పడగా.. ఒక సీనియర్ ఆఫీసర్​తో సహా 30 మంది సిబ్బంది చనిపోయారని సీనియర్ అధికారి ఒకరు గురువారం మీడియాకు వెల్లడించారు. మొత్తం మృతులలో ఎక్కువగా 18 మంది కేవలం ముంబై పోలీసు బలగాలలో పనిచేస్తున్న వారేనని, లాక్​డౌన్ ఉత్తర్వులను అమలు చేస్తున్నప్పుడు ప్రాణాంతక వ్యాధి సంక్రమించిందని ఆయన చెప్పారు.

“ఇప్పటి వరకు, 2,500 మందికి పైగా రాష్ట్ర పోలీసు సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. అందులో ఒక అధికారి సహా.. 30 మంది మరణించారు”అని ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతానికి పోలీస్ డిపార్ట్ మెంట్​లో 191 మంది అధికారులతో సహా 1,510 కేసులు యాక్టివ్ గా ఉన్నాయన్నారు. లాక్​డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూల్స్ ఉల్లంఘన ఘటనల్లో 1,22,484 కేసులు నమోదు చేశామని, ఈ కేసుల్లో 28,820 మందిని అరెస్టు చేశామని చెప్పారు. రూల్స్ పాటించకుండా రోడ్లమీదకు వచ్చిన 77,435 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. లాక్ డౌన్ సమయంలో 6.38 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేసినట్లు అధికారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 72 వేలు దాటగా.. 2465 మంది మృత్యువాత పడ్డారు.