
- నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలో ఘటన
దేవరకొండ, వెలుగు : ఫుడ్ పాయిజన్ కావడంతో ఆశ్రమ పాఠశాలలోని 33 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 300 మందికి పైగా స్టూడెంట్లు ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం విద్యార్థినులకు స్నాక్స్‌గా బొబ్బర్లు పెట్టిన అనంతరం చికెన్‌తో డిన్నర్ ఏర్పాటు చేశారు. అది తిన్న తర్వాత కొందరు స్టూడెంట్లు వాంతులు చేసుకోవడంతో ఏఎన్ఎం ఫస్ట్ ఎయిడ్ చేశారు.
సోమవారం ఉదయం పులిహోరా తిన్న తర్వాత స్టూడెంట్లు మరోసారి వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో పాటు కడుపునొప్పితో బాధపడ్డారు. గమనించిన స్కూల్ సిబ్బంది వెంటనే తూర్పుపల్లి పీహెచ్‌సీ, దేవరకొండ హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో రమణారెడ్డి, ఆఫీసర్లు దేవరకొండ హాస్పిటల్‌కు చేరుకొని స్టూడెంట్లను పరామర్శించి, హాస్పిటల్ సూపరింటెండెంట్ రవిప్రకాశ్‌తో మాట్లాడి స్టూడెంట్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. స్టూడెంట్ల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. అస్వస్థతకు గురైన స్టూడెంట్లను బీసీ సంఘం, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు పరామర్శించారు.