
నీట్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ‘ఈడబ్ల్యూఎస్’ రూపంలో మరో శుభవార్త అందనుంది. మరో 387 ఎంబీబీఎస్ సీట్లు యాడ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూస్) 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే 25 శాతం సీట్లు పెంచాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర వైద్యవిద్య విభాగం విజ్ఞప్తి చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం ఈ ఏడాది ఎంబీబీఎస్ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాల్సి ఉంది. జనరల్ కోటా సీట్లు తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాలన్న నిబంధన ఉండటంతో సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ర్టంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,250 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇటీవల 2 కాలేజీల్లో 300 సీట్లకు ఎంసీఐ అనుమతి ఇచ్చింది. దీంతో సీట్ల సంఖ్య 1,550కి చేరింది. ఇందులో 10 శాతం అంటే 155 సీట్లు పెంచితే చాలు. కానీ, ఏ రకంగా చూసినా మొత్తం సీట్ల సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పాటించాలన్న మరో నిబంధన ఉంది. ఉదాహరణకు ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలిపి మొత్తం 100 సీట్లు ఉన్నాయనుకుంటే, ఇందులో లెక్క ప్రకారం 49% సీట్లు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయించాలి. ఇలా కాకుండా ఈడబ్ల్యూఎస్‌కు 10 సీట్లు వదిలేసి, మిగతా 90 సీట్లలో 49% సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేస్తే 5 సీట్లు తగ్గుతాయి. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు విరుద్ధం. మొత్తం 1,550 సీట్లలో 25% అంటే మరో 387 సీట్లు పెంచాల్సి ఉంది.
ప్రభుత్వం అనుమతిస్తేనే..
ఎంసీఐ అనుమతి ఇచ్చినా, రాష్ర్ట ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపైనే రిజర్వేషన్ల అమలు ఆధారపడి ఉంటుంది. ఎంబీబీఎస్ సీట్ల విషయంలో ప్రభుత్వం పాజిటివ్‌గా స్పందించే అవకాశముందని వైద్య విద్య వర్గాలు అంటున్నాయి. ఇదే జరిగితే, కొత్తగా పెంచబోయే సీట్లకు తగ్గట్టుగా కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది.