ఈపీఎఫ్‌‌లో రూ. 300 కోట్ల స్కామ్‌

ఈపీఎఫ్‌‌లో రూ. 300 కోట్ల స్కామ్‌

కుంభకోణంలో 80 వేల సంస్థల పాత్ర
9 లక్షల ఉద్యోగుల అకౌంట్లు బ్లాక్‌

న్యూఢిల్లీ: ఎంప్లాయిస్‌‌ ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)లో భారీ స్కామ్‌ బయటపడింది. సాధారణ ఉద్యోగులను ఫార్మల్‌ ఎకానమీ (పన్నుల పరిధిలోకి)లోకి తీసుకురావడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి రోజ్‌‌గార్‌‌ ప్రోత్సాహన్‌ యోజన (పీఎంఆర్‌‌పీవై)ను అడ్డుపెట్టుకొని 80 వేల కంపెనీలు ఖజానాకు రూ.300 కోట్లు నష్టం చేసినట్టు నేషనల్‌ మీడియా తెలిపింది. ఇందుకోసం ఇవి తొమ్మిది లక్షల మంది లబ్ధిదారుల అకౌంట్లను వాడుకున్నాయి. ఫార్మల్‌ ఎకానమీ పరిధిలోకి రావడానికి కొత్త ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థికపరమైన ప్రయోజనాలను ఇవి తమ ఖాతాల్లో వేసుకున్నాయని ఈపీఎఫ్‌ఓ విచారణలో తేలింది. ఈపీఎఫ్‌వోలో చేరే కొత్త ఉద్యోగులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎంఆర్‌‌పీవైని ప్రవేశపెట్టింది. 2016 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ప్రకారం..అదే ఏడాది ఏప్రిల్‌ తరువాత ఉద్యోగంలో చేరిన వారికి ప్రోత్సాహకాలు దక్కు తాయి. అయితే, రూ.15 వేలలోపు జీతం ఉన్న కొత్త ఉద్యోగులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

కేంద్ర కార్మిక, ఉపాధిమంత్రిత్వశాఖ ఈపీఎఫ్‌ఓ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఎంప్లాయి పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌‌), ఎంప్లాయి ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ (ఈపీఎఫ్‌ )లకు నెల వాయిదాలను కొన్నాళ్లపాటు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈపీఎస్‌‌ కోసం లబ్ధిదారుని జీతంలో 12 శాతానికి సమాన మొత్తాన్ని మూడేళ్లపాటు ఇస్తుంది. ఇలా అందజేసిన నిధులను కంపెనీలు తమ సొంతానికి వాడుకున్నాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు కంపెనీల నుంచి రూ.222 కోట్లను రికవరీ చేసింది. దాదాపు తొమ్మిది లక్షల అకౌంట్లను బ్లాక్‌ చేసింది. గత ఏడాది జూన్‌ 16 వరకు కంపెనీలు పీఎంఆర్‌‌పీవై నిధులను కాజేయడానికి 8,98,576 ఖాతాలను వాడుకున్నట్టు ఈపీఎఫ్‌ఓ ఆఫీసర్లు గుర్తించారు. అయితే కొన్ని కంపెనీలకు అవగాహన లేక కూడా పొరపాట్లు దొర్లి ఉండవచ్చని ఈపీఎఫ్‌ఓ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఉంటే బాగుండేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అయితే ఈ పథకం వల్ల ఉద్యోగితో పాటు కంపెనీకి ప్రయోజనం ఉంటుంది. ఉపాధి కల్పించినందుకు ప్రభుత్వం కంపెనీకి కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంది.