ఇంటిపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రూ.78 వేల సబ్సిడీ

ఇంటిపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రూ.78 వేల సబ్సిడీ
  •     కోటి కుటుంబాలకు పథకం వర్తింపు 
  •     ఒక్కో ఇంటికి నెలకు 300 యూనిట్ల ఫ్రీ కరెంట్
  •     మిగిలిన కరెంట్ ను డిస్కమ్​లకు అమ్ముకునేందుకు అవకాశం

న్యూఢిల్లీ: రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ ‘పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని రూ.75,021 కోట్లతో అమలు చేసేందుకు ఓకే చెప్పింది. ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. పీఎం–సూర్య ఘర్ స్కీమ్ కింద కోటి ఇండ్లపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం సబ్సిడీ అందజేస్తామని ఆయన తెలిపారు. ఒక్కో ఇంటికి నెలకు 300 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు. ‘‘గరిష్టంగా 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్స్ వరకు సబ్సిడీ అందజేస్తం. 2 కిలోవాట్ల వరకు సిస్టమ్ ఖర్చులో 60 శాతం సబ్సిడీ ఇస్తం. 2 కిలోవాట్ల నుంచి 3 కిలోవాట్ల వరకు అడిషనల్ సిస్టమ్ ఖర్చులో 40 శాతం అదనపు సబ్సిడీ అందజేస్తం. ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం.. ఒక కిలోవాట్ సోలార్ సిస్టమ్ కు రూ.30 వేలు, రెండు కిలోవాట్ల సిస్టమ్ కు రూ.60 వేలు, మూడు కిలోవాట్ల సిస్టమ్ కు రూ.78 వేల సబ్సిడీ వస్తుంది. సోలార్ సిస్టమ్ కు అయ్యే మిగతా ఖర్చు కోసం తక్కువ వడ్డీకే లోన్లు మంజూరు చేస్తం” అని వెల్లడించారు. ఈ పథకం కోసం pmsuryaghar.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

రూఫ్ టాప్ సిస్టమ్ జీవితకాలం 25 ఏండ్లు.. 

ఈ పథకం కింద ప్రజలకు కరెంట్ బిల్లు సేవ్ కావడంతో పాటు మిగిలిన కరెంట్ ను అమ్ముకొని ఆదాయం కూడా పొందవచ్చని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.  ‘‘3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు రూ.1.45 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో రూ.78 వేలు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన ఖర్చు కోసం బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే లోన్ తీసుకోవచ్చు. 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ సగటున నెలకు 300 యూనిట్లకు పైగా పవర్ జనరేట్ చేస్తుంది. ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్ల పవర్ ఫ్రీగా ఇస్తం. మిగిలిన కరెంట్ ను డిస్కమ్స్ కు  అమ్ముకుని ఆదాయం కూడా పొందవచ్చు” అని చెప్పారు. ఈ స్కీమ్ తో మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, సప్లై చెయిన్, సేల్స్, ఇన్ స్టాలేషన్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ తదితర రంగాల్లో 17 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. అలాగే కాలుష్యం తగ్గుతుందన్నారు. ‘‘ఈ పథకంతో మరో 30 గిగావాట్ల సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుంది. రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ జీవితకాలం 25 ఏండ్లు ఉంటుంది. అంటే అప్పటి వరకు 720 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.   

కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలివే.. 

దేశంలో మూడు సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని టాటా గ్రూప్, జపాన్ కు చెందిన రెనెసాస్ తదితర సంస్థలు రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నాయి. ప్లాంట్ల ఏర్పాటుకు రూ.76 వేల కోట్ల వరకు కేంద్రం సాయం చేయనుంది. ఇవి గుజరాత్, అస్సాంలో ఏర్పాటవుతాయి. రానున్న 100 రోజుల్లో పనులు మొదలుకానున్నాయి. 
    
రానున్న వానాకాలం సీజన్ లో ఎరువుల సబ్సిడీ కింద రూ.24,420 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న రేట్లకే డీఏపీ బస్తా క్వింటాల్ రూ.1,350, పొటాష్ క్వింటాల్ రూ.1,670కి లభిస్తుందని.. ఎన్పీకే బస్తా రూ.1,470కి వస్తుందని కేంద్రం తెలిపింది. పులులు, ఇతర జంతువులను సంరక్షించేందుకు ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయెన్స్’ పేరుతో గ్లోబల్ నెట్ వర్క్ ఏర్పాటుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి ఐదేండ్లకు రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించింది.