రెండు నెలల్లో 30 పులులు ఖతం

రెండు నెలల్లో 30 పులులు ఖతం

ఈ ఏడాదిలో గడిచిన రెండు నెలల్లోనే దేశంలో దాదాపు 30 పులులు చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.  జనవరి -మార్చి మధ్య పులుల మరణాలు సాధారణంగా పెరుగుతాయని, దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరమేం లేదని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) అధికారులు చెబుతున్నారు. కన్హా, పన్నా, రణతంబోర్, పెంచ్, కార్బెట్, సత్పురా, ఒరాంగ్, కజిరంగా, సత్యమంగళం రిజర్వ్‌లలో ఇప్పటివరకు ఈ పులుల మరణాలు నమోదయ్యాయి. ఈ30 పులులు కూడా 16 రిజర్వ్‌లకు వెలుపలే మరణించాయి. 

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.. ఈ రెండు రాష్ట్రాల్లో పులుల మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణం అక్కడ ఆరోగ్యకరమైన పులుల జనాభా ఎక్కువగా ఉండడమే. ఈ ఏడాది మరణాల సంఖ్య గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని, పులుల జనాభా పెరుగుదలతో సహజంగా మరణాల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంటున్నారు. NTCA డేటా ప్రకారం ఏ సంవత్సరంలోనైనా జనవరి - మార్చి నెలల మధ్య అత్యధిక సంఖ్యలో పులుల చనిపోతూంటాయని తమకు తెలుసని చెబుతున్నారు.  ఏటా 200 పులుల మరణాలు అవాంఛనీయమైనవి కావని NTCA సీనియర్ అధికారి తెలిపారు. దేశంలో పులుల జనాభా ఏటా 6% చొప్పున పెరుగుతోందని ఆయన అన్నారు.  పులి సగటు ఆయుర్దాయం 12 సంవత్సరాలు అని ఈ సంవత్సరం కూడా పులుల జనాభాలో 6% పెరుగుదల అంచనా వేయబడిందని స్పష్టం చేశారు. 2022లో 121 పులులు చనిపోగా.. అందులో గణాంకాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో 34, మహారాష్ట్రలో 28, కర్ణాటకలో 19 ఉన్నట్టు తెలుస్తోంది. 2021లో దేశవ్యాప్తంగా 127 పులుల మరణాలు నమోదయ్యాయి.

గత 10 సంవత్సరాలలో (2012-2022) మధ్యప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో పులులు చనిపోయాయి. జార్ఖండ్, హర్యానా, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్‌లలో అతి తక్కువ పులి మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు జరిగిన పులుల మరణాలు దాదాపు సహజ కారణాల వల్లే సంభవించాయని సమాచారం. అయితే అందులో వేటాడటం అనేది రెండవ అతిపెద్ద కారణంగా పేర్కొనవచ్చు. 2020లో 7, 2019లో 17, 2018లో 34 వేట కేసులు నమోదయ్యాయి.