ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్టయిన 32 ఏళ్ల ముసలాయన

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్టయిన 32 ఏళ్ల ముసలాయన
  •  32 ఏళ్ల వ్యక్తి..81 ఏళ్ల వాడిగా..
  • అమెరికా చెక్కేయడానికి ప్లాన్‌‌‌‌
  • పసిగట్టిన సెక్యూరిటీ స్టాఫ్‌‌‌‌
  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్టు

న్యూఢిల్లీ: జయేశ్‌‌‌‌ పటేల్‌‌‌‌…అహ్మదాబాద్‌‌‌‌కు చెందిన 32 ఏళ్ల యువకుడు.. అమెరికాలో ఉద్యోగం  సంపాదించి  కొత్త జీవితాన్ని  ప్రారంభించాలనుకున్నాడు.   దానికి తగ్గట్టుగా స్కెచ్‌‌‌‌ వేశాడు. ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో న్యూయార్క్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌ ఎక్కడానికి రెడీ అవుతుండగా   అతడి ప్లాన్‌   బెడిసికొట్టింది..  కటకటాలు లెక్కపెడుతున్నాడు . ఇంతకీ అతను ఎలా పట్టుబడ్డాడంటే… ఎవరూ గుర్తుపట్టకుండా వేషం మార్చాలని  అనుకున్న పటేల్‌‌‌‌ 81 ఏళ్లున్న ముసలాడిలా  మారిపోయాడు.  దానికి తగ్గట్టుగా జుట్టు, గడ్డాన్ని  తెల్లగా డై చేసుకున్నాడు. అమ్రిక్‌‌‌‌ సింగ్‌‌‌‌ అని పేరు కూడా మార్చుకున్నాడు.  ఆ పేరుతో  పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ కూడా సంపాదించాడు.  ఢిల్లీ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో  సెక్యూరిటీ చెక్‌‌‌‌ను దాటేశాడు. ఇమ్మిగ్రేషన్‌‌‌‌ అధికారుల క్లియరెన్స్‌‌‌‌ కూడా పూర్తిచేసుకున్నాడు. ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో వీల్‌‌‌‌ చైర్ లో వెళ్తుండగా సెంట్రల్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ సెక్యూరిటీ ఫోర్స్‌‌‌‌ (సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌)  స్టాఫ్‌‌‌‌కు అనుమానం కలిగింది. లోతుగా చెక్‌‌‌‌ చేస్తే  గుట్టు రట్టయింది. వేషం మార్చుకుని అమెరికా చెక్కెద్దామనుకున్న పటేల్‌‌‌‌ ప్లాన్‌‌‌‌కు సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ చెక్‌‌‌‌ పెట్టారు.‘‘అతడి గొంతు ముసలాడి వాయిస్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ కాలేదు.  తెల్ల వెంట్రుకలున్నా.. శరీరం యంగ్‌‌‌‌గా ఉంది. ముఖం కూడా ముడతలు పడలేదు’’ అని సీఐఎస్ఎఫ్‌‌‌‌  ప్రతినిధి హేమేంద్ర సింగ్‌‌‌‌ చెప్పారు.

ఏజెంట్‌‌‌‌తో కుమ్మక్కై…

అమెరికా వెళ్లడానికి అవసరమైన డాక్యుమెంట్లు కోసం భరత్‌‌‌‌ అనే ఏజెంట్‌‌‌‌తో పటేల్‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నాడు.  అమెరికాకు వెళ్లగానే రూ.30 లక్షలు పంపిస్తానని ఏజెంట్‌‌‌‌తో  పటేల్‌‌‌‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా పంపించే ముందు ఢిల్లీ హోటల్‌‌‌‌లో పటేల్‌‌‌‌కు ముసలాడిగా ఏజెంట్‌‌‌‌ భరత్‌‌‌‌ మేకప్‌‌‌‌ చేయించాడు.  అదే గెటప్‌‌‌‌తో పటేల్‌‌‌‌ హోటల్‌‌‌‌ నుంచి ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌కు నేరుగా వచ్చాడు.  సెక్యూరిటీ చెక్‌‌‌‌, ఇమ్మిగ్రేషన్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌ పూర్తయిన తర్వాత సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ ఎలర్ట్‌‌‌‌ కావడంతో  పటేల్‌‌‌‌ను వాళ్లు అరెస్టు చేశారు. ఇలాంటి సంఘటన ఢిల్లీ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో తాము  ఎప్పుడూ చూల్లేదని సీనియర్‌‌‌‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.