- ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలపై వేటు
- ఇతర జిల్లాల్లో ఇస్తామని చెప్పి.. మళ్లీ కొత్త రిక్రూట్‍మెంట్లు
- న్యాయం చేస్తామన్న నేతలు పట్టించుకోవట్లే
వరంగల్, వెలుగు: వారంతా ఔట్‍సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు(ఓపీఎస్).. రెండేండ్ల క్రితం జాబ్లో చేరారు. సర్కారు తమను పర్మినెంట్చేస్తుందన్న ఆశతో ఎదురుచూస్తుంటే రాత్రికి రాత్రే టర్మినేట్ చేసింది. ఇతర జిల్లాల్లో పనిచేసిన ఎంప్లాయీస్‍ను వారి జిల్లాలకు తీసుకొచ్చే పేరుతో ఓపీఎస్‍ల ఉద్యోగాలను ఊడగొట్టింది. దీంతో పల్లెప్రగతి, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు అంటూ ఏండ్ల తరబడి ఊర్లు పట్టుకుని తిరిగిన ఓపీఎస్‍లు రోడ్డునపడి కన్నీరు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2018లో స్టేట్ పంచాయతీరాజ్ రిక్రూట్‍మెంట్ నోటిఫికేషన్ ద్వారా 9,355 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలను మూడేండ్ల ప్రొబెషన్ కింద రిక్రూట్ చేసింది. గ్రామాల్లో వీరి సేవలు సత్ఫలితాలు ఇవ్వడంతో సీఎం కేసీఆర్ 2020లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికో పంచాయతీ సెక్రటరీ ఉండాలని ఆర్డర్ వేశారు. అడహక్ బేసిస్ కింద తీసుకోవాలని సర్క్యూలర్ ఇష్యూ చేశారు. కలెక్టర్ల ఆదేశానుసారం డీపీఓలు ప్రాసెస్ నిర్వహించారు. ఎగ్జామ్, మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకున్నారు. వరంగల్‍తో పాటు ఇంకొన్నిచోట్ల రాజకీయ జోక్యంతో ఏజెన్సీ కింద రిక్రూట్ చేశారు. రెండు పద్ధతుల్లో స్టేట్ వైడ్ మొత్తం 3 వేల మందిని తీసుకోగా.. అందులో 2,200 మందిని జూనియర్ పంచాయతీ సెక్రటరీలుగా మార్చారు. మిగతా 800 మంది సైతం భవిష్యత్తులో తమకు అలానే అవకాశం వస్తుందని రూ.10,960 జీతంతో ఆశగా పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న పల్లెప్రగతి, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు, క్రిమిటోరియం, హౌజ్ టాక్స్ కలెక్షన్, శానిటేషన్, గ్రామ సభలు, పొలిటికల్ మీటింగ్స్తోపాటు చివరకు గ్రామగ్రామాన కొవిడ్ సర్వేలోనూ పాల్గొన్నారు.
ఓపీఎస్‍లను ‘వెకెంట్’గా చూపిన సర్కార్
రాష్ట్ర ప్రభుత్వం 317 జీఓ కింద ఉద్యోగ బదిలీలు చేసే క్రమంలో వివిధ జిల్లాల్లో పని చేస్తున్న ఓపీఎస్‍లను టర్మినేట్ చేశారు. ఇందులో భద్రాద్రి జోన్ పరిధిలోకి వచ్చే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 36 మంది, ఖమ్మం 25, వరంగల్ 22, హన్మకొండ 14, మహబూబాబాద్ 11, సంగారెడ్డి 45, వికారాబాద్ 11, నిజామాబాద్‍లో 74 మందితో పాటు ఇతరచోట్ల కలిపి మొత్తంగా 300 మందిని అకారణంగా రాత్రికిరాత్రి ఒక్క పోస్ట్ పెట్టి ఇండ్లకు పంపారు. ఇదే శాఖలోని గ్రేడ్ 01, 02, 03, 04 ఎంప్లాయీస్‍ను వారి సొంత జిల్లాలకు తీసుకొచ్చే క్రమంలో ఓపీఎస్‍ల స్థానాలను ‘వెకెంట్’గా చూపారు. ప్రభుత్వం ట్రాన్స్ఫర్ల పేరుతో ఓపీఎస్‍ల స్థానాలను ‘వెకెంట్’గా చూపడమే తప్పని భావిస్తుండగా ఒక్కో జిల్లాలో ఒక్కోలా వ్యవహరించారు. కొన్ని జిల్లాల్లో అధికారులు వారిని ఇండ్లకు పంపగా మెజార్టీ జిల్లాల్లో వారిని అలా చూపలేదు. అన్యాయం జరిగిన ఔట్‍సోర్సింగ్ సెక్రటరీలు కొన్ని రోజులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ వినోద్‍కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‍రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‍రెడ్డి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా, కమిషనర్ శరత్, రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతల వద్దకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. కాగా, పెద్దలు త్రిసభ్య కమిటీ వేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలా జరగని క్రమంలో ఓపీఎస్‍లు మొన్నటివరకు పనిచేసిన జిల్లాలకు దగ్గర్లోని జిల్లాల్లో తీసుకుంటామని చెప్పారు. ఆపై ఎవరూ స్పందించడం లేదని ఉద్యోగాలు కోల్పోయినవారు కన్నీరు పెడుతున్నారు. మరోవైపు రెగ్యులర్ ఉద్యోగుల బదిలీతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్త ఓపీఎస్‍లను రిక్రూట్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓపీఎస్‍లను వెకెంట్‍గా చూపడంతో.. జనగామకు చెందిన రెగ్యులర్ ఉద్యోగులు హన్మకొండ, వరంగల్ హెడ్‍క్వార్టర్ కు వచ్చారు. దీంతో జనగామలో 30 పోస్టులు ఖాళీ అయ్యాయి. తీరా వీటిని మళ్లీ ఓపీఎస్‍లతో నింపడం కోసం కొత్త రిక్రూట్‍మెంట్‍కు అడుగులు వేస్తున్నారు. పోనీ.. ఇక్కడైనా పాతవారికి అవకాశం ఇస్తున్నారా అంటే లేదు. ఈ లెక్కన ఓపీఎస్ ఉద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఓవైపు నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. రాష్ట్ర సర్కారు తీరుతో మరో 300 మంది రోడ్డున పడ్డారు. కరోనా కష్టకాలంలో తమ పొట్ట కొట్టకుండా న్యాయం చేయాలని ఓపీఎస్‍లు సర్కారును వేడుకుంటున్నారు.
